
భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
ప్రచురణార్ధం/ప్రసారార్ధం :
విజయవాడ,
తేది : 08 సెప్టెంబర్, 2026.
డిఎస్సీ స్పోర్ట్స్ కోటాలో జరిగిన అవకతవకలపై స్వతంత్ర సంస్థతో విచారణ జరిపి ప్రభుత్వం తమ నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలి
-సిపిఐ(యం)
స్పోర్ట్స్ కోటాపై వస్తున్న విమర్శలకు ప్రభుత్వం చెబుతున్న వివరణ మరిన్ని కొత్త సందేహాలను కలిగిస్తున్నది. ఉద్యోగ నియామాకాల్లో మార్గదర్శకాలను ఇష్టానుసారంగా మార్చుకున్నట్లు అనేక ఆధారాలు ఇటీవల వెలుగులోకి వస్తున్నాయి. కొద్దిమందిని ఇప్పటికే అరెస్టు చేయడం, మరికొన్ని ఘటనలపై విచారణ చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించడం ద్వారా స్పోర్ట్స్ కోటా నియామకాల్లో అవకతవకలు జరిగినట్లు స్పష్టమవుతున్నది. వీటిపై ప్రభుత్వం సమగ్రంగా, నిస్పక్షపాతంగా విచారణ జరిపి నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తున్నది.
సచివాలయ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
సచివాలయ ఉద్యోగులకు ప్రొబేషన్ కాలాన్ని రెగ్యులర్ సర్వీసుగా పరిగణించాలని, నోషనల్ ఇంక్రిమెంట్లు, బకాయి పడిన డిఏ, హెచఆరఏ వెంటనే విడుదల చేయాలని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తున్నది. సచివాలయ ఉద్యోగుల ఆందోళనకు సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ మద్దతు ప్రకటిస్తున్నది. ఆరేళ్ళ సర్వీసు పూర్తయిన వారికి స్పెషల్ గ్రేడ్ స్కేలు మంజూరు చేయాలి. వార్షిక ఇంక్రిమెంట్లు నుండి కనీస మలవేతనం రూ.30వేలకు తగ్గకుండా అమలు చేయాలి. సచివాలయ ఉద్యోగులకు నష్టం కలిగించే జివో నెంబర్ 11ను రద్దు చేయాలి. న్యాయమైన సచివాలయ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం వారితో వెంటనే చర్చలు జరిపి పరిష్కరించాలని సిపిఐ(యం) డిమాండ్ చేస్తున్నది.
కానిస్టేబుల్ నియామకాలు వెంటనే చేపట్టాలి
పోలీసు శాఖలో 19,999 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు వాటిని త్వరలోనే భర్తీ చేస్తామని గతంలో హోమ్ శాఖామాత్యులు ప్రకటించారు. ఇందులో 11,639 పోస్టులకు ఆర్థిక శాఖ అనుమతించినట్లు ప్రచారం జరిగింది. అయితే కేవలం 1600 పోస్టులకు మాత్రమే ఇప్పుడు నోటిఫికేషన్ ఇవ్వడంపట్ల యువతలో తీవ్ర నిరసన, ఆగ్రహం వ్యక్తమవుతున్నది. ప్రభుత్వం గతంలో ప్రకటించిన విధంగా సుమారు 20 వేల పోస్టులను తక్షణం భర్తీ చేయాలని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తున్నది. నిరుద్యోగులు చేస్తున్న ఆందోళనకు సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ మద్దతు ప్రకటిస్తున్నది.
నిరుద్యోగులపై నిర్బంధానికి ఖండన
కాకినాడలో ధర్నా చేసిన నిరుద్యోగులు, వారికి మద్దతుగా నిలబడ్డ ఎస్ఎఫ్ఐ , డివైఎఫ్ఐ నాయకులకు పోలీసులు నోటీసులిచ్చి వేధించడం, రాజా, సూరిబాబు, రాజేష్ సహా 20 మందిపై కేసులు బుక్ చేయడాన్ని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తున్నది. నిరుద్యోగులకు శిక్షణ ఇస్తున్న కోచింగ్ సెంటర్ యజమాని శ్యామ్‌ను బెదిరించడమే కాకుండా అక్రమ కేసు నమోదు చేయడం సరైంది కాదు. వారిపై పెట్టిన కేసులు ఉపసంహరించుకోవాలని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ కోరుతున్నది.
(వి.శ్రీనివాసరావు)
రాష్ట్ర కార్యదర్శి
