
భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
ప్రచురణార్ధం/ప్రసారార్ధం :
విజయవాడ,
తేది : 29 మే, 2026.
సరైన సన్నాహాలు లేకుండా
న్యాయ వ్యవస్థలో డిజిటల్ విధానం వద్దు
కోర్టుల నుండి నిందితులు, సాక్షులు మరియు బాధితులకు వాట్సప్, సిగ్నల్, టెలిగ్రామ్, ఈమెయిల్ వంటి డిజిటల్ పద్ధతుల ద్వారా వారెంట్లు, సమన్లు పంపాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని పునః పరిశీలించాలని సిపిఐ(ఎం) రాష్ట్ర కమిటీ కోరుతున్నది. కేసులు త్వరగా పరిష్కరించడం లో భాగంగా ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రానిక్ ప్రక్రియల (జారీ, బట్వాడా, అమలు) నిబంధనలు- 2025ను అమలు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించినప్పటికీ అమలులో అనేక సమస్యలతో పాటు సైబర్ నేరగాళ్ళు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని దుర్వినియోగం చేసే అవకాశాలు చాలా ఎక్కువగా వున్నాయని సిపిఐ(ఎం) అభిప్రాయపడుతున్నది. హైకోర్టు కూడా ఈ విషయమై దృష్టి సారించాలని కోరుతున్నది.
సిబిఐ, ఈడి, ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్‌ల పేరుతో సైబర్ నేరగాళ్ళు డిజిటల్ మాధ్యమాల ద్వారా మెసేజ్‌లు, వాట్సఅప్ కాల్స్ చేస్తూ డిజిటల్ ఆరెస్టులని భయపెట్టి అనేకమంది దగ్గర కోట్ల రూపాయలు దోచుకుంటున్న సంఘటనలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోనే సైబర్ క్రైమ్ 8% పెరిగినట్లు జాతీయ నేర పరిశోధనా బృందం (ఎన్‌సిఆర్‌బి) ప్రకటించింది. 2022 ` 2024లో రాష్ట్రంలోని వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదు అయిన 7,210 సైబర్ క్రైమ్ కేసుల్లో బాధితులు రూ. 970 కోట్లు మోసపోయినట్లు ఎన్ సి ఆర్ బి ప్రకటించింది. ఇలాంటి స్థితిని అరికట్టకుండా కోర్టులు డిజిటల్ మాద్యమాలు ఉపయోగిస్తే సైబర్ నేరస్తులు దీన్ని ఆసరా చేసుకొని మరింతగా ప్రజలను మోసం చేసే అవకాశం ఉంది. ఏది అసలో, ఏది నకిలీనో తెలియక మోసపోయేవారి సంఖ్య పెరుగుతుంది. ఆ రీత్యా ముందస్తుగా డిజిటల్ నేరాలను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాలి.
కోర్టులకు వచ్చే బాధితులు మరియు సాక్షుల ఫోన్, మెయిల్ వివరాలు బహిర్గతం కాకుండా రక్షణ చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. కానీ ప్రస్తుత డిజిటల్ యుగంలో దుర్వినియోగానికి గురయ్యే ప్రమాదమే ఎక్కువగా ఉంది. అదే సమయంలో నిందితుల డేటాకు ఎటువంటి రక్షణ ఈ చట్టం కల్పించలేదు. సైబర్ నేరగాళ్ళు దాన్ని దుర్వినియోగం చేసే అవకాశం ఉంది. ఇప్పటికే ఆధార్ డేటా లీకేజీ ద్వారా అనేక సమస్యలు మనముందుకొస్తున్నాయి. ప్రజల అక్షరాస్యత, అవగాహన స్థాయిని ఉపయోగించుకొని సైబర్ నేరాలు మరింతగా పెరుగుతాయి.
కావున కోర్టు సేవలో డిజిటల్ మాద్యమాలను ఉపయోగించే ముందు సైబర్ నేరాలను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని, వ్యక్తిగత వివరాల భద్రతకు అవసరమైన అన్ని చర్యలు పటిష్టంగా అమలు చేయాలని సిపిఐ(ఎం) డిమాండ్ చేస్తున్నది.
(వి.శ్రీనివాసరావు)
రాష్ట్ర కార్యదర్శి
