వెలిగొండ నిర్వాసితులు, సిపిఐ(యం) నాయకులపై నిర్బంధానికి ఖండన.

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 29 ఆగష్టు, 2026.

వెలిగొండ నిర్వాసితులు, సిపిఐ(యం) నాయకులపై నిర్బంధానికి ఖండన.

వెలిగొండ సాధన కమ్యూనిస్టుల పోరాట ఫలితమే.

31వ తేదీ రాష్ట్ర ముఖ్యమంత్రి వెలిగొండ ప్రారంభోత్సవానికి విచ్చేస్తున్న సందర్భంలో వెలిగొండ నిర్వాసితుల్లో నిర్లక్ష్యానికి గురైన 18 సంవత్సరాలు దాటిన యువకులను, ఇప్పటి వరకు నిర్వాసితులకు అండగా నిలబడిన సిపిఐ(యం) జిల్లా నాయకులను బైండోవర్ కావాలని జిల్లా పోలీసు యంత్రాంగం బలవంతంగా స్టేషన్‌కు తరలించడాన్ని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తున్నది. తక్షణం వారిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నది. 31వ తేదీ కార్యక్రమం ప్రశాంతంగా జరిగేటట్లు చూడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే.  

గత 30 సంవత్సరాలుగా వెలిగొండ ప్రాజెక్టు కోసం అవిశ్రాంతంగా పోరాడుతున్నది కమ్యూనిస్టులే. 1996లో సిపిఐ(యం), సిపిఐ రాష్ట్ర నాయకుల ఒత్తిడి మేరకే వెలిగొండ ప్రాజెక్టు శంఖుస్థాపనకు ఆనాటి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబునాయుడుగారు అంగీకరించి వచ్చారు. ఆ సభలో సిపిఐ(యం) నాయకులు కొరటాల సత్యనారాయణ తదితరులు ప్రత్యక్షంగా పాల్గొన్నారు. కానీ ఆ తర్వాత ప్రాజెక్టు పని ఒక్క అడుగు కూడా ముందుకు పోలేదు. ప్రజలను కూడగట్టి సిపిఐ(యం), సిపిఐ తదితర వామపక్ష పార్టీలు, స్వచ్చంద సంస్థలు, మాజీ ఇంజనీర్‌లు అనేక పోరాటాలు చేశారు. పాదయాత్రలు నిర్వహించారు. పని ఆగిపోయినప్పుడల్లా రాష్ట్ర నాయకులు ప్రాజెక్టు ప్రాంతాన్ని సందర్శించి ఒత్తిడి తెచ్చారు. ప్రాజెక్టుకోసం ఇంతగా పోరాడిన పార్టీని నిర్వాసితులకు న్యాయం చేయాలన్నందుకు నిర్బంధించడం అప్రజాస్వామికం. నీళ్ళు వదలడానికి ముందే నిర్వాసితులకు పరిహారం, ప్యాకేజీ చెల్లించాలని, నిర్వాసితుల సంఘం, సిపిఐ(యం) ఆధ్వర్యంలో పలు పోరాటాలు జరిగిన తర్వాతే ప్రభుత్వం తప్పనిసరై నిధులు విడుదల చేసింది. ఈ పోరాటాలకు ముందు బలవంతంగా ఖాళీ చేయించాలని అధికారులు చేసిన ప్రయత్నం విఫలమైంది. అమానుషంగా ఎక్కడికైనా పోయి గూడారాలు వేసుకొని బ్రతకండని బాధ్యతారాహిత్యంగా సమాధానాలు ఇచ్చారు. ఈ రోజు నిర్వాసితులకు ఎక్కువభాగం పరిహారం అందిందంటే దానికి ఈ పోరాటాలే ప్రధాన కారణం. ఇప్పటికీ 18 సంవత్సరాలు దాటిని యువతీ, యువకులకు 2019 ప్యాకేజీ ఇవ్వకుండా రూ.2 లక్షలతో చేతులు దులుపుకోవడం అన్యాయం. అయినా నిర్వాసితులు ప్రభుత్వానికి సహకరిస్తున్నారు. కానీ ప్రభుత్వం ప్రజలపట్ల దుర్మార్గంగా వ్యవహరిస్తున్నది. ఇప్పటికైనా నిర్బంధాన్ని ఆపి 31వ తేదీ ప్రారంభోత్సవ కార్యక్రమం ప్రశాంతంగా జరిగేటట్లు ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ కోరుతున్నది.

 

(వి.శ్రీనివాసరావు)

రాష్ట్ర కార్యదర్శి