పార్వతీపురం మన్యం జిల్లా పూర్ణపాడు-లాభేసు వంతెనను పూర్తి చేయాలని కోరుతూ..

(ప్రచురణార్థం: సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ముఖ్యమంత్రికి వ్రాసిన లేఖను ప్రచురణార్ధం పంపుతున్నాం. - జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి)

 

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

విజయవాడ,

తేది : 02 జూలై, 2026.

 

శ్రీయుత నారా చంద్రబాబునాయుడు గారికి,

గౌరవ ముఖ్యమంత్రి,

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం,

అమరావతి.

విషయం: పార్వతీపురం మన్యం జిల్లా పూర్ణపాడు-లాభేసు వంతెనను పూర్తి చేయాలని కోరుతూ...

అయ్యా!

పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలానికి సంబంధించి 9 పంచాయతీలు 40 గ్రామాలతో పాటు కురుపాం మండలం, గుమ్మలక్ష్మిపురం, జి.ఎం.వలస, గరువుబిల్లి మండలాల ప్రజల రాకపోకలకు అవసరమైన పూర్ణపాడు - లాభేసు బ్రిడ్జి దాదాపు 30 సంవత్సరాలుగా పెండింగులో ఉంది. లాబేసు, తిక్కవరం, పొరుగుపాకు గ్రామాల ప్రజలు కొమరాడ మండల కేంద్రానికి రావడానికి ఈ వంతెన పూర్తి అయితే కేవలం 5 కిలోమీటర్లలోపు దూరానికి తగ్గుతుంది. ప్రస్తుతం నాగావళి ఏరువస్తే కురుపాం మీదుగా 70 కిలోమీటర్లు ప్రయాణం చేసి కొమరాడ మండల కేంద్రానికి రావలసి వస్తుంది. 

1995 సంవత్సరంలో అటు ఒరిస్సా ఇటు ఆంధ్ర సరిహద్దు వనిజ గ్రామం వద్ద నాగవల్లి నదిలో నాటు పడవ ప్రమాదంలో 32 మంది గిరిజనులు చనిపోవడం జరిగింది. అప్పటి మంత్రి దేవేందర్‌గౌడ్ గారు పూర్ణపాడు లాబేస్ గ్రామాల మధ్య వంతెన నిర్మిస్తానని హామీ ఇచ్చారు. కాని అమలు కాలేదు. తిరిగి 2006వ సంవత్సరంలో నాటి మాపార్టీ ఎమ్మెల్యే కోలక లక్ష్మణ మూర్తి గారు అసెంబ్లీలో గట్టిగా పట్టుబట్టడం వల్ల ఆ సంవత్సరం పనులు ప్రారంభించారు. ప్రస్తుతం 70% పనులు పూర్తి అయ్యాయి. నాగావళి నదిలో మరొక 3 పిల్లర్లు వేస్తే పని పూర్తి అవుతుంది. దీనివలన 40 గ్రామాలు, 4 మండలాలు గిరిజన ప్రజలకు ప్రయాణం సౌలభ్యంగా ఉంటుంది. ఇప్పటికే బ్రిడ్జి పని ఆరంభమై 20 సంవత్సరాలు పూర్తవుతున్నా ఈ వంతెన మూడు పిల్లర్లు కట్టడం పూర్తికాకపోవడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది.

2024 ప్రపంచ ఆదివాసి దినోత్సవం రోజు పూర్ణపాడు లాబేసు వంతెన పూర్తి చేస్తామని మీరు వాగ్దానం చేయడం జరిగింది. కనీసం 20 కోట్లు కేటాయిస్తే ఈ వంతెన పూర్తి చేయవచ్చు. 40 గిరిజన గ్రామాల ప్రజలకు విద్యా, వైద్యం అందుబాటులోకి వస్తుంది. కాబట్టి తమరు వెంటనే జోక్యం చేసుకొని నిధులు కేటాయించి ఈ వంతెన పెండింగ్ పనులు పూర్తి చేయాలని కోరుతున్నాను.

అభివందనములతో...

 

(వి.శ్రీనివాసరావు)

రాష్ట్ర కార్యదర్శి