
భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
ప్రచురణార్ధం/ప్రసారార్ధం :
విజయవాడ,
తేది : 20 ఆగష్టు, 2026.
స్థానిక సంస్థలకు ప్రత్యక్ష ఎన్నికలొద్దు
బిసి రిజర్వేషన్లకు మద్దతు
50% పరిమితి ఎత్తివేస్తేనే రిజర్వేషన్లు సాకారం
కేంద్రంపై ఒత్తిడి తెచ్చి రాజ్యాంగ సవరణ చేయాలి
-సిపిఐ(యం)
రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో మేయర్, చైర్ పర్సన్ పోస్టులకు ప్రత్యక్ష ఎన్నికల పద్దతిని సిపిఐ(యం) వ్యతిరేకిస్తున్నది. దీనివల్ల ప్రజలకు దగ్గరగా వుండే కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, యంపిటీసీలు, జెడ్పిటీసీలకు ప్రాధాన్యత వుండదు. దిష్టి బొమ్మలుగా మిగిలి పోతారు. అధికారం కేంద్రీకృతమై పోతుంది. 73, 74 రాజ్యాంగ సవరణ స్పూర్తి దెబ్బతింటుంది. ప్రజాస్వామ్యం బలహీన పడుతుంది. అందువల్ల ప్రస్తుత విధానాన్నే కొనసాగించాలి.
వెనుకబడిన తరగతులకు 34% రిజర్వేషన్లు ఖాయం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ స్వాగతిస్తున్నది. అయితే ఇది అమల్లోకి రావాలంటే రిజర్వేషన్లపై ఉన్న 50% పరిమితిని సవరించాలి. మిశ్రా కమిషన్ సైతం దీన్ని ఎత్తిచూపింది. ఇందుకు పార్లమెంటు చట్టం చేయాలి. కేంద్ర ఎన్డీయే ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న తెలుగుదేశం, జనసేన, బిజెపిలు ఈ రాజ్యాంగ సవరణ జరిగేటట్లు చూడాలి. ఆ పని చేయకుండా ఇక్కడ ఒక తీర్మానం చేయగానే అది అమల్లోకి రాదని, న్యాయపరమైన ఆటంకాలు ఎదుర్కొంటుందని ప్రభుత్వానికి కూడా తెలుసు. వైసిపి, టిడిపిలు దీని చుట్టూ పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నాయి. ఆరోపణలతో సరిపెట్టుకోకుండా రెండు పార్టీలు కేంద్రంపై ఒత్తిడి తెచ్చి రాజ్యాంగ సవరణ చేయించి తమ చిత్తశుద్దిని నిరూపించుకోవాలి. తెలిసీ బిసిలను మోసం చేయడానికి ప్రయత్నిస్తే ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదు.
ఫైనాన్స్ కమిషన్ నిధుల పేరుతో హడావుడిగా రిజర్వేషన్ తెచ్చి అమలు చేయక పోతే ప్రభుత్వ చిత్తశుద్దినే ప్రశ్నించాల్సి వస్తుంది. 2026 జనగణనతోపాటు కులగణన కూడా జరుగుతోంది. ఇది పూర్తయితే సామాజికపరమైన అనేక సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. ఈలోగా మిశ్రా కమిషన్ సిఫార్సులననుసరించి ఎలాంటి న్యాయపరమైన చిక్కులు రాకుండా ముందస్తు జాగ్రత్త తీసుకోవడం రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత. అలా కాకుండా కేలవం ప్రచారంకోసం చేస్తే అది బిసిలకు అన్యాయం చేయడమే అవుతుందని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ హెచ్చరిస్తున్నది.
(వి.శ్రీనివాసరావు)
రాష్ట్ర కార్యదర్శి
