ప్రకాశం జిల్లాలోని ఇనుప ఖనిజం గనులను విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు కేటాయించాలి

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
ప్రచురణార్ధం/ప్రసారార్ధం :
విజయవాడ,
తేది : 02 జూన్, 2026.

ప్రకాశం జిల్లాలోని ఇనుప ఖనిజం గనులను
విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు కేటాయించాలి

ప్రకాశం జిల్లాలోని ఒంగోలు దగ్గరలో కొణిజేడు, మర్లపాడు, యంపర్ల తదితర గ్రామాల్లో సుమారుగా 75 మిలియన్ మెట్రిక్ టన్నుల ఇనుప ఖనిజం ఉన్నట్లుగా కుదురుముఖ్  మరియు ఐరన్ ఓర్ కంపెనీ  (కేంద్ర ప్రభుత్వ సంస్థ) సుమారుగా 25 సంవత్సరాల క్రితమే నివేదిక ఇచ్చింది. గత 25 సంవత్సరాల నుంచి విశాఖ స్టీల్‌ప్లాంట్ యాజమాన్యం ప్రకాశం జిల్లాలోని ఇనుప ఖనిజం గనులను విశాఖస్టీల్‌ప్లాంట్‌కు అప్పగించాలని దరఖాస్తు చేసింది. గత వైఎసఆర్ ప్రభుత్వం ఈ గనులను జింపెక్స్ అనే ప్రైవేట్ కంపెనీకి 10 ఏళ్ల క్రితం కేటాయించింది. ఆ కంపెనీ ఒక్క టన్ను కూడా ఇనుప ఖనిజం తీయలేదు. ఇటీవల తెలుగుదేశం ప్రభుత్వం ఈ గనులను జిందాల్ స్టీల్‌కు కేటాయిస్తూ ఇటీవలె రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసింది. ఈ ఒప్పందాన్ని వెంటనే రద్దు చేయాలని, ఇవే గనులను విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు వెంటనే కేటాయించాలని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తున్నది.
జిందాల్ స్టీల్ కంపెనీతో చేసిన ఒప్పందం రాష్ట్ర ప్రయోజనాలకు పూర్తి వ్యతిరేకం. ప్రకాశం జిల్లాల్లోని గనుల్లో 11 శాతం మాత్రమే రాష్ట్ర ప్రభుత్వానికి వాటా ఉంచుకుంది. 89 శాతం వాటాలు కలిగిన జిందాల్ స్టీల్ వేలకోట్ల లాభాలు ఆర్జిస్తోంది. ఇనుప ఖనిజం ధర మార్కెట్‌లో టన్ను 6 వేల నుండి 8 వేల వరకూ ధర పలుకుతున్నది. ఇంతటి విలువైన ఖనిజ సంపదను ప్రైవేట్ కెంపినీల పరం చేయడం జాతి వ్యతిరేక చర్య. ప్రివీకరణ విధానాలను రాజకీయ నాయకుల సంపద పెంచుకోడానికి వాడుకుంటున్నారు. ప్రైవేట్ కంపెనీల వద్ద కమీషన్ కోసం కక్కుర్తి పడి రాష్ట్రంలోని ఖనిజ సంపదను కార్పొరేట్  కంపెనీలకు దోచిపెడుతున్నది. రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని సిపిఐ(యం) తీవ్రంగా ఖండిస్తున్నది.
విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు సొంత గనులు సమకూర్చడం కేంద్ర ప్రభుత్వ బాధ్యత. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గత 40 సంవత్సరాల నుండి విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు సొంత గనులు సమకూర్చలేదు. దీని వల్ల ప్రతి సంవత్సరం విశాఖ స్టీల్‌ప్లాంట్ సుమారు 2 వేల కోట్లు అదనంగా ఖర్చు చేయాల్సి వస్తుంది. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేట్‌కు అమ్మాలని లక్ష్యంతో విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు సొంత గనులు కేటాయించడం లేదు. రాష్ట్రంలోని ఇనుప ఖనిజం గనులను కేటాయించాలని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ మరియు వివిధ రాజకీయ పార్టీలు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. అయినా ప్రైవేట్ కంపెనీల నుంచి కమీషన్ కోసం జిందాల్ స్టీల్‌కు ప్రకాశం జిల్లాలోని ఇనుప గనులను కేటాయించడం తీవ్రంగ వ్యతిరేకిస్తున్నాం. ఇప్పటికైనా జిందాల్ స్టీల్ ఒప్పందాన్ని రద్దు చేసి విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు ప్రకాశం జిల్లాలోని గనులను కేటాయించాలని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తున్నది.

(వి.శ్రీనివాసరావు)
రాష్ట్ర కార్యదర్శి