ఓట్లు నమోదు చేయాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే. ఏ ఒక్కరి ఓటు గల్లంతు కాకుండా కాపాడాలి.

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
ప్రచురణార్ధం/ప్రసారార్ధం :
విజయవాడ,
తేది : 02 సెప్టెంబర్, 2026.
ఓట్లు నమోదు చేయాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే.
ఏ ఒక్కరి ఓటు గల్లంతు కాకుండా కాపాడాలి.
- సిపిఐ(యం)

ఎన్నికల సంఘం నోటీసులు అందించిన లక్షలాది మంది ఓటర్ల ఇంటింటికి సిబ్బందిని పంపి అందరి ఓటర్ల వివరాలు సేకరించి వాటిని నమోదు చేయాల్సిన బాధ్యత ఎన్నికల సంఘం తీసుకోవాలని, ఇందుకోసం ఫిర్యాదుల స్వీకరణకు గడువు నెలాఖరు వరకు పెంచాలని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తున్నది.
ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) పేరుతో రాష్ట్రంలో లక్షలాదిమంది అర్హులైన ఓటర్లను కుంటి సాకులతో తొలగించడం సరికాదు. మరొక పది రోజులపాటు అభ్యంతరాలు, నమోదుకు గడువు పెంచడం మంచిదే కానీ అది చాలదు. దాన్ని నెలాఖరు వరకు పొడిగించాలి. కానీ లక్షలాది మందిని కార్యాలయాలకు విచారణ పేరుతో పిలిపించడం తగదు. సిబ్బంది సంఖ్యను పెంచి, ఇంటింటికి తిరిగి అర్హులైన ప్రతి ఒక్కరికి వద్ద ఉన్న పత్రాల ఆధారంగా అందరి ఓటర్లను నమోదు చేసి, తుది జాబితాలో వారి పేర్లు ఉండే విధంగా ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలి. పరిశీలన సందర్భంలో పత్రాలు లేవనే కారణాలతో ఓట్లను తొలగించే చర్యలు తీసుకోవద్దు. చిన్న చిన్న తప్పులను సిబ్బంది సరి దిద్దాలి. అవసరమైన సందర్భాలలో మళ్ళీ పరిశీలన చేసి అర్హులైన ప్రతి ఒక్కరి ఓటు నిలబడే విధంగా తగు చర్యలు తీసుకోవాలని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తున్నది.

(వి.శ్రీనివాసరావు)
రాష్ట్ర కార్యదర్శి