చమురు ధరలు పెంపుకు వ్యతిరేకంగా నిరసనలకు సిపిఐ(యం) పిలుపు

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 25 మే, 2026.

చమురు ధరలు పెంపుకు వ్యతిరేకంగా

నిరసనలకు సిపిఐ(యం) పిలుపు

ప్రజల నడ్డి విరిచే విధంగా రోజూ పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడానికి వ్యతిరేకంగా ఎక్కడికక్కడ నిరసనలు తెలియచేయాలని, ప్రజా ప్రతినిధులను (యంపీలు, ఎమ్మెల్యేలు) నిలదీయాలని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ ప్రజలకు పిలుపునిస్తున్నది. పెంచిన పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గించాలని సిపిఐ(యం) డిమాండ్ చేస్తున్నది.

వరుసగా నాలుగోసారి మళ్లీ ఈ రోజు రూ.2.86/2.84లు చొప్పున పెంచి పేద, మధ్యతరగతి ప్రజల నడ్డి విరిచే కేంద్ర ప్రభుత్వ నిరంకుశ చర్యలను సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తున్నది. గత పది రోజులుగా రెండు మూడు రోజులకొకసారి చమురు ధరలను పెంచుతూ పేద, మధ్యతరగతి ప్రజానీకంపై పెనుభారం వేయడం గర్హనీయం. దఫదఫాలుగా భారాలు వేస్తుండడంతో నిత్య జీవితావసరాల ధరలు పెరిగి ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు చమురుపై రాష్ట్ర ప్రభుత్వం టాక్స్‌లు తగ్గించడం లేదు. ఇష్టానుసారం ధరలు పెంచి దోచుకుంటున్న ప్రైవేట్ ఆయిల్ కంపెనీలకు ముకుతాడు వేయాలి. కానీ అదానీ, అంబానీలకు, అమెరికా ఆయిల్ కంపెనీలకు లొంగిపోయిన ప్రభుత్వం ఆ భారాన్ని ప్రజలపై వేస్తున్నది తప్ప ప్రజల బాధలు కనపడడం లేదు. ప్రజలు వ్యతిరేకించి నిరసనలు చేస్తున్నా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. మాట తప్పి మోసం చేసిన ప్రభుత్వ తప్పుడు విధానాన్ని ప్రజలు నిరసించాలి.

పెంచిన చమురు ధరలను ఉపసంహరించాలని ఎక్కడికక్కడ ప్రజలను కదిలించి నిరసనలు తెలపాలని పార్టీ శాఖలకు పిలుపునిస్తున్నది.

 

 

(వి.శ్రీనివాసరావు)

రాష్ట్ర కార్యదర్శి