పొగాకు రైతుల్ని ఆదుకోండి. కనీసం రూ.1000 కోట్లు కేటాయించాలి.

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 02 జూన్, 2026.

పొగాకు రైతుల్ని ఆదుకోండి. 

కనీసం రూ.1000 కోట్లు  కేటాయించాలి.

బోర్డు, ఎస్‌టిసి సొసైటీ ద్వారా కొనుగోలు చేయాలి. ఐటిసి దోపిడీకి అడ్డుకట్ట వేయాలి

ధర కిలోకు రూ.350 లకు తక్కువ కాకుండా నిర్ణయించాలి.

నోబిడ్స్ పేరుతో రైతులను వేధిస్తున్న కంపెనీలపై చర్యలు తీసుకోవాలి.

ఈ సంవత్సరం వర్జీనియా పొగాకు కొనుగోలులో ఐటిసి సహా బడా పొగాకు కంపెనీలు సిండికేట్‌గా ఏర్పడి రైతులను నిలువు దోపిడీ చేస్తున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరి రూ.500 కోట్లు చొప్పున వెయ్యికోట్లు కేటాయించి బోర్డు సొసైటీ ఎస్‌టిసి ద్వారా కొనుగోలు చేయాలని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తున్నది. పొగాకు రైతులు సాగిస్తున్న న్యాయమైన పోరాటానికి మద్దతు ప్రకటిస్తున్నది.

ఈ సంవత్సరం ప్రకాశం, నెల్లూరు, మార్కాపురం, ఏలూరు జిల్లాలో సుమారు 2 లక్షల ఎకరాల్లో రైతులు వర్జీనియా  పొగాకు సాగు చేశారు. పొగాకు బోర్డు అంచనా ప్రకారం 230 మిలియన్ల కిలోలు దిగుబడి వచ్చింది. గత సం॥ కన్నా ఈ సం॥ ఖర్చులు పెరిగాయి. అయినా దీన్ని అవకాశంగా తీసుకొని పొగాకు కొనుగోలు కంపెనీలు కనీస ధరను తగ్గించి, నోబిడ్స్ పేరుతో రైతులను తీవ్రంగా ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. దాదాపు సగం బేళ్ళు తిరస్కరణకు గురవుతున్నాయి. యుద్ధం, ఎగుమతులు సాకుతో కంపెనీలు పొగాకు కొనుగోలులో ఆలస్యం చేయటం, ధర  తగ్గించటం చేస్తున్నాయి. ధరలో నష్టంతోపాటు అధిక రవాణా భారంతో రైతులు కుంగిపోతున్నారు. ఈ పరిస్థితులలో కనీసం కిలో ధర రూ.350లు లేకుండా రైతులకు గిట్టుబాటు కాదు. కంపెనీలు రూ.250లకు మించి ఇవ్వడం లేదు. సగటుధర గత సం॥ రూ.280లు ఉండగా ఈ సం॥ రూ.200లే ఉంది. దానికితోడు తిరస్కరణకు గురైన బేళ్లు (నోబిడ్స్) పెరిగిపోయాయి.

ఏప్రిల్ 9న పొగాకు వేలం కేంద్రాలు ప్రారంభించి ఇప్పటికి 90 రోజులు గడుస్తున్నా ఇప్పటివరకు కేవలం 10 నుండి 15 శాతం మాత్రమే పొగాకు కొనుగోలు చేశారు. కొనుగోళ్ళ సీజన్ ప్రారంభానికి ముందు సిగరెట్లపై ఎక్సైజ్ పన్ను పెంచడం కేంద్ర ప్రభుత్వం ఐటిసికి మేలు చేయడానికి ఉద్దేశపూర్వకంగా తీసుకున్న చర్య. రోజులు గడిచే కొద్దీ పొగాకు రంగు మారటం, నాణ్యత తగ్గిపోవడం జరుగుతుంది. నాణ్యత పేరుతో పొగాకు కంపెనీలు మరింత ధర తగ్గించే అవకాశం ఉంది. అందువల్ల జూన్ 1న బోర్డు రైతులకిచ్చిన హామీ ప్రకారం తక్షణం కదిలి గిట్టుబాటు ధర కల్పించేందుకు చర్యలు తీసుకోవాలి. ముఖ్యమంత్రి చొరవ తీసుకొని కేంద్రంతో మాట్లాడాలి. రాష్ట్రం తరపున నిధి కేటాయించి సొసైటీ ద్వారా కొనుగోలు చేయాలి.

పొగాకు రైతులు పండించిన పొగాకు ఉత్పత్తులతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రతి ఏటా వేలకోట్ల రూపాయల పన్నుల ఆదాయం వస్తున్నది. పొగాకు వేలం నిర్వహణలో బోర్డుకు వస్తున్న ఆదాయాన్ని కేంద్రం తన ఖాతాలో వేసుకుంది. ఇప్పుడు రైతుల అవసరాలకు దాన్ని వినియోగించాలి. సరైన ధరకు పొగాకు అమ్ముకోలేని పరిస్థితుల్లో రైతులు ఉన్నారు. ఈ సమయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పొగాకు కొనుగోలుకు చెరి 500 కోట్లు రూపాయలు పొగాకు బోర్డుకు, పొగాకు రైతుల సహకార సమాఖ్యకు ఎస్‌టిసికి కేటాయించి పొగాకు కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తున్నది.

 

 

(వి.శ్రీనివాసరావు)

రాష్ట్ర కార్యదర్శి