ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్.ఐ.ఆర్) ప్రక్రియలో ప్రజలు ఎదుర్కొంటున్న తీవ్ర సమస్యలపై - గ్రామ/ వార్డు సభలు పెట్టడం, గడువు పొడిగించడం, సహా నిబంధనలను సడలించాలని కోరుతూ..

(ప్రచురణార్థం: సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్‌కి వ్రాసిన లేఖను ప్రచురణార్ధం పంపుతున్నాం. -జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి)

 

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

విజయవాడ,

తేది : 04 జూలై, 2026.

చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ గారికి,

ఆంధ్రప్రదేశ్,

విజయవాడ.

విషయం: ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్.ఐ.ఆర్) ప్రక్రియలో ప్రజలు ఎదుర్కొంటున్న తీవ్ర సమస్యలపై - గ్రామ/ వార్డు సభలు పెట్టడం, గడువు పొడిగించడం, సహా నిబంధనలను సడలించాలని కోరుతూ...

అయ్యా!

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్కిస్టు) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ తరఫున రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న ఎసఐఆర్ ప్రక్రియలో సాధారణ ప్రజలు ఎదుర్కొంటున్న క్షేత్రస్థాయి సమస్యలను, మా ప్రత్యక్ష పరిశీలనలో వచ్చిన అంశాలను మీ దృష్టికి తీసుకు వస్తున్నాను. పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను.

ప్రస్తుతం నిర్వహిస్తున్న ‘ఎస్.ఐ.ఆర్’ ప్రక్రియలో భాగంగా 2002 సంవత్సరాన్ని ప్రాతిపదికగా తీసుకుని నిర్వహిస్తున్నారు. ఇప్పటికే దాదాపు 60 శాతం వెరిఫికేషన్ పూర్తయిందని అధికారులు చెబుతున్నప్పటికీ... క్షేత్రస్థాయిలో, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో నివసించే పేద, మధ్యతరగతి ప్రజలు ఈ ప్రక్రియ కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

ఈ ప్రక్రియలో ఉన్న లోపాలు, ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు :

(1) ప్రామాణిక గుర్తింపు కార్డులను నిరాకరించడం : గ్రామాల్లోని ప్రజల వద్ద నిత్యం అందుబాటులో ఉండే అత్యంత ప్రామాణిక పత్రాలైన ఆధార్ కార్డు, ఓటర్ ఐడి, రేషన్ కార్డు, మరియు డ్రైవింగ్ లైసెన్స్ వంటి వాటిని ఈ వెరిఫికేషన్ ప్రక్రియకు ప్రాతిపదికగా తీసుకోవడం లేదు. చట్టబద్ధమైన ఈ కార్డులను కాదని, ఇతర పత్రాలను అడగడం వల్ల సామాన్య ప్రజలు తీవ్ర గందరగోళానికి, ఇబ్బందులకు గురవుతున్నారు.

(2) అందుబాటులో లేని లేదా పాత పత్రాలను డిమాండ్ చేయడం : ఎ) వెరిఫికేషన్ నిబంధనల పేరుతో విద్యార్హత సర్టిఫికెట్లు, పాస్‌పోర్ట్, కుల లేదా జనన ధృవీకరణ పత్రాలను అధికారులు తప్పనిసరిగా కోరుతున్నారు.

బి) 2002 తర్వాత జన్మించిన వారిని తమ పూర్వీకుల వివరాలు సమర్పించాలని, వివాహమైన మహిళలను వారి పుట్టింటి తల్లిదండ్రుల సమాచారం తీసుకురావాలని ఒత్తిడి చేస్తున్నారు.

సి) గ్రామాల్లోని వృద్ధులు, నిరక్షరాస్యులు, మరియు పేద ప్రజల వద్ద దశాబ్దాల క్రితం నాటి ఇటువంటి సర్టిఫికెట్లు లేవు. ఒకవేళ ఉన్నా, ప్రస్తుతం అవి అందుబాటులో లేకపోవడం వల్ల వాటిని సేకరించడం వారికి అత్యంత కష్టతరంగా మారింది.

(3) వలస కార్మికులు, ఇతర రాష్ట్రాల ప్రజల దయనీయ స్థితి : గత 24 ఏళ్లలో ఉపాధి నిమిత్తం ఎంతోమంది వలసలు వెళ్లడం, ఇళ్లు మారడం జరిగింది. ఇప్పుడు హఠాత్తుగా 2002 నాటి రికార్డులను ప్రామాణికంగా అడగడం వల్ల ఎంతోమంది అర్హులైన పేద ప్రజలు తమ ఓటు హక్కును కోల్పోయే ప్రమాదం ఏర్పడింది. ఎ) స్వంత ప్రాంతాల నుండి ఇతర ప్రాంతాలకు వలస పోయిన వారు,  బి) ఇతర ప్రాంతాల నుండి వలస వచ్చినవారు,  సి) విదేశాలకు వెళ్ళిన ఎనఆరఐలు ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. ఈ నిబంధనల వల్ల ఓటు హక్కు కోల్పోయే ప్రమాదం ఉంది. 

చట్టప్రకారం 12 సంవత్సరాల నుండి స్థానికంగా నివసిస్తున్న వారికి పౌరసత్వం/ స్థానికత లభిస్తున్నప్పటికీ, ఇతర రాష్ట్రాల నుండి వచ్చి ఇక్కడ స్థిరపడిన కార్మికుల పరిస్థితి ప్రస్తుతం దయనీయంగా మారింది.

(4) ఆర్థిక, మానసిక ఇబ్బందులు : ఈ సర్వే నిరూపణల కోసం పేద ప్రజలు తమ రోజువారీ కూలీ పనులను మానుకోవాల్సి వస్తోంది. పాత సర్టిఫికెట్ల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ, దళారుల చుట్టూ తిరగాల్సి రావడం వల్ల వారు తీవ్ర ఆర్థిక, మానసిక ఇబ్బందులకు గురవుతున్నారు. చాలా కుటుంబాలకు ఫారాలు కూడా సరిగ్గా అందలేదు.

కొన్ని ప్రాంతాలలో సాధారణ ప్రజలకు పత్రాలు పూర్తి చేసుకోవడం కష్టంగా ఉంది. 2002 ఓటర్ల జాబితాలో పేర్లు ఆన్‌లైన్‌లో చూసి అదనపు ఆధారాలు ఇవ్వవలసిన అవసరం ఉంటే ఓటర్లకు అప్పుడే చెప్పాలి. 

మా విజ్ఞప్తి :

కావున, గౌరవ సిఈవో గారు వెంటనే స్పందించి, ప్రజల సామాజిక, ఆర్థిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకోవాలని కోరుతున్నాను.

(1) క్లిష్టమైన పాత సర్టిఫికెట్లకు ప్రత్యామ్నాయంగా ప్రస్తుతం ప్రజల వద్ద అందుబాటులో ఉన్న ఆధార్‌కార్డు, ఓటర్ ఐడి, రేషన్ కార్డులను ప్రాధాన్యత గుర్తింపు పత్రాలుగా అంగీకరించేలా నిబంధనలను సడలించాలి.

(2) ఎస్ఐఆర్ ప్రక్రియ సక్రమంగా జరిగి అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటర్లుగా నమోదు జరగాలంటే ఎసఐఆర్ ప్రక్రియను కనీసం నెలరోజులు పొడిగించాలని కోరుతున్నాను.పత్రాలు ఆమోదించారా? లేదా? పరిశీలించి ఓటర్లకు చెప్పాలి.  ఆధారాలు సరిపోని యెడల ఓటర్లకు తెలపాలి.

(3) నిబంధనలను సరళతరం చేసి, రాష్ట్రంలో ఏ ఒక్క పౌరుడూ తన ఓటు హక్కును నష్టపోకుండా చూడాలని సిపిఐ(యం) తరఫున కోరుతున్నాను.

(4) వలసలు వెళ్ళినవారికి, విదేశాల్లో ఉన్న ఎనఆరఐలకు పారదర్శకంగా ఉండే విధంగా ప్రత్యేక నిబంధనలు రూపొందించి ఓటు హక్కు కల్పించాలి.

(5) ప్రజల్లో ఎస్ఐఆర్ పై అవగాహన కల్పించేందుకు గ్రామ/ వార్డు సభలు పెట్టాలి. ప్రజలకు తెలుసుకునే హక్కును గౌరవించాలి. ముందుగా ప్రతి గ్రామం/ పేటలో అనౌన్స్‌మెంట్ ఇవ్వాలి.

(6) బిఎలఓలపై పని ఒత్తిడి తీవ్రంగా ఉంది. ఆ రీత్యా తప్పులు కూడా ఎక్కువగా జరిగే అవకాశం ఉంది. అవసరమైతే అదనపు సిబ్బందిని కేటాయించాలి. పౌరుల ఓటు హక్కును కాపాడాల్సిన తరుణంలో హడావుడిగా పని ముగించడం సరికాదు. ఒక్క ఓటరుకు కూడా అన్యాయం జరగకుండా చూడాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్‌పై ఉంది. దాన్ని  గౌరవించగలరు.

ఈ విషయమై సానుకూల నిర్ణయం తీసుకుని, క్షేత్రస్థాయి అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేయగలరని ఆశిస్తున్నాను.

అభివందనములతో...

(వి.శ్రీనివాసరావు)

రాష్ట్ర కార్యదర్శి