
భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
ప్రచురణార్ధం/ప్రసారార్ధం :
విజయవాడ,
తేది : 02 జూన్, 2026.
డిఎస్సీ స్పోర్ట్స్ కోటాపై సమగ్ర విచారణ జరపాలి
డిఎస్సీ స్పోర్ట్స్ కోటా నియామకంలో జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణ జరిపించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తున్నది. రాష్ట్రంలో లక్షలాదిమంది నిరుద్యోగులు ఉద్యోగ నియామకాల కోసం ఎదురుచూస్తున్నారు. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని ఈ రెండు సంవత్సరాల్లో ఒక డిఎస్సీ మాత్రమే ప్రకటించింది. నిరుద్యోగ భృతి హామీ పూర్తిగా అమలు కాలేదు. ఖాళీగా ఉన్న 42 వేల ఉపాధ్యాయ పోస్టుల్లో కేవలం 16 వేల ఉద్యోగాలకు మాత్రమే డిఎస్సీ ప్రకటించడం పట్ల నిరుద్యోగులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అనేక వివాదాలు, కోర్టు కేసుల నేపథ్యంలో పరీక్షలు నిర్వహించి అర్హుల జాబితా ప్రకటించారు. అయితే స్పోర్ట్స్ కోటా ఎంపికలో అనేక అక్రమాలు జరిగినట్లు తీవ్రమైన ఆరోపణలు వస్తున్నాయి. వీటిపై ప్రభుత్వ ఇస్తున్న వివరణ మరిన్ని సందేహాలకు కారణమైంది. ప్రభుత్వ నిబంధనల మేరకు ఎంపిక చేసిన అభ్యర్థుల్లో కొందరిని తొలగించి వారి స్థానంలో స్పోర్ట్స్ కోట పేరుతో మరికొంత మందిని ఎంపిక చేసిన విధానం పలు అనుమానాలకు తావిస్తున్నది. కొందరు అక్రమాలకు పాల్పడి స్పోర్ట్స్ కోటాలో నకిలీ సర్టిఫికెట్లు సృష్టించారనే విమర్శలు వస్తున్నాయి.
కావున వీటిపై సమగ్ర విచారణ జరిపించి దోషులను శిక్షించడంతో పాటు అర్హులకు న్యాయం చేయాలని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నది.
(వి.శ్రీనివాసరావు)
రాష్ట్ర కార్యదర్శి
