
భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
ప్రచురణార్ధం/ప్రసారార్ధం :
విజయవాడ,
తేది : 16 సెప్టెంబర్, 2026.
యుపిఐ లావాదేవీలపై చార్జీలు వెంటనే ఉపసంహరించుకోవాలి. - సిపిఐ(యం)
కేంద్ర ప్రభుత్వం యుపిఐ లావాదేవీలపై చార్జీలు విధించడాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తున్నది. యుపిఐ ఛార్జీలు విధించడం ద్వారా ఇప్పటికే ధరలు పెరిగి ఇబ్బంది పడుతున్న పేద, మధ్య తరగతిపై అదనపు భారాలు వేయడాన్ని వ్యతిరేకిస్తున్నది. వినియోగదారులపై సంవత్సరానికి రూ.20 వేల కోట్లు అదనపు భారం పడుతోంది. ఇందులో అత్యధికభాగం అమెరికా కంపెనీలకు పోతుంది.
అమెరికా ఫైనాన్స్ కంపెనీల ఒత్తిడికి కేంద్రం తలొగ్గి నగదు లావాదేవీలను తగ్గించాలని ప్రచారం చేసి ప్రజలచే యుపిఐ వాడకాన్ని అలవాటు చేసింది. తీరా ప్రజలందరు యుపిఐ ద్వారా చెల్లింపులకు అలవాటు పడిన తరువాత చార్జీలు విధించడం ప్రజలను దగా చేయడమే. వినియోగదారునిపై చార్జీ లేకుండా వ్యాపారస్తునికి చార్జీ పడుతుందనే ప్రభుత్వ వాదన పసలేనిది. అంతిమంగా వినియోగదారునికే భారం పడుతుందన్నది వాస్త్తవం. రూ.2000లు పైబడిన చెల్లింపులకే వర్తిసుంది, 95% మందికి భారంపడదు అనేది వాస్తవం కాదు. ద్రవ్యోల్బణం పెరిగిన నేపథ్యంలో 95% మంది ప్రజలపై భారం పడుతుంది. కేవలం కిళ్ళీ, సిగరేట్ బడ్డీ కొట్టులు తప్ప మిగిలిన వ్యాపారస్తులందరూ ఛార్జీలు చెల్లించాలి. ఆ భారాన్ని వారు వినియోగదారులపైనే మోపుతారన్నది అనుభవం.
కాబట్టి పేద, మధ్యతరగతిపై నడ్డి విరగొట్టే యుపిఐ చార్జీలు ఉపసంహరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తున్నది. ఇటువంటి ఛార్జీలు విధించకుండా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని తెలుగుదేశం, జనసేన పార్టీలకు విజ్ఞప్తి చేస్తున్నది. రాష్ట్రంలో ప్రజలందరూ ఈ ఛార్జీలను వ్యతిరేకించాలని కోరుతున్నది.
(వి.శ్రీనివాసరావు)
రాష్ట్ర కార్యదర్శి
