వడదెబ్బ మృతులకు రూ.25 లక్షలు ఎక్స్‌గ్రేషియో ఇవ్వాలి

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 30 మే, 2026.

 

వడదెబ్బ మృతులకు రూ.25 లక్షలు ఎక్స్‌గ్రేషియో ఇవ్వాలి

 

రాష్ట్రంలో ఎండలు తీవ్రత వలన వడదెబ్బ తగిలి అనేకమంది మృత్యువాతపడుతున్నారు. తాజా అకాల వర్షాలు కూడా దెబ్బతీశాయి. కొన్నిచోట్ల విద్యుత్‌షాక్‌తో చనిపోయారు. ఉపాధి కూలీలు, భవన నిర్మాణ, ఆటో, ముఠా, రిక్షా కార్మికులు, దినసరి కూలీలు, వృద్దులు, నిరాశ్రయులే (బిక్షాటన) ఎక్కువమంది ఉన్నారు. ప్రకృతి విపత్తుల నిధి కింద చనిపోయినవారి కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.25 లక్షలు ఎక్స్‌గ్రేషియో ఇవ్వాలని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తున్నది. ప్రజల సౌకర్యార్థం తగు ఉపశమన చర్యలు చేపట్టాలని కోరుతున్నది. అన్న క్యాంటీన్‌లలో ఉచితంగా మజ్జిగ, మంచినీళ్ళు అందించాలి. బస్టాండ్, రైల్వే స్టేషన్‌ల వంటి బహిరంగ ప్రదేశాల్లోనూ చర్యలు తీసుకోవాలి. ఉపాధి పథకం సహా అసంఘటిత కార్మికులు పనిచేసే ప్రాంతాల్లో తగు విశ్రాంతి, ఉపశమనం కల్గించాలి. సమయాల్లో అవసరమైన మార్పులు చేయాలి. ఉపాధి కార్మికులకు ఒకపూట పనిచేయించాలి. ఫేస్‌యాప్ నుండి మినహాయింపు ఇవ్వాలి.

గతంలో ఎన్నడూ లేనంత 48 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పెరిగాయి. మే నెల ప్రారంభం నుండి ఈ వడగాడ్పులు మొదలయ్యాయి. రోజుకు పదుల సంఖ్యలో మరణిస్తున్నారు. మే 22న ఒక్కరోజే 21 మంది మరణించారు. అందునా విజయవాడలో 10 మంది మరణించారు. ప్రభుత్వం కనీస ఉపశమన చర్యలు తీసుకోవడం లేదు. మాటల వరకే పరిమితమవుతున్నది. ఎక్కడికక్కడ చలివేంద్రాలు, రోడ్లపై నీటితుంపర చల్లించడం, ఓఆరఎస్ ప్యాకెట్లు ప్రజలకు అందించడం, చలువ పందిళ్ళు ట్రాఫిక్ సిగ్నల్స్, రైలు గేట్లు వద్ద, ఆసుపత్రుల్లో వార్డులు కేటాయించడం వంటి చర్యలు చేపట్టాలి. ఈ ఏడు ఎల్‌నినో కారణంగా రుతుపవనాలు రాక ఆలస్యమై మరింత ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని ఐఎండి తెలుపుతున్నది. కావున ప్రభుత్వం తగు జాగ్రత్తలు తీసుకోవాలని సిపిఐ(యం) కోరుతున్నది.

ఇప్పటి వరకు చనిపోయిన కుటుంబాలకు రూ.25 లక్షలు నష్టపరిహారం ఇవ్వాలని, పెరుగుతున్న  ఉష్ణోగ్రతల నుండి ఉపశమన చర్యలు చేపట్టాలని సిపిఐ(యం) కోరుతున్నది.

 

 

(వి.శ్రీనివాసరావు)

రాష్ట్ర కార్యదర్శి