
భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
ప్రచురణార్ధం/ప్రసారార్ధం :
విజయవాడ,
తేది : 22 జూలై, 2026.
ఉన్నత స్థానాల్లో ఉన్నవారు బాధ్యతాయుతంగా మాట్లాడాలి
- సిపిఐ(యం)
ఢిల్లీలో విద్యార్థులపై జరిగిన దారుణమైన హింసకాండ, లాఠీ చార్జ్‌పై విచారణ జరపాలని కోరుతూ సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్‌కు జవాబుగా చీఫ్ జస్టిస్ చేసిన వ్యాఖ్యానాలు దురదృష్టకరం. గతంలో ఆయన చేసిన వ్యాఖ్యానాల ఫలితంగానే కాక్రోచ్ జనతా పార్టీ ఆవిర్భవించిందన్న సంగతి అందరికీ తెలుసు. దేశాన్నంత ప్రభావితం చేస్తున్న విద్యార్థుల ఆందోళనపై విచారించే తీరిక లేదనటం, వీడియోలు చూడటానికి నిరాకరించటం సబబుగా లేదు. ఇది భారత న్యాయవ్యవస్థ చరిత్రకే కళంకం తెచ్చిపెడుతుంది. ఇలాంటి వ్యాఖ్యానాల ద్వారా న్యాయవ్యవస్థపైనే ప్రజలు విశ్వాసం కోల్పోయే ప్రమాదం ఉంది. ఇప్పటికైనా వెంటనే పిటిషన్ స్వీకరించి విద్యార్థులకు న్యాయం చేయాలని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ విజ్ఞప్తి చేస్తున్నది.
మోడీ అడుగు జారిపోతున్నది
విద్యార్థుల ఆందోళనలతో దేశమంతా అట్టుడుగుతున్నప్పటికీ, ప్రధానమంత్రి దాన్ని ప్రస్తావించకపోవడం అన్యాయం. విద్యార్థులపై దారుణమైన లాఠీచార్జికి కనీసం విచారం కూడా వ్యక్తం చేయలేదు. ఎప్పుడో రెండు నెలల క్రితం జరిగిన నీట్ పరీక్షల్లో జరిగిన అవకతవకల గురించి ఇప్పుడు ప్రస్తావించి దేశం అంతా ఒక్కటిగా ఉండి ఎదుర్కోవాలని చెప్పటం నీతి బాహ్యం. మోసపూరితం. ఇలాంటి మాటకారితనంతో ప్రజల్ని ఎల్లకాలం దారి తప్పించలేరు. యువత మేలుకొంటున్నది. విద్యార్థులు చైతన్యవంతులవుతున్నారు. ఇప్పటికైనా ప్రధాని మోడీ మేల్కొని విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చేత రాజీనామా చేయిస్తే ఆందోళన ప్రశాంతంగా ముగుస్తుంది. లేకపోతే యువతలో సహనం నశించి ఆగ్రహం కట్టలు తెంచుకునే ప్రమాదం ఉంది. అలాంటి పరిణామాలకు మోడీ ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుంది.
కాంగ్రెస్ కార్యాలయంపై బిజెపి దాడికి ఖండన
విజయవాడలో కాంగ్రెస్ ఆఫీస్ మీద బిజెపి దాడి, హైదరాబాద్, పట్నాలలో బాహబాహీకి దిగటాన్ని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ ఖండిస్తున్నది. విద్యార్థి ఉద్యమంపై ఒకవైపు దారుణమైన అణిచివేత, మరొకవైపు ప్రతిపక్షాలపై భౌతిక దాడులకు సైతం బిజెపి దిగడం దేశంలో అంతర్గతంగా శాంతిభద్రతలు దిగజారి పోతున్న స్థితిని ఎత్తుచూపుతున్నది. శాంతిభద్రతలను సజావుగా కాపాడాల్సిన ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్న బిజెపి ప్రతిపక్షాల నిరసన ప్రదర్శనలు చూసి ఓర్చుకోలేక దాడులకు తెగబడటం దారుణం. దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని, రాజకీయ పార్టీల కార్యాలయాలకు భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తున్నది.
(వి.శ్రీనివాసరావు)
రాష్ట్ర కార్యదర్శి
