పోలవరం జిల్లా చింతూరు డివిజన్‌లో గత వారం చనిపోయిన ఆదివాసీ చిన్నారుల కుటుంబాలను ఆదుకోవాలని కోరుతూ..

(ప్రచురణార్థం: సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ముఖ్యమంత్రికి వ్రాసిన లేఖను ప్రచురణార్ధం పంపుతున్నాం. ` జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి)

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
విజయవాడ,
తేది : 07 సెప్టెంబర్, 2026.

శ్రీయుత నారా చంద్రబాబునాయుడు గారికి,
గౌరవ ముఖ్యమంత్రి,
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం,
అమరావతి.
   విషయం:  పోలవరం జిల్లా చింతూరు డివిజన్‌లో గత వారం చనిపోయిన ఆదివాసీ చిన్నారుల కుటుంబాలను ఆదుకోవాలని కోరుతూ...
అయ్యా!
పోలవరం జిల్లా చింతూరు డివిజన్ ఎటపాక, కూనవరం మండలాల్లో (ఆగష్టు 28 - సెప్టెంబర్ 1 మధ్య) వారం రోజుల్లో ఆదివాసీ కుటుంబాలకు చెందిన ముగ్గురు చిన్నారులు మరణించారు. వారి వివరాలు ఇందువెంట జతచేస్తున్నాను. ఆ కుటుంబాలకు ఆర్థికంగా చేయÖతనిచ్చి ఆదుకోవాలని కోరుతున్నాను.
ఎటపాక మండలం గొల్లగుప్ప గ్రామం ప్రధాన రహదారికి 5 కిలోమీటర్ల లోపలకు ఉంటుంది. ఎలాంటి రహదారి సౌకర్యం లేదు. గ్రామంలో కరెంటు లేదు. ఆశా వర్కర్ లేరు. ఈ ప్రాంతంలో మలేరియా విజృంభిస్తున్నది. దీన్ని అరికట్టేందుకు ముందస్తు చర్యలు తీసుకోడానికి బదులుగా ఆరోగ్య శాఖ నిబంధనలకు విరుద్దంగా మలేరియా సోకిన పిల్లలకు క్లోరోక్విన్ మాత్రలు పంచారు. వాటిని తీసుకున్న 40 మంది పిల్లలు ఆస్పత్రిపాలయ్యారు. జమున అనే 7 సంవత్సరాల పాప చనిపోయింది. దీనికి రెండు రోజుల ముందు రోజా అనే 10 సంవత్సరాల పాపకు జ్వరం వచ్చి ఆస్పత్రిలో చేరాక చనిపోయింది. ఐదు రోజుల క్రితం కూనవరం మండలం ఫల్లూరు గ్రామానికి చెందిన 4 సంవత్సరాల పాప తెల్లం జాహ్నవి కోతులగుట్ట ఎ.పి. గిరిజన ఆశ్రమ పాఠశాల హాస్టల్‌లో ఉంటూ వాంతులు చేసుకొని కుప్పకూలి పోయింది. ఆస్పత్రికి వెళ్ళేలోగానే చనిపోయింది.
ఇంతటి దారుణాలకు కారణాలు పరిశీలించి చర్యలు తీసుకోడానికి బదులుగా స్థానిక యంత్రాంగం ఈ ఘటనలు వెల్లడి కాకుండా శతవిధాలా ప్రయత్నించింది. జమునకు అర్థరాత్రి పోస్ట్‌మార్టం చేసి అంత్యక్రియలు హడావుడిగా జరిపించారు.స్థానిక సిపిఐ(యం) నాయకులు పరామర్శకు వెళ్ళకుండా పోలీసులు అరెస్టు చేసి అడ్డుకున్నారు. జమున డెత్ సర్టిఫికేట్‌ను తారుమారు చేసే ప్రయత్నం చేశారు. జాహ్నవి ఘటన బయటకు పొక్కకుండా తోటి విద్యార్థులను హాస్టల్ నుండి ఇళ్లకు పంపించేశారు. ఈ కుటుంబాలను ఉన్నతాధికారులుగానీ, ప్రజా ప్రతినిధులు గానీ ఎవరూ వచ్చి కనీసం పరామర్శించలేదు. బాధిత తల్లిదండ్రులను ఓదార్చలేదు. అంత్యక్రియలకు కొంత డబ్బు పంపి దులిపేసుకున్నారు. ఢిల్లీ, కాకినాడ నుండి వైద్య బృందాలు వచ్చినా బయటకు తెలియనివ్వలేదు. ఇది అత్యంత అమానవీయం.
మీరు స్వయంగా జోక్యం చేసుకొని మలేరియా నివారణకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను. శుభ్రమైన మంచినీరు, ఆశాల నియామకం, రోడ్డు, కరెంటు సరఫరాకు చర్యలు తీసుకోవాలని, భవిష్యత్తులో ఇలాంటి మరణాలు సంభవించకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను.
బిడ్డలను కోల్పోయిన ఆ తల్లిదండ్రులను ఓదార్చడం ఎవరివల్లా కాదు. కనీసం వారు వీధుల్లో పడకుండా కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. రోజా, జమున, జాహ్నవి కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున ఆర్థిక సహాయం, ఇల్లు, ఇంటికి ఒక ఉద్యోగం, సాగు భూమి లేదా సాగుచేసుకుంటున్న భూములకు పట్టాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నాను.
అభివందనములతో...

(వి.శ్రీనివాసరావు)
రాష్ట్ర కార్యదర్శి