ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ సెప్టెంబర్ నెలాఖరు వరకు పొడిగించాలని, ఓట్లు తొలగించబడిన, నోటీసులు జారీ చేసినవారి లిస్టులను బహిరంగ పర్చాలని, జాబితా రాజకీయ పార్టీలకు ఇవ్వాలని కోరుతూ.

ఓటు పరిరక్షణ వేదిక

ఆంధ్రప్రదేశ్

 

విజయవాడ,

తేది : 15 సెప్టెంబర్, 2026.

 

ఛీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ గారికి,

ఆంధ్రప్రదేశ్.

 

విషయం: ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ సెప్టెంబర్ నెలాఖరు వరకు పొడిగించాలని, ఓట్లు తొలగించబడిన, నోటీసులు జారీ చేసినవారి లిస్టులను బహిరంగ పర్చాలని, జాబితా రాజకీయ పార్టీలకు ఇవ్వాలని కోరుతూ...

అయ్యా!

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల సంఘం చేపట్టిన ఎసఐఆర్ ప్రక్రియ వలన తొలిదశలో 44.89 లక్షల మంది ఓట్లు ముసాయిదా జాబితాలో లేకుండా పోయాయి. 15.22 లక్షల ఓట్లను మృతి చెందిన వారిగా గుర్తించారు. మరో 7.37 లక్షల ఓట్లను రెండు, మూడు చోట్ల నమోదైన ఓట్లుగా ప్రకటించారు. 22.30 లక్షల ఓట్లను ఆచూకీ లేనివారిగా ప్రకటించారు. మరణించిన వారు, డబుల్ ఎంట్రీ ఓట్లుగా పేర్కొన్న వాటిలో కూడా కొన్ని లోపాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. 22 లక్షలకు పైగా వలస వెళ్లిన వారిని ఆచూకీ లేనివారిగా ప్రకటించి వారికి ఓటు హక్కు లేకుండా చేయటం అప్రజాస్వామికం. ముసాయిదా ఓటర్ల జాబితా ప్రకటించిన అనంతరం మరో 44,21,763 మందికి సాంకేతిక, చిన్న, చిన్న కారణాలు, సాకులతో మరో 7.3 లక్షల ఓట్లు మ్యాపింగ్ కాని ఓట్లుగా నోటీసులు జారీచేయటంతో ఓటర్లు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. ఆందోళన చెందుతున్నారు. ఇందులో 36 లక్షల మందికి పైగా పేరు, తండ్రి లేదా భర్త పేర్లు, వయసు, చిన్న చిన్న సాంకేతిక లోపాలు ఉన్నాయనే నెపంతో ఈ నోటీసులు జారీ చేయటం గర్హనీయం.

ఈ నోటీసుల్లో పొరపాటు సమాచారం ఇస్తే జైలు, కఠిన శిక్షలు ఉంటాయని హెచ్చరిస్తూ ఓటర్లను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. కుటుంబంలోని ప్రతి సభ్యుడు ఈ విచారణకు హాజరుకావలసిన పరిస్థితి తలెత్తింది. తమ వృత్తులు మానుకొని అధికారులు, కార్యాలయాలు చుట్టూ తిరగవలసిన దుస్థితి ఏర్పడింది. ఉపాధి, చదువు ఇతర కారణాలతో దూరప్రాంతాల్లో ఉన్నవారు విచారణకు రాలేక మరింత ఆందోళనకు గురవుతున్నారు. వారి ఓటు హక్కు పోతుందనే భయాందోళనకు లోనవుతున్నారు. ఓటర్ల వద్ద ఉన్న ప్రభుత్వం ఇచ్చిన ఆధార్ (గుర్తింపుకోసం తప్ప ఇతర వివరాలు పరిగణనలోకి తీసుకోదు), రేషన్, ఓటు కార్డులను పరిగణనలోకి తీసుకోకుండా పాస్ పోర్ట్, జనన ధ్రువీకరణ, కుల సర్టిఫికెట్లు ఇతర అందుబాటులోలేని సర్టిఫికెట్లు తేవాలని నిబంధనలు పెడుతున్నారు. 2002 మరియు తాజా ఓటర్ల జాబితాలలో అక్షర దోషాలకు ఎన్నికల సంఘం బాధ్యత వహించాలి. తప్పు అధికారులది కాగా, ఓటర్లను శిక్షించడం తగదు. తాత, తండ్రి, ఓటరు వయసు వ్యత్యాసాలు తక్కువగా ఉన్నాయని, ఎక్కువగా ఉన్నాయని చెబుతూ నోటీసులు ఇవ్వడం, వారి పుట్టుకనే ప్రశ్నించడం వారి ఆత్మ గౌరవాన్ని దెబ్బతీస్తున్నది, మనోవేదనకు గురిచేస్తున్నది. విచారణకు హాజరైన వారిని పత్రాలతో, పలకలు పెట్టి నేరస్తులను ఫోటోలు తీసినట్టు ఫోటోలు తీయటం తీవ్ర అభ్యంతరకరం. పలుచోట్ల నోటీసులు కూడా ఇవ్వకుండానే ఫోన్ల ద్వారా సమాచారం ఇచ్చి సరిపెడుతున్నారు. పూర్తి సమాచారం ఓటర్లకు సమగ్రంగా అందటం లేదు. ఇంకా 2.33 లక్షల మంది నుండి నోటీసులకు సమాధానం రాలేదు.

గతంలో సుప్రీం కోర్టు అనేక సందర్భాలలో అక్షరదోషాలను (క్లరికల్ మిస్టేక్స్) సరిదిద్దాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదేనని స్పష్టంగా తీర్పులిచ్చినప్పటికీ దాన్ని పరిగణనలోకి తీసుకోవడం లేదు. రాష్ట్రంలో తెలుగును ప్రామాణికంగా తీసుకోవాల్సి ఉండగా దాన్ని పక్కనపెట్టి ఆంగ్లంలోని అక్షర దోషాలపై నోటీసులివ్వడం రాజ్యాంగ ధిక్కరణే. 2002లో ఏ ఓటరూ స్వయంగా దరఖాస్తు రాసివ్వలేదు. బిఎల్‌వోలే ఇంటింటికీ తిరిగి నమోదు చేసుకున్నారు. అది తెలుగైనా, ఇంగ్లీషు అయినా బాధ్యత ఎన్నికల సంఘానిదే. ఎన్నికల సంఘం అప్రజాస్వామిక నిబంధనల వలన రాష్ట్రంలో గతంలో 22 లక్షల మందికి, నేడు మరో 44 లక్షల మంది మొత్తం 66 లక్షల మంది ఓటు హక్కుకు ముప్పు ఏర్పడుతున్నది. ప్రజాస్వామ్య ప్రక్రియకు ఇది తీరని హానిచేస్తుంది. కావున సర్ ప్రక్రియను ఓటు హక్కును కాపాడే విధంగా, రాజ్యాంగ స్పూర్తికనుగుణంగా మార్చాలి.

(1) ఓటు నమోదు ప్రక్రియకు గడువు సెప్టెంబర్ ఆఖరు వరకు పొడిగించాలి.

(2) 18 సంవత్సరాలు నిండిన అర్హులందరికీ ఓటు హక్కు కల్పించాలి. ఇంటింటికీ తిరిగే ప్రత్యేకమైన క్యాంపెయిన్ చేపట్టాలి. దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికి ముట్టినట్లు రశీదు ఇవ్వాలి.

(3) ఇంటింటికి తిరిగి ఓటు కల్పించడం, జాబితాలో తప్పులు, లోటుపాట్లను సరిదిద్దే బాధ్యత ఎన్నికల సంఘం తీసుకోవాలి.

(4) ఓటర్ల విచారణకు, లోపాలు సరిచేయటానికి సమయం పొడిగించాలి.

(5) రాష్ట్రంలో 22 లక్షలకుపైగా వలస వెళ్లినవారికి ఓటుహక్కు కల్పించడానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలి.

(6) కొత్త ఓటర్ల చేర్పింపు, లోపాలు సరిచేయటం, అడ్రస్ మార్పులు తదితర ప్రక్రియను అధికార యంత్రాంగమే చేపట్టాలి.

(7) ఓటర్ల విచారణ మౌఖికంగానే కాకుండా వీడియోకాల్ ద్వారా కూడా చేయాలి.

(8) సిబ్బంది సంఖ్యను పెంచాలి. సిబ్బందిపై అదనపు భారంవేసి వేధించడం మానుకోవాలి. ఎన్యూమరేషన్ కాలంలో వారికి ఇతర బాధ్యతలు లేకుండా చూడాలి.

(9) నిర్దేశించిన సమయానికి విచారణకు హాజరై రుజువు చేసుకోవాలనే నిబంధనలు తొలగించాలి.

(10) ఓటర్ల వద్ద అందుబాటులో ఉండే ప్రామాణికమైన ఆధార్, రేషన్, ఓటు తదితర ప్రభుత్వం ఆమోదించిన 15 రకాల కార్డులను పరిగణలోకి తీసుకొని అందరికీ ఓటు హక్కు కల్పించాలి. విద్యార్థులు, ఉద్యోగులకు వారి ఐడి కార్డులను ఆమోదించాలి.

(11) 2002 ఓటర్ల జాబితాలో నమోదైన పేర్లను ప్రామాణికంగా తీసుకునే నిబంధనలు పూర్తిగా తొలగించాలి.

(12) ఎన్నికల జాబితాలను పారదర్శకంగా మరియు ప్రజా పరిశీలనకు ఉంచాలి. ఈ జాబితాలను ఎన్నికల కార్యాలయాలు, గ్రామ/ వార్డు సచివాలయాలు, పోలింగ్ కేంద్రాలు మరియు సిఈవో వెబ్‌సైట్‌లో ప్రజలకు సులభంగా అందుబాటులో ఉంచాలి.

(13) అదే విధంగా గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు, వారి బూత్ లెవెల్ ఏజెంట్‌లకు మరియు ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షించే పౌర సంఘాలకు ఈ జాబితాలను డిజిటల్ మరియు ముద్రిత రూపాల్లో అందించాలి.

పై సూచనల అమలుకు తగు చర్యలు తీసుకోవలసిందిగా కోరుతున్నాము.

అభివందనములతో...

 

(ఎస్.రాజేంద్ర ప్రసాద్)

కన్వీనర్

(బండ్ల శ్రీనివాస్)

రిటైర్డ్ ఐఏయస్

 

(ఎ.బి.వెంకటేశ్వరరావు)

సెంటర్ ఫర్ లిబర్టీ

 

 

(కె.యస్.లక్ష్మణరావు)

మాజీ ఎమ్మెల్సీ

 

(వడ్డే శోభనాద్రీశ్వరరావు)

మాజీ మంత్రి

 

(చలసాని శ్రీనివాస్)

ప్రత్యేకహొదా సాధన సమితి

 

(మల్లాది విష్ణు)

వైఎస్సార్‌సిపి

(వి.శ్రీనివాసరావు)

సిపిఐ(యం)

 

(జి.ఈశ్వరయ్య)

సిపిఐ

 

(కె.శివాజి)

కాంగ్రెస్

 

(పి.ప్రసాద్)

సిపిఐ(యంఎల్) న్యూడెమోక్రసీ

(ఎ.ఉదయ్ కిరణ్)

సిపిఐ(యంఎల్) లిబరేషన్

 

(పి.వి.సుందరరామరాజు)

ఫార్వర్డ్ బ్లాక్

 

(బి.ఎస్.అమర్‌నాథ్)

యస్‌యుసిఐ(సి)

 

(యం.రామకృష్ణ)

సిపిఐ(యంఎల్) న్యూడెమోక్రసీ

 

(వై.వెంకటేశ్వరరావు)

సిపిఐ(యం)

 

(ఎన్.జె.విద్యాసాగర్)

విసికె పార్టీ

 

(కొరివి వినయ్‌కుమార్)

డిబిఎఫ్

 

(కాటం నాగభూషణం)

యంసిపిఐ(యు)

 

(జాస్తి కిశోర్‌బాబు)

సిపిఐ(యంఎల్)

 

(వి.లక్ష్మణరెడ్డి)

జనచైతన్య వేదిక