భోగాపురం ఎయిర్‌పోర్టులో ప్రతిపాదించిన యుడిఎఫ్ ఛార్జీలు రద్దు చేయాలి విశాఖపట్నం ఎయిర్‌పోర్టును కొనసాగించాలి

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 23 జూన్, 2026.

భోగాపురం ఎయిర్‌పోర్టులో ప్రతిపాదించిన

యుడిఎఫ్ ఛార్జీలు రద్దు చేయాలి

విశాఖపట్నం ఎయిర్‌పోర్టును కొనసాగించాలి

-సిపిఐ(యం) డిమాండ్

నూతనంగా ప్రారంభించిన భోగాపురం జిఎంఆర్ విమానాశ్రయంలో వచ్చే, పోయే ప్రయాణీకులందరి దగ్గర యూజర్ ఛార్జీలు వసూలు చేయడాన్ని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ వ్యతిరేకిస్తున్నది.

దీని ప్రకారం భోగాపురం ఎయిర్‌పోర్టు నుండి వెళ్ళే దేశీయ ప్రయాణీకులకు రూ.835లు, బయటి నుండి భోగాపురం ఎయిర్‌పోర్టు ద్వారా వచ్చే ప్రయాణీకులకు రూ.355లు యూజర్ డెవలప్‌మెంట్ ఫీజు (యుడిఎఫ్) వసూలు చేస్తారు. అలాగే భోగాపురం ఎయిర్‌పోర్టు నుండి వెళ్ళే విదేశీ ప్రయాణీకులకు రూ.1255లు, బయటి నుండి వచ్చే విదేశీ ప్రయాణీకులకు రూ.545లు యుడిఎఫ్ ఫీజు వసూలు చేస్తారు. ఒకసారి దేశం లోపల (డొమెస్టిక్) ప్రయాణిస్తే రానూపోనూ దాదాపు రూ.1,300లు అదనంగా చెల్లించాలి. విశాఖ ఎయిర్‌పోర్టును ఎత్తేసి కొత్తగా భోగాపురం ప్రారంభించినందుకు ప్రయాణీకులపై ఇలా “జరిమానా” విధించడం అన్యాయం. ప్రయివేటీకరణ వల్ల సమర్దత, ధరలు తగ్గుతాయని ముఖ్యమంత్రి పదే పదే చెప్తున్న మాటలకు ఇది విరుద్దం.

యÖజర్ డెవలప్‌మెంట్ ఫీజుల ప్రతిపాదనను తక్షణమే ఉపసంహరించుకోవాలని సిపిఐ(యం) డిమాండ్ చేస్తున్నది. జూలైలో భోగాపురం ఎయిర్‌పోర్టు ప్రారంభిస్తామని పలు ప్రకటనలు వచ్చినా ఇప్పటి వరకు విశాఖ నగరం నుండి భోగాపురం చేరుకునేదానికి పూర్తిస్థాయిలో రహదారుల ఏర్పాటు కాలేదు. విశాఖ నగరం నుండి వెళ్ళే ప్రయాణీకులు సమయం మరియు ప్రయాణ రీత్యా కూడా పలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం విశాఖలో ఉన్న విమానాశ్రయాన్ని కొనసాగించాలని ప్రజలు కోరుతున్నారు. ప్రజల కోర్కెను గౌరవించాలని సిపిఐ(యం) కోరుతున్నది.

అందువలన రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి యుడిఎఫ్ ఛార్జీలు రద్దు చేయాలని, విశాఖ ఎయిర్‌పోర్టు కొనసాగేటట్లు చూడాలని సిపిఐ(యం) డిమాండ్ చేస్తున్నది.

 

 

(వి.శ్రీనివాసరావు)

రాష్ట్ర కార్యదర్శి