స్మార్ట్ మీటర్ ప్రాజెక్టులో 2500 కోట్లు అక్రమ చెల్లింపులు న్యాయ విచారణ జరపాలి.

(ఈరోజు (06 సెప్టెంబర్) సిపిఐ(యం) విలేకర్ల సమావేశం (విజయవాడలో) జరిగింది. ఆ వివరాలను ప్రచురణార్థం/ ప్రసారార్థం పంపుతున్నాము. - జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి)

స్మార్ట్ మీటర్ ప్రాజెక్టులో 2500 కోట్లు అక్రమ చెల్లింపులు
న్యాయ విచారణ జరపాలి
ఇళ్లకు స్మార్ట్ మీటర్లు బిగించొద్దు
సిపిఎం రాష్ట్రకార్యదర్శి వి.శ్రీనివాసరావు డిమాండ్

వ్యవసాయ స్మార్ట్ మీటర్ల ప్రాజెక్టులో అక్రమ చెల్లింపులపై న్యాయవిచారణ జరిపి డబ్బులు తిరిగి రాబట్టాలని సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. విజయవాడలోని ఎంబి విజ్ఞాన కేంద్రంలో ఆ పార్టీ రాష్ట్రకార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్ బాబూరావుతో కలిసి ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. స్మార్ట్ మీటర్ల ఒప్పందం రద్దు చేసుకున్నందుకు పరిహారంగా రూ.764కోట్లు ఎపిఎస్పిడిసిఎల్ షీర్డిసాయి కంపెనీకి అక్రమంగా చెల్లించిందని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఎపిఇఆర్‌సి) అనుమతి లేదని, దీనిపై బహిరంగ విచారణ కూడా జరపకుండా రహస్యంగా డబ్బులు చెల్లించారని తెలిపారు. వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు బిగించేందుకు వైసిపి హయాంలో షీర్డీ సాయి ఎలక్ట్రికల్ తో ఒప్పందం కుదిరిందని తెలిపారు. మీటర్లు పెట్టకముందే రూ.1800కోట్లు అక్రమంగా షీరీసాయి ఎలక్ట్రికల్ కంపెనీకి గత ప్రభుత్వం చెల్లించిందని చెప్పారు. ఈ అంశంపై రైతు సంఘాలు తీవ్రంగా వ్యతిరేకించి పెద్దఎత్తున  ఆందోళనలు నిర్వహించడంతో మీటర్ల ఏర్పాటు నిర్ణయాన్ని నిలిపివేశారని తెలిపారు. ఈ స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా టిడిపి నాయకులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ వేశారని గుర్తు చేశారు. ఎన్నికలకు ముందు చేసిన వాగ్దానానికి భిన్నంగా ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఈ ఒప్పందం రద్దు కోసం అదే షీర్డిసాయి ఎలక్ట్రికల్ కంపెనీకి రూ.764కోట్లు చెల్లించడం అక్రమం అన్నారు. ఇంత రహస్యంగా చెల్లించాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నించారు. మూడు డిస్కంలకు షీర్డిసాయి కంపెనీకి మీటర్లు, అనుబంధ, సాఫ్ట్‌వేర్ ఖర్చుల పేరుతో సుమారు రూ.2500కోట్లు కూటమి ప్రభుత్వం చెల్లించిందని తెలిపారు. తిరిగి ఈ భారాన్ని ప్రజలపైనే మోపుతారు. ప్రతిపక్షంలో ఉండగా స్మార్ట్‌మీటర్లు, సెకీ ఒప్పందాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన కూటమి ప్రభుత్వం ఇప్పుడు వాటినే కొనసాగిస్తోందని విమర్శించారు.
విద్యుత్ రంగాన్ని లూటీ చేస్తున్న అదానీ, షీర్డిసాయి  
రాష్ట్ర విద్యుత్ రంగంలో అదానీ, షీర్డిసాయి కంపెనీల హవానే నడుస్తోందన్నారు. గత ప్రభుత్వ విధానాలనే ఈ ప్రభుత్వం కూడా కొనసాగిస్తోందని,  విద్యుత్ శాఖను ఈ కంపెనీలు లూటీ చేస్తున్నాయని తెలిపారు.  2024 ఎన్నికల సమయంలో  షీర్డిసాయి కంపెనీ ఎలక్ట్రోల్ బాండ్ల రూపంలో టిడిపి,వైసిపిలకు అధికారికంగా పెద్దఎత్తున డబ్బులు ఇచ్చిందని గుర్తుచేశారు. అనధికారికంగా ఎన్ని లావాదేవీలు జరిగితే ఇన్ని వేలకోట్ల రూపాయలు ఈ కంపెనీకి చెల్లించారని అనుమానం వ్యక్తం చేశారు. వ్యవసాయ పంపుసెట్లకు స్మార్ట్ మీటర్ల నిర్ణయాన్ని రద్దు చేసుకున్న ఒప్పందాన్ని బయటపెట్టాలని, ఎంత డబ్బులు చెల్లించారో చెప్పాలని కోరారు. లేదంటే ఆ కంపెనీకి ప్రభుత్వ నేతలకు మధ్య అక్రమ లావాదేవీలు జరిగాయని చెప్పాల్సి ఉంటుందన్నారు. ఇతర రాష్ట్రాల్లో రూ.3,000-4,000 పరిధిలో ఉన్న మీటర్లకు రాష్ట్రంలో మాత్రం రూ. 34,000 పైగా ఖర్చు పెట్టారని తెలిపారు.  రైతులకు, ప్రజలకు ఏమాత్రం ప్రయోజనకరం కానీ స్మార్ట్ మీటర్లు బిగించి ప్రజా ధనాన్ని కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టడం వారి దగ్గర నుండి ఎన్నికలకోసం డబ్బులు తీసుకొని అవినీతికి పాల్పడడం తీవ్ర నేరమని చెప్పారు. టర్మినేషన్ అమౌంట్ వివరాల ఒప్పందాన్ని బహిర్గత పరచాలని, పూర్తి చెల్లింపు లెక్కలు ప్రజల ముందు పెట్టాలని, అక్రమ చెల్లింపులపై న్యాయ విచారణ జరపాలని డిమాండ్ చేశారు.  
ఏజెన్సీలో పిల్లల ప్రాణాలు కాపాడాలి
పోలవరం జిల్లా చింతూరు సబ్‌డివిజన్‌లో వారం రోజుల తేడాలో మృతిచెందిన ముగ్గురు బాలికల మరణాలకు కారణాలు వెల్లడించాలని, వారి కుటుంబాలను ఆదుకోవాలని శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. ఎటపాక మండలం గొల్లగుట్టలో రాష్ట్రప్రభుత్వం గిరిజన ప్రజలకు, బాలబాలికలకు పంపిణీ చేసిన మలేరియా మాత్రలు వికటించి 40 మంది ఆస్పత్రిపాలయ్యారని తెలిపారు. వీరిలో జమున అనే అమ్మాయి మృతి చెందడం బాధాకరం. దీనికి ముందు అదే గ్రామంలో రోజ అనే అమ్మాయి కూడా మరణించింది. ఐదు రోజుల క్రితం కూనవం మండలంలో మరొక విద్యార్థిని వాంతులు చేసుకొని చనిపోయింది. ఈ మరణాలు అత్యంత ఆందోళన కలిగిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మరణాలపై ఉన్నతస్థాయి విచారణ జరపాలని, ఇలాంటి దురదృష్టకర మరణాలు జరగకుండా నిరోధించాలని కోరారు. ప్రభుత్వం నిర్లక్ష్యంతో జరిగిన ఈ మరణాలను తారుమారు చేసే ప్రయత్నం జరుగుతోందన్నారు. జమున అనే విద్యార్ధినికి అర్థరాత్రి పోస్టుమార్టం చేయడమేగాక అంత్యక్రియలకు హాజరయ్యేందుకు వెళ్తున్న తమ పార్టీ నాయకులను అడ్డుకొని పోలీసులు అరెస్టు చేశారని తెలిపారు. వీరి మరణధృవీకరణ పత్రాలు, మందులను తారుమారు చేసే ప్రయత్నం చేస్తోందని పేర్కొన్నారు. ఇది చాలా దారుణమైన విషయమని పేర్కొన్నారు. ఇక్కడ ఏం జరగకపోతే ఢిల్లీ నుంచి ఒక వైద్య బృందం, కాకినాడ నుంచి మరో వైద్య బృందం ఎందుకు వెళ్లాయని ప్రశ్నించారు. ఢిల్లీ బృందం విచారణ  జరుపుతున్నా ఆరోగ్య శాఖ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి తెలియదా అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు దాపరికంతో వ్యవహరిస్తోందని ప్రశ్నించారు. ముగ్గురు బాలికల మరణాల్ని ధ్రువీకరించి కారణాలు వెల్లడించాలని, మృతుల కుటుంబాలకు రూ.25లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రజల ఒత్తిడితో జాహ్నవీ కుటుంబానికి ప్రకటించిన రూ.5లక్షలు ఇప్పటివరకు అందలేదన్నారు. ఇప్పటి వరకు ఈ గ్రామాలను ఉన్నతాధికారులు గానీ, ప్రజా ప్రతినిధులుగానీ సందర్శించలేదు. కనీసం ఓదార్పు చెప్పేవారు లేరు. గిరిజనుల పట్ల ఇంతటి అమానవీయంగా ప్రభుత్వం ఎందుకు వ్యవహరిస్తున్నదో వెల్లడించాలన్నారు. మలేరియా తీవ్రంగా ఉన్నా ముందస్తుగా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని, కనీసం బ్లీచింగ్ కూడా చల్లడం లేదని చెప్పారు. మలేరియా వ్యాధి నిరోధించడానికి అవసర వైద్య ఆరోగ్య క్యాంపులు ప్రతి ఊరిలో పెట్టాలని, పౌష్టికాహారం అందించాలని డిమాండ్ చేశారు.
కోర్టులో ఉండగానే ఎలా చెల్లిస్తారు: బాబూరావు
షీర్డిసాయి ఎలక్రికల్ చెల్లింపులపై గతంలో కోర్టులో పిటిషన్ వేసిన టిడిపి నాయకులు ఇప్పుడు ఆ అంశం పెండింగ్‌లో ఉండగానే డబ్బులు ఎలా చెల్లిస్తారని పార్టీ రాష్ట్రకార్యదర్శివర్గ సభ్యులు బాబూరావు ప్రశ్నించారు.6శాతం అదనంగా అంచనాలు పెంచి షీర్డి సాయి కంపెనీకి వ్యవసాయ పంపుసెట్ల కాంట్రాక్ట్ అప్పగించారని టిడిపి కోర్టులో పిటిషన్ వేసిందన్నారు. అక్రమ ఒప్పందం అని చెప్పిన టిడిపి ఆ అక్రమ ఒప్పందానికి నష్ట పరిహారం పేరుతో మీటర్లు సప్లై చేయకుండా రూ.764కోట్లు ఎందుకు చెల్లించారో సమాధానం చెప్పాలని నిలదీశారు. గత ఒప్పందం రద్దు చేయడంలో ఏమైనా సమస్యలు ఉంటే న్యాయపరంగా ఎదుర్కొవాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉందని, అంతేగానీ అక్రమ చెల్లింపులు చేయకూడదన్నారు. ఇప్పటివరకు చేసిన చెల్లింపులు అన్ని తిరిగి రాబట్టాలని డిమాండ్ చేశారు. ఈ అంశంపై స్వతంత్రమైన న్యాయ విచారణ తప్పనిసరిగా జరిపించి వాస్తవాలను బయటికి తీసుకురావాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వంపై ఉందన్నారు. నివాస, వాణిజ్య వినియోగదారులకు బిగించే అదానీ స్మార్ట్ మీటర్లు ఏర్పాటులో కూడా కుంభకోణం సాగుతోందని విమర్శించారు.  ప్రజలను మభ్యపెట్టి దొంగచాటుగా ఈ మీటర్లను బిగిస్తురని విమర్శించారు. ఇళ్లకు, వాణిజ్య సముదాయాలకు స్మార్టు మీటర్లను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు.
= = = =