పారా మెడికల్ విద్యార్థులపై పోలీసుల దౌర్జన్యం, అరెస్టులకు ఖండన..

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
ప్రచురణార్ధం/ప్రసారార్ధం :
విజయవాడ,
తేది : 12 సెప్టెంబర్, 2026.

పారా మెడికల్ విద్యార్థులపై పోలీసుల దౌర్జన్యం, అరెస్టులకు ఖండన
-సిపిఐ(యం)
తిరుపతిలో పారా మెడికల్ విద్యార్థులపై పోలీసుల దౌర్జన్యం, అక్రమ అరెస్టులను సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తున్నది. మహిళా విద్యార్థినులపై అక్రమంగా దౌర్జన్యం చేసిన పోలీసులపై చర్య తీసుకోవాలని రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తున్నది.
తిరుపతిలో గత 10 రోజుల నుండి పారా మెడికల్ విద్యార్థులు తమ స్టైఫండ్ పెంచాలని శాంతియుతంగా ఆందోళనలు చేస్తున్నారు. ఆందోళనలో భాగంగా ఈరోజు శాంతియుతంగా ప్రదర్శన నిర్వహించి తిరిగి వస్తున్న విద్యార్థినులపై పోలీసులు విరుచుకుపడడం గర్హనీయం. విద్యార్థి నాయకురాలు సునీతను జుట్టుపట్టుకొని లాగడం, విద్యార్థులను గాయాలయ్యే విధంగా కొట్టారు. అంతేకాకుండా వీరి ఆందోళనకు మద్దతిస్తున్న ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు పి.రామ్మోహన్, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పవిత్ర, అక్బర్‌తో సహా 10 మంది పారా మెడికల్ విద్యార్థులను అరెస్టు చేశారు.
ప్రజాస్వామ్యయుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థుల సమస్యలు పరిష్కరించకుండా ప్రభుత్వం నిర్బంధంతో అణచివేయాలని చూడడం దుర్మార్గం. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే వారి సమస్యలను పరిష్కరించాలని సిపిఐ(యం) కోరుతున్నది. అలాగే మహిళా విద్యార్థులపై అమానుషంగా ప్రవర్తించిన పోలీసులపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నది.

(వి.శ్రీనివాసరావు)
రాష్ట్ర కార్యదర్శి