ఏజెన్సీ మైనింగ్ గెజిట్ చట్టవిరుద్ధం

ఈరోజు (01 జూలై) సిపిఐ(యం) విలేకర్ల సమావేశం (విజయవాడలో) జరిగింది. ఆ వివరాలను ప్రచురణార్థం/ ప్రసారార్థం పంపుతున్నాము.   ` జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి

 

ఏజెన్సీ మైనింగ్ గెజిట్ చట్టవిరుద్ధం

ట్రైబల్ యÖనివర్శిటీలో డిగ్రీలు తీసుకోకుండా విద్యార్థులను అడ్డుకోవడం అన్యాయం

సర్ ప్రక్రియ గడువు పొడిగించాలి

ఉపాధి హామీ కూలీల ఆందోళనకు మద్దతు

బీచ్‌షాక్స్‌ను ఉపసంహరించుకోవాలి

సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు  

 

ఏజన్సీలో మైనింగ్ సర్వేకు అనుమతి ఇస్తూ కేంద్రం గెజిట్ విడుదల చేయడం చట్ట విరుద్ధమని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు అన్నారు. బుధవారం విజయవాడ బాలోత్సవ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పేరుతో పెట్టుబడిదారులకు వెంటనే అనుమతులు ఇచ్చేయాలని చెబుతూ బంగారం, బీచ్‌శాండ్, ఐరనఓర్, బాక్సైట్ లాంటి విలువైన ఖనిజ సంపదను లూటీ చేస్తున్నారని విమర్శించారు. దీన్ని విదేశీలకు ఎగుమతి చేసుకునే అవకాశమÖ కల్పించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిలో భాగంగానే సీతంపేట నుండి ఎటపాక వరకూ ఉన్న ఏజెన్సీలో మైనింగ్ చేసుకునేందుకు ప్రైవేటు కంపెనీకి అనుమతులు ఇచ్చారని విమర్శించారు. వాస్తవంగా ఏజన్సీ షెడ్యూలు 5లో ఉందని, దీనికి గవర్నర్ కస్టోడియన్‌గా ఉంటారని తెలిపారు. అక్కడ ఏదైనా కార్యకలాపాలు చేయాలంటే పెసాచట్టం ప్రకారం గ్రామసభ అనుమతి తీసుకోవాలని తెలిపారు. అలాగే గిరిజన సలహామండలిలో చర్చించాలని, అవేమీ లేకుండానే నేరుగా ఏజెన్సీలో మైనింగ్‌కు అనుమతి ఇవ్వడం చట్ట విరుద్ధం నేరమని అన్నారు. ఏజెన్సీలో మైనింగ్ చేసే హక్కును కేంద్రానికి ఎవరు ఇచ్చారని ప్రశ్నించారు. గతంలో బాక్సైట్ తవ్వకానికి ప్రయత్నిస్తే గిరిజనులు ఎదురు తిరిగారని, చంద్రబాబునాయుడు, వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి లాంటివారే వెనక్కు తగ్గారని అన్నారు. ఇప్పుడు మరలా బాక్సైట్ కోసం సర్వే చేస్తున్నారని తెలిపారు. ఇటువంటి చర్యలు మానుకోకపోతే శాంతిభద్రతల సమస్యగా మారే ప్రమాదం ఉందని హెచ్చరించారు. వెంటనే ప్రభుత్వం స్పందించి మైనింగ్‌ను ఆపేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. 

సర్టిఫికెట్లు తీసుకోకుండా ఎసఎఫఐ విద్యార్థులను అడ్డగించిన వారిపై చర్యలు తీసుకోవాలి

ట్రైబల్ యÖనివర్శిటీ స్నాతకోత్సవం సందర్భంగా రాష్ట్రపతి చేతుల మీదుగా డిగ్రీలు తీసుకునేందుకు వెళ్లిన తొమ్మిది మంది ఎసఎఫఐ విద్యార్థులను డిగ్రీ పట్టాలు తీసుకోకుండా బయటకు గెంటేయడం అన్యాయమని, దీనికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని శ్రీనివాసరావు డిమాండు చేశారు. చదువుకునే విద్యార్ధులను  అవమానించడం అనాగరిక చర్య అని అన్నారు. డిగ్రీలు తీసుకోకుండా ఆపే హక్కు పోలీసులకు ఎవరిచ్చారని ప్రశ్నించారు. మరోవైపు యÖనివర్శిటీ ఏర్పాటు చేసి నాలుగేళ్లు గడుస్తున్నా కనీస సదుపాయాలు కల్పించలేదని, స్నాతకోత్సవం జరుపుకునే హాలు కూడా లేకపోవడం విద్యావ్యవస్థకే సిగ్గుచేటన్నారు. అక్కడ విద్యార్థులకు సరైన మెస్ సదుపాయం కూడా లేదని, ఫ్యాకల్టీ కూడా లేదని విమర్శించారు. కేంద్రం ఆధీనంలో ఉన్న యÖనివర్శిటీ స్నాతకోత్సవం కార్పొరేట్ హోటల్లో నిర్వహించడం, లక్షల్లో బిల్లు చెల్లించడం సిగ్గుచేటని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి యÖనివర్శిటీకి నిధులు ఇవ్వాలని డిమాండు చేశారు. 

ఉపాధిహామీ పాత చట్టాన్ని అమలు చేయాలి

ఉపాధి హామీ పథకం కింద పాత చట్టాన్ని అమలు చేయాలని శ్రీనివాసరావు కోరారు. బుధవారం నుండి కొత్త చట్టం అమల్లోకి వచ్చిందని, దీనిపై అన్ని చోట్ల కూలీల్లో వ్యతిరేకత వస్తోందని తెలిపారు.  రైల్వేకోడూరులో ప్రారంభానికి వస్తున్న కేంద్రమంత్రి పర్యటనను నిరసించాలని కోరారు. ఇప్పటికే అనేక చోట్ల ఉపాధి కూలీలు ఆందోళనకు దిగారని అన్నారు. అలాగే వ్యవసాయకార్మిక సంఘం, రైతు సంఘాలు కూడా దీనికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేపట్టాయని, వాటికి సిపిఎం తరుపున సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. కొత్త చట్టం ప్రకారం 120 రోజుల పని కూడా ఉండదని తెలిపారు. అలాగే ఫేస్ యాప్ పెట్టారని, దానికి సిగ్నల్ లేకపోవడంతో ఫోటోల కోసం రోడ్డుపైకి వచ్చి ప్రమాదం బారినపడి నలుగురు కూలీలు మరణించారని అన్నారు. వడదెబ్బతో మరికొంతమంది కూలీలు చనిపోయారని  తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి జీరాంజీ పథకాన్ని రద్దుచేసి పాత ఉపాధిహామీ చట్టాన్ని పునరుద్దరించాలని డిమాండ్ చేశారు. 

సర్ గడువు పొడిగించాలి

ఓటర్ల ప్రత్యేక సవరణలో దరఖాస్తులు పూర్తి చేయడం అధికారులకు కూడా అర్థం కావడం లేదని, సామాన్యులు ఎలా పూర్తిచేస్తారని శ్రీనివాసరావు ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో సర్ గడువును పొడిగించాలని కోరారు. దేశంలో పుట్టి పెరిగిన వారు కూడా తాము భారతదేశ పౌరులమని నిరూపించుకోవాలనడం అన్యాయమని తెలిపారు. సర్‌కు ఆమోదం తెలిపిన తెలుగుదేశం, వైసిపిలు కూడా ఇప్పుడు డైలమాలో పడ్డాయని తెలిపారు. గడువు పెంచాలని కోరుతున్నాయని వివరించారు. సర్‌లో ఓటు లేకపోతే అన్ని సంక్షేమ పథకాలు ఆపేస్తున్నారని ఈ నేపథ్యంలో సర్ ప్రక్రియ గడువు పొడిగించాలని కోరారు. 

బీచ్ షాక్స్ ఉపసంహరించుకోవాలి.

బీచ్‌షాక్స్ పేరుతో మద్యం వ్యాపారాన్ని ప్రోత్సాహించడం అన్యాయమని పేర్కొన్నారు. వెంటనే దీన్ని రద్దు చేయాలని కోరారు. ఆహ్లాదం కోసం ప్రజలు బీచ్‌కు వెళతారని, అటువంటిచోట మద్యం సరఫరా చేయడం వల్ల శాంతిభద్రతల సమస్యలు వస్తాయని తెలిపారు. మద్యం తగ్గించాల్సింది పోయి బీర్ మంచిదని తాగాలని గతంలో పల్లా శ్రీనివాసరావు చెప్పారని, అంతమంచిదయితే గతంలో ఎందుకు నిషేధించారని ప్రశ్నించారు. విశాఖ ఎంపి శ్రీభరత్ కూడా బీచ్ షాక్స్‌పై తాగితే తప్పేముందంటూ అర్థం పర్థం లేని ప్రకటనలు చేస్తున్నారని అన్నారు. వీరి ప్రకటనలపై చంద్రబాబు ప్రభుత్వం తమ వైఖరి ప్రకటించాలని డిమాండ్ చేశారు.