
భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
ప్రచురణార్ధం/ప్రసారార్ధం :
విజయవాడ,
తేది : 02 జూన్, 2026.
కమ్యూనిస్టులపై పవన్ కళ్యాణ్ అపరిపక్వ వ్యాఖ్యలు
-వి.శ్రీనివాసరావు, సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శి
కమ్యూనిజానికి కాలం చెల్లిందని పనికిరాని పాత చింతకాయ పచ్చడినే పవన్‌కళ్యాణ్ వండి వార్చారని సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ఘాటుగా విమర్శించారు. ఇది ఆయన ఆపరిపక్వత, రాజకీయ అవగాహనా రాహిత్యానికి నిదర్శనమని, ప్రపంచ పరిణామాలు ఏదిశగా నడుస్తున్నాయో కూడా వారికి అర్థం కావడం లేదని అన్నారు. నేడు ఎం.బి.విజ్ఞానకేంద్రంలో సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వై.వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన పార్టీ కార్యకర్తల విస్తృత సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు మాట్లాడారు. తమిళనాడులో సినీ నటుడు విజయ్ గెలుపు తర్వాత పవన్‌కళ్యాణ్‌పై ఒత్తిడి తీవ్రంగా ఉండడంతో ఆయన నిస్పృహనకు లోనవుతున్నారన్నారు. దీనివల్ల ఆయన ఏదేదో మాట్లాడుతున్నారన్నారు. మొన్నటి వరకు చేగువేరా, భగత్‌సింగ్ ఆదర్శాల గురించి చెప్పిన ఆయన నేడు కమ్యూనిజమే కాలం చెల్లిందంటున్నారు. కమ్యూనిజంపై ట్రంప్‌తో సహా అనేకమంది చేస్తున్న దాడి దాని బలాన్ని సూచిస్తున్నదని అన్నారు. గతంలో కమ్యూనిస్టులతో పనిచేసిన ఆయన ఆ తర్వాత బిజెపి సరసన చేరి సనాతన ధర్మం గురించి చాలా హడావుడి చేశారు. ఆంధ్ర ప్రజల్లో ప్రాంతీయ అభిమానం కూడా లేదని ఇప్పుడు మాట్లాడుతున్నారు. ఇలా రోజుకోమాట పూటకో విధానాన్ని మార్చే ఆయన కమ్యూనిజం గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. రాజకీయాలను వ్యాపారంగా భావించే రాజకీయ పార్టీలకు, సమ సమాజంకోసం త్యాగాలు చేసి పోరాడే కమ్యూనిస్టులకు నకసిఖ పర్యంతమంత తేడా ఉందని తెలిపారు. పెట్టుబడిదారీ వ్యవస్థ సంక్షోభంలో ఉందని, ప్రపంచమంతా పోరాటాలు ఉధృతమవుతున్నాయని మనదేశంలో కూడా యువత తీవ్ర అసంతృప్తితో ఉందని ఇటీవల వ్యక్తమైందని, కాక్‌రోచ్ జనతా పార్టీ పేరుతో వ్యంగాత్మక క్యాంపెయిన్ దీనికి ఉదాహరణ అని పేర్కొన్నారు. అమెరికాతో సహా పక్కనున్న శ్రీలంక వరకు జరుగుతున్న పరిణామాలు ఏమిటో పవన్ కళ్యాణ్ లాంటి వారికి కనిపించకపోయినా యువతరానికి స్పష్టంగా అర్థం అవుతుందన్నారు. మతతత్వ బిజెపితోచేరి యువతలో వస్తున్న మార్పుల్ని ఆయన గుర్తించడంలేదన్నారు. ప్రముఖ విశ్లేషకులు డా॥నాగేశ్వర్‌తో ఆరంభమైన వివాదం ప్రజాతంత్ర హక్కుల పరిధిలోనిదని, దాన్ని కొందరు పక్కదారి పట్టించి వివాదంగా మార్చారని, రెండు రాష్ట్రాల ప్రజలు ఇలాంటి వారి ఉచ్చులో పడకుండా తెలుగు ప్రజల ఐక్యతను కాపాడాలని విజ్ఞప్తి చేశారు.
(జె.జయరాం)
ఆఫీసు కార్యదర్శి
