భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
ప్రచురణార్ధం/ప్రసారార్ధం :
విజయవాడ,
తేది : 27 జూలై, 2026.
గిరిజన విద్యార్థి శివానీ మృతిపై ఉన్నత స్థాయి విచారణ జరిపించాలి
` వి.శ్రీనివాసరావు, సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శి
రంపచోడవరం మండలం ఇర్లపల్లి కొత్త కాలనీకి చెందిన గిరిజన విద్యార్థిని ముర్రం శివానీ (15) అకాల మరణం తీవ్ర దిగ్భ్రాంతిని, విచారాన్ని కలిగించిందని సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు తెలిపారు. శివానీ మృతి అత్యంత బాధాకరమని, వారి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వి. శ్రీనివాసరావు మాట్లాడుతూ...
ఇటీవల రంపచోడవరంలో జరిగిన ‘మెగా పేరెంట్-టీచర్స్ మీటింగ’లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి పక్కన నిలబడి, తన వాక్చాతుర్యంతో అందరి ప్రశంసలు అందుకోవడమే కాక, సీఎం గారితో ప్రత్యేకంగా ఫోటోలు దిగిన ఒక ఉజ్వల భవిష్యత్తు ఉన్న గిరిజన బాలిక ఇంతలోనే మృతి చెందడం బాధాకరం. నిన్నటివరకు ముఖ్యమంత్రితో సహా అందరి చేత ప్రశంసలు పొంది, ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచిన ఒక విద్యార్థిని ఉన్నట్టుండి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడటం అనేక అనుమానాలకు, ప్రశ్నలకు తావిస్తోంది.
ప్రభుత్వ కార్యక్రమాల్లో అంతటి ఉత్సాహంగా, ఆత్మవిశ్వాసంతో పాల్గొన్న చిన్నారిని ఆత్మహత్యకు పురికొల్పిన పరిస్థితులు ఏమిటి..? ఆమె ఎదుర్కొన్న మానసిక ఒత్తిడికి కారణాలు ఏమిటి...? అనే అంశాలపై సమగ్రంగా, నిష్పాక్షికంగా ఉన్నత స్థాయి విచారణ జరిపించాలి. స్థానిక ప్రజాప్రతినిధులు పరామర్శలకు మాత్రమే పరిమితం కాకుండా, గిరిజన ప్రాంతాల్లో విద్యార్థులు ఎదుర్కొంటున్న మానసిక సమస్యలు, ఆర్థిక ఒత్తిళ్లు, ఇతర ప్రతికూల పరిస్థితులపై ప్రత్యేక దృష్టి సారించాలి.
ముర్రం శివానీ మృతి వెనుక ఉన్న అసలు కారణాలను బయటపెట్టడానికి ఉన్నత స్థాయి నిపుణులు, విద్యావేత్తలతో విచారణ జరిపించాలనీ, శివానీ కుటుబాన్ని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని కోరారు. ఆ కుటుంబానికి తక్షణమే రూ. 25 లక్షల పరిహారం అందించాలనీ డిమాండ్ చేశారు. గిరిజన, సంక్షేమ హాస్టళ్లు మరియు పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు మానసిక ధైర్యం కల్పించేందుకు, ఒత్తిడిని జయించేందుకు ప్రత్యేక కౌన్సెలింగ్ కేంద్రాలను తక్షణమే ఏర్పాటు చేయాలి.”
శోకసంద్రంలో ఉన్న ఆమె తల్లిదండ్రులకు, సహచర విద్యార్థులకు సిపిఐ(యం) పూర్తి నైతిక మద్దతు ఇస్తుందని వి.శ్రీనివాసరావు స్పష్టం చేశారు.
(జె.జయరాం)
ఆఫీసు కార్యదర్శి
