
ఈరోజు (07 జూన్, 2026) విలేకర్ల సమావేశం (విజయవాడలో) జరిగింది. ఆ వివరాలను ప్రచురణార్థం/ ప్రసారార్థం పంపుతున్నాము. -జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి
గాడితప్పిన రెండేళ్ల కూటమి పాలన
ఏం సాధించారని ప్రజల్లోకి వెళతారు
స్వర్ణాంధ్ర కాదు విషాద ఆంధ్రప్రదేశ్‌గా మార్చారు
మోడీ పాలనపై యువత గర్జిస్తోంది
ప్రజల ఆస్తులు లూఠీ చేస్తున్నారు
వైసిపి నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరించడం లేదు
టిడిపి, వైసిపి రెండూ బిజెపి పంచన చేరాయి
కూటమి రెండేళ్ల పాలనపై సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు
రెండేళ్ల కూటమి పాలన గాడి తప్పిందని, ప్రజలకు చేసిందేమీ లేకపోగా జాతీయ సంపద లూఠీ జరుగుతోందని, మతోన్మాదం పెచ్చరిల్లిపోతోందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు విమర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై యువత తీవ్ర ఆగ్రహంతో గర్జిస్తోందనీ తెలిపారు. ఆదివారం విజయవాడలోని బాలోత్సవ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు డి.రమాదేవి, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్.బాబూరావుతో కలిసి ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో టిడిపి రెండో విడత పాలన రెండేళ్లు పూర్తయిందని, కేంద్రంలో బిజెపి పాలన 12 సంవత్సరాలు పూర్తయిందని పేర్కొన్నారు. దీనిపై ప్రజల్లోకి వెళ్లాలని ప్రకటించారని, ఏమి సాధించారని ప్రజల వద్దకు వెళతారో సమాధానం చెప్పాలని అన్నారు. సంక్షేమ పథకాలు అమల్లో వైఫల్యం ఉందని, ప్రజల బాగోగులు పట్టించుకోవడం లేదని, అదే సమయంలో వనరులను పెద్దలకు కట్టబెడుతున్నారని అన్నారు. పెట్టుబడుల పేరుతో ప్రజల ఆస్తులు, భూములను లూఠీ చేస్తున్నారని విమర్శించారు. ఇప్పటి వరకూ రాష్ట్రంలోకి పెద్దగా పెట్టుబడులు వచ్చిందేమీ లేకపోయినా ఉన్న విదేశీ పెట్టుబడులు వెనక్కు వెళ్లిపోతున్నాయని తెలిపారు. అదే సమయంలో విదేశాల్లో ఉన్న భారతీయులు, తెలుగువాళ్లను అక్కడి ప్రభుత్వాలు వెనక్కు పంపించేస్తున్నాయని తెలిపారు. ప్రపంచం సాంకేతికంగా అభివృద్ధి చెందినా దానికి తగిన విధంగా ఇక్కడ ఉత్పత్తులు లేవని పేర్కొన్నారు. స్వర్ణాంధ్ర చేస్తామని పైకి చెబుతున్నా ఆచరణలో విషాద ఆంధ్రప్రదేశ్‌గా మార్చారని పేర్కొన్నారు. కేంద్రంలో ఉన్న మంత్రుల నిర్వాకంతో గత ఆరేళ్లలో 70 సార్లు పరీక్ష పేపర్లు లీకయ్యాయని, దీనికి బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి రాజీనామా చేయాలని కాక్రోచ్ జనతాపార్టీ పిలుపుతో యువత రోడ్లపైకి వచ్చారని అన్నారు. రాజీనామా చేయకపోతే బిజెపి ప్రభుత్వ పతనానికి అదే నాంది అవుతుందని హెచ్చరించారు. అభివృద్ధి చేయలేని పాలకులు తమ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు మత ఘర్షణల పేరుతో ప్రజల ఆలోచనను మార్చేందుకు ప్రయత్నిస్తున్నారని, అందులో భాగంగానే దేశంలో మత ఘర్షణలను పెంచుతున్నారని మండిపడ్డారు. హిందూధర్మం పేరుతో కొత్తగా టిడిపి మహానాడులోనూ ప్రకటనలు చేసిందని, గతంలో ఎన్నడూ లేని విధంగా ఆరఎసఎస్ ఆలోచనల్లో నుండి వచ్చే హిందూత్వను తెలుగుదేశం నెత్తికెత్తుకుందని తెలిపారు. బీచ్‌లలో బార్‌షాపులకు అనుమతులు ఇస్తామని చెప్పారని, గోవాలాంటి ఐలాండ్ ప్రాంతాల్లో ఉన్నట్లు ఇక్కడ నగరాలు, గ్రామాలతో కలిసి ఉండే బీచ్‌లలో బార్లు పెడితే మహిళలు, పిల్లలు, వృద్దులు, పర్యాటకలకు రక్షణ లేకుండా పోతుందని అన్నారు. మన రాష్ట్రానికి కొన్ని విలువలు ఉన్నాయని, వాటిని పర్యాటకం, మద్యం వ్యాపారం పేరుతో మంటగలుపుతుంటే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. మహిళలు మద్య నిషేధం చేయాలని కోరుతుంటే ఇంకా వ్యాపారం పెంచాలని ప్రభుత్వాలు ప్రయత్నించడం అన్యాయమని పేర్కొన్నారు. ప్రజలకిచ్చిన హామీలు గాలికొదిలేసిన చంద్రబాబు రాష్ట్రంలో లోకేష్‌ను సిఎంను చేసేందుకు అవసరమైన వేదికలను ఏర్పాటు చేసుకోవడంలో తలమునకలైందని పేర్కొన్నారు. కోనసీమ గ్యాస్‌ను రిలయన్స్ పైపులైన్ల ద్వారా దోచుకుపోతోందని, వామపక్ష పార్టీలు పర్యటన చేశామని అక్కడ దోపిడీ కళ్లకు కట్టినట్లు కనిపించిందని పేర్కొన్నారు. బందరు సమీపంలోని ఖాజా వద్ద గ్యాస్, అయిల్ నిక్షేపాలను వేదాంతకు ఇచ్చేశారని తెలిపారు. ఈ కంపెనీలన్నీ మోడీకి కుడి, ఎడమలని మొత్తం రాష్ట్రంలో ఉన్న సహజ సంపద మొత్తం వారికే దోచిపెడుతున్నారని దీనికి కూటమి ప్రభుత్వం సహకరిస్తోందని పేర్కొన్నారు. ఇటీవల గ్యాస్ ధరను మరో రూ.29 పెంచారని పేర్కొన్నారు. ఇలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ప్రజలపై వేస్తున్న భారాలకు వ్యతిరేకంగా ఈనెల తొమ్మిదోతేదీన రాష్ట్ర వ్యాప్తంగా రాస్తారోకో నిర్వహించాలని వామపక్ష పార్టీలు నిర్ణయించాయని అన్నారు.
ప్రతిపక్ష ప్రాతలో వైసిపి వైఫల్యం
ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరించాల్సిన వైసిపి ఆ పాత్రకు న్యాయం చేయలేదని శ్రీనివాసరావు అన్నారు. ఇక్కడ బిజెపి కూటమిలో ఉన్న టిడిపిపై విమర్శలు గుప్పిస్తూ కేంద్రంలో అదే టిడిపితో, బిజెపితో కలిసి నడుస్తూ బిజెపి చేస్తున్న నిర్ణయాలకు పూర్తిగా మద్దతు ఇస్తోందని అన్నారు. రాష్ట్రంలో అధికార, ప్రతిపక్ష పార్టీలు రెండూ బిజెపి పంచన చేరాయని విమర్శించారు. ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న ప్రత్యేక ఓటర్ల సవరణను కేంద్రంలో ఆమోదించిన టిడిపి, వైసిపి ఇక్కడకు వచ్చి దానిపై జాగ్రత్తగా ఉండాలంటూ ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రకటనలు చేస్తూ ప్రజలను మోసం చేస్తున్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలో వైసిపి నిజమైన ప్రత్యామ్నాయంగా వ్యవహరించడం లేదని పేర్కొన్నారు. ఒకవేళ ప్రజలకు మేలు చేయాలనుకుంటే దాని రాజకీయ వైఖరి ఏమిటో స్పష్టం చేయాలని కోరారు.
పవన్ కల్యాణ్ మతిలేని వ్యాఖ్యలు
కమ్యూనిస్టులపై పవన్‌కల్యాణ్ మతిలేని వ్యాఖ్యలు చేశారని శ్రీనివాసరావు విమర్శించారు. ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిస్టులకు ఆదరణ పెరుగుతోందని, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా భయపడే పరిస్థితి వచ్చిందని తెలిపారు. ఇవేమీ తెలుసుకోకుండా కమ్యూనిస్టులకు కాలం చెల్లిందనడం పవన్‌కల్యాన్ అవివేకమని తెలిపారు. కమ్యూనిస్టులపై శాపనార్థాలు పెట్టిన వారంతా కాల గర్భంలో కలసి పోయారన్నారు. నిజంగా కమ్యూనిస్టులకు కాలం చెల్లిందో లేదో పవన్‌కల్యాణ్ ట్రంప్‌ను అడిగి తెలుసుకోవాలన్నారు. పెట్టుబడిదారీ దోపిడీకి వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్తంగా నిరసనలు పెరుగుతున్నాయని తెలిపారు. గతంలో రష్యాలో కమ్యూనిస్టు ప్రభుత్వం దెబ్బతిన్న సమయంలోనూ కాలం చెల్లిపోయిందని చెప్పారని, మన దేశంలో మూడు రాష్ట్రాల్లో సిపిఎం అధికారంలోకి వచ్చిందని తెలిపారు. చరిత్ర తెలుసుకుని పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు చేయాలని సూచించారు.
