మోడీ మెహర్బానీ కోసం విద్యార్థుల్ని బలిచేయొద్దు

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 31 జూలై, 2026.

మోడీ మెహర్బానీ కోసం విద్యార్థుల్ని బలిచేయొద్దు

ఆగష్టు 1వ తేదీ భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవానికి వస్తున్న ప్రధాని నరేంద్రమోడీకి స్వాగతం చెప్పేందుకు గోదావరి, ఉత్తరాంధ్ర ఏజెన్సీ జిల్లాల్లో లో అన్ని స్కూళ్ళకు 2 రోజులు సెలవులు ప్రకటించి వేలాదిమంది విద్యార్థులను తరలించడాన్ని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. ప్రధానికోసం విద్యార్థులను, పిల్లలను ఇబ్బందులపాలు చేయడం తగదు. ధింసా నృత్యం పేరుతో ఆదివాసీ బాలికలను తరలించారు. ఆర్టీసి బస్సులన్నీ ఈ పనికి కేటాయించడంతో ప్రజలు కూడా రవాణాకు ఇబ్బంది పడుతున్నారు. పైగా గత రెండు మాసాలుగా విద్యార్థి ఉద్యమాన్ని అణచివేసిన పాలకులకు ఇలా అట్టహాసంగా స్వాగతం చెప్పడం యువతను అవమానించడమే. 

ఉత్తరాంధ్ర జిల్లాల నుండి తెచ్చిన విద్యార్థినీ, విద్యార్థులు ఆహారం, మంచినీళ్ళకోసం కూడా గురువారం నాడు తీవ్రంగా ఇబ్బందులు పడినట్లు వార్తలు వచ్చాయి. జూలై 31, ఆగష్టు 1 తేదీలలో వివిధ పాఠశాలలు, కాలేజీల వాహనాలను సైతం ప్రభుత్వమే తీసుకున్నందున ఆయా విద్యాసంస్థలకు అనధికారికంగా సెలవులు ప్రకటించారు. కొన్ని విద్యాసంస్థల నుండి పిల్లలను కూడా సభకు తరలిస్తున్నారు. గతంలో యోగా పేరుతో ఇలాగే విశాఖకు తరలించారు. ఇటువంటి చర్యలన్నింటి మూలంగా విద్యార్థులు తమ చదువును నష్టపోతున్నారు. దానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి. విద్యార్థులు, ప్రజలకు ఇబ్బంది కలిగించడం, వందలకోట్ల ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేయడం గర్హనీయం. 

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రయివేటు యాజమాన్యంలోనిది. దాని ప్రారంభోత్సవానికి భారీ ఎత్తున ప్రణాళికలు రచించి అందుకోసం కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని వెచ్చించడం అధికార దుర్వినియోగం అవుతుంది. అనేకమంది మంత్రులు, ఎమ్మెల్యేలతోపాటు పదుల సంఖ్యలో ఉన్నతాధికారులను, వందల సంఖ్యలో ఉద్యోగులను ఆ ప్రయివేటు కార్యక్రమానికి తరలించడం ప్రజలకు అసౌకర్యంగా మారింది. ప్రధాని మెప్పుకోసం రాష్ట్ర ప్రభుత్వం ఇలా అధికార దుర్వినియోగానికి పాల్పడడం అభ్యంతరకరం.

సంవత్సరానికి రెండు, మూడు సార్లు ఏదో ఒక ప్రాంతానికి ప్రధానిని ఆహ్వానించి తిరునాళ్ళమాదిరిగా ప్రజాధనంతో ప్రభుత్వ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారుగానీ, ప్రధానిమాత్రం ఈ రాష్ట్రానికి చేసిందేమీ లేదు. జివో 3 రద్దు, 1/70ని బలహీనపర్చడం సహా ఆదివాసీ యువత భవిష్యత్తును దెబ్బతీస్తూ వారినే రాజకీయ సాధనంగా మార్చడం తగదు.  ఏజెన్సీలో స్పెషల్ డిఎస్సీ ఊసు లేదు. యువతీ, యువకులు ఆశగా ఎదురుచూస్తున్న ప్రత్యేకహÃదా ఊసే మర్చిపోయారు. విభజన హామీలు, ఉన్నతస్థాయి విద్య, వైద్య, పరిశోధనా సంస్థల ఏర్పాటు, అభివృద్ధి గురించి కేంద్రం పట్టించుకోవడం లేదు. రాష్ట్రంలో గిట్టుబాటు ధరల్లేక రైతులు రోడ్డెకుతున్నా ప్రధానికి, ముఖ్యమంత్రికి పట్టలేదు. విద్యార్థులకు ఫీజురియంబర్స్‌మెంట్ ఇవ్వలేదు. విభజన చట్టం ప్రకారం రాజధాని నిర్మాణం కేంద్రం బాధ్యత కాగా, అమరావతి నిర్మాణానికి అప్పులు ఇప్పిస్తామని కేంద్రం చేతులు దులుపుకుంటోంది. రాష్ట్ర ప్రయోజనాలను ఎంతమాత్రమూ నెరవేర్చని ప్రధాని పర్యటనలకోసం విద్యార్థినీ, విద్యార్థులను, అధికార యంత్రాంగాన్ని ఇబ్బందులపాలు చేయడం, కోట్లాది రూపాయల ప్రజా ధనాన్ని ఖర్చు చేయడాన్ని సిపిఐ(యం) తీవ్రంగా ఖండిస్తున్నది. ఇలాంటి ఆర్భాటపు కార్యక్రమాలకు వెంటనే స్వస్తి చెప్పాలని డిమాండ్ చేస్తున్నది.

 

(వి.శ్రీనివాసరావు)

రాష్ట్ర కార్యదర్శి