సామాజిక కార్యకర్తలపై వేధింపులు ఆపండి.. ‘ప్రశ్న’ రావణ్‌పై కేసులు ఉపసంహరించుకోవాలి..

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 03 జూలై, 2026.

సామాజిక కార్యకర్తలపై వేధింపులు ఆపండి

‘ప్రశ్న’ రావణ్‌పై కేసులు ఉపసంహరించుకోవాలి

- సిపిఐ(యం) డిమాండ్

గత మూడు రోజులుగా ‘ప్రశ్న’ యూట్యూబర్ ‘రావణ’పై కేసులు మీద కేసులు పెట్టి వేధించడాన్ని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తున్నది. మరోవైపు జనసేన, ఆరఎసఎస్ కార్యకర్తలు అతనిపై భౌతికదాడులకు సైతం సిద్ధమవడం, పిఠాపురం, మచిలీపట్నం పోలీసు స్టేషన్‌లపై దాడి చేయడానికి ప్రయత్నించినా ప్రభుత్వం, పోలీసు చేతలుడిగి, ప్రేక్షకపాత్ర పోషించడం ఆందోళనకరం. రాజకీయ విశ్లేషకులైన కె.వి.రెడ్డిని హైదరాబాద్‌లో నిర్బంధంలోకి తీసుకోవడం, పోలీసులుఈ సందర్భంగా మితిమీరి వ్యవహరించడం ప్రజాస్వామ్య వ్యవస్థను అపహాస్యంపాలు చేయడమే. దీనికి ప్రభుత్వం బాధ్యత వహించాలి. ఈ ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలి.

ఇటీవల కాలంలో సోషల్ మీడియా యాక్టివిస్టులపై కేసులు, అరెస్టులు, వేధింపులు పెరిగాయి. ఉపన్యాసాల్లో వాడిన పదజాలం, భాష అభ్యంతరకరంగా ఉంటే దానిపై సమాధానమివ్వొచ్చు తిరిగి విమర్శించవచ్చు. అందుకు బదులుగా ప్రభుత్వ, పోలీసు యంత్రాంగాన్ని దుర్వినియోగం చేసి బెదిరించడం, వేధించడం అప్రజాస్వామికం. అందరికీ దీన్ని వర్తింపజేస్తే అధికార పార్టీ నాయకులతో సహా అందరిపైనా కేసులు పెట్టి అరెస్టు చేయాల్సి వుంటుంది. విమర్శల్లో వ్యక్తిగత ఆరోపణలు, ముఖ్యంగా వ్యక్తిత్వహరణం అనుమతించకూడదనడంలో సందేహం లేదు. ఈ విషయంలో అధికార పార్టీలు మిగతా వారికి ఆదర్శంగా ఉండాలి. రావణ్ ఉపయోగించిన భాషను ఆమోదించలేము. గతంలోను, ఇప్పుడు పలు సందర్భాలలో పవన్‌కళ్యాణ్ వాడిన భాష కూడా అభ్యంతరకరంగానే ఉంది. అదే దారిలో ‘రావణ్’ కూడా నడిచాడు. కానీ, ఏకపక్షంగా కేసులు పెట్టి వేధించడం సరైంది కాదు. రాష్ట్రంలో రాజకీయ సంస్కృతి దారితప్పుతోంది. విమర్శలు దారితప్పి వ్యక్తిత్వ హణనానికి, మహిళలను అవమానించడానికి దారితీస్తున్నాయి. ఇప్పటికైనా అన్ని రాజకీయ పార్టీలు ముఖ్యంగా అధికార, ప్రధాన ప్రతిపక్ష పార్టీలు అభ్యంతరకర భాషకు స్వస్తి చెప్పాల్సిన బాధ్యత ఉంది.

పబ్లిసిటీకోసం అధికార పార్టీ నాయకుల అండచూసుకొని లేదా వారి ప్రోత్సాహంతోనే కొందరు యూట్యూబర్లు మితిమీరిన అసభ్యకర పదజాలం వాడుతున్నారు. అలాంటి వారిని ఆయా పార్టీలు నియంత్రించాలి. ప్రజా సమస్యల్ని పక్కదారి పట్టించి ప్రభుత్వ బాధ్యత నుండి ప్రజల దృష్టిని మళ్ళించడానికే ఇలాంటి అంశాలను అజెండాగా మార్చి కేసులు, అరెస్టుల వరకు తీసుకెళ్తున్నారు. భిన్నాభిప్రాయాలను, ప్రభుత్వంపై విమర్శలను అణచివేయడానికి, ఉద్యమాల గొంతు నొక్కడానికి కేసులు పెట్టి మిగతావారిని కూడా బెదిరించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. ఇలాంటి నిరంకుశ, అప్రజాస్వామిక పద్దతులకు టిడిపి కూటమి ప్రభుత్వం స్వస్తి చెప్పాలి. వ్యక్తుల మధ్య జరిగే వాదవివాదాలు, రాజకీయ భిన్నాభిప్రాయాలు, విశ్లేషణలు తదితర అంశాలలో ప్రభుత్వం, పోలీసులు తలదూర్చకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ కోరుతున్నది.

 

(వి.శ్రీనివాసరావు)

రాష్ట్ర కార్యదర్శి