
(ప్రచురణార్థం: సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ముఖ్యమంత్రికి వ్రాసిన లేఖను ప్రచురణార్ధం పంపుతున్నాం. -జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి)
భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
విజయవాడ,
తేది : 21 మే, 2026.
శ్రీయుత నారా చంద్రబాబునాయుడు గారికి,
గౌరవ ముఖ్యమంత్రి,
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం,
అమరావతి.
విషయం: కాజబ్లాక్‌ను వేదాంత కంపెనీకి ఇవ్వకుండా ప్రభుత్వమే స్వాధీనం చేసుకొని నిర్వహించాలని కోరుతూ...
అయ్యా!
ఓఎన్‌జిసి డ్రిల్లింగ్ చేసి, చమురు, సహజవాయువు వెలికితీసే కాజబ్లాక్‌ను “వేదాంత” కార్పొరేట్ కంపెనీకి అప్పగీస్తున్నట్లు మీడియాలో చూసి ఆశ్చర్యపోయాను. అంత విలువైన జాతీయ సంపదను ఒక ప్రయివేటు సంస్థకు అప్పగించడం న్యాయం కాదు. అది రాష్ట్ర పురోగతికి తీవ్ర నష్టం చేస్తుంది. అందువల్ల ప్రభుత్వమే స్వాధీనం చేసుకొని నిర్వహించాలని కోరుతున్నాను.
కృష్ణా జిల్లాలోని మొవ్వ, గూడూరు, మచిలీపట్నం, పామర్రు పరిసర ప్రాంతాల్లో ఓఎన్‌జిసి డ్రిల్లింగ్ చేసి కనుగొన్న తరువాత 114.93 చ॥కి॥మీ॥ పరిధిలోనున్న చమురు సహజవాయువు కాజబ్లాక్‌ను కేంద్ర ప్రభుత్వం నిర్వహించకుండా ప్రయివేటు కంపెనీకి అప్పగించడం సహేతుకం కాదు. దానికి కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వశాఖ, రాష్ట్ర ప్రభుత్వం అన్ని అనుమతులు ఇవ్వడం అంటే విలువైన రాష్ట్ర సంపదను ప్రైవేటు కంపెనీలకు కట్టబెట్టడమే. ఒకవైపు పెట్రోలు, డీజిల్ ధరలు అంతర్జాతీయంగా పెరిగాయని, కంపెనీలకు నష్టం వస్తుందని చెప్పి ప్రజలపై భారాలు వేస్తున్నారు. రెండోవైపు మన రాష్ట్రంలో చమురు సహజవాయువును వెలికితీసే కెజి బేసిన్ వంటివి ఇప్పటికే ప్రయివేటు, కార్పొరేట్ కంపెనీలకు అప్పజెప్పడం వల్ల సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాము. ప్రైవేటు కంపెనీలు అధిక లాభాలకు అమ్ముకొని రాష్ట్రవప్రయోజనాలను, అవసరాలను నిర్లక్ష్యం చేస్తున్నాయి.
ఒక వైపు గ్యాస్, పెట్రోల్, డీజిల్ కొరతను ఎదుర్కొంటున్నాము. ఆ పేరుతో ధరలు పెంచి ప్రజలపై భారాలు మోపుతున్నారు. మరో వైపు చమురు, గ్యాస్ నిక్షేపాలను రాష్ట్రానికి దక్కకుండా పోతున్నాయి. ఇదే ప్రభుత్వం నిర్వహిస్తే ప్రజలకు చౌకగా ఇవ్వడమే కాకుండా ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది. దాన్ని రాష్ట్రాభివృద్ధికి వినియోగించవచ్చు.
ఈ ప్రాజెక్టు నిర్వహణలో కాలుష్య నివారణకు చర్యలు తీసుకోవాల్సి ఉంది. వేదాంత కార్పొరేట్ కంపెనీ కాలుష్య నివారణ చర్యలు తీసుకోక తమిళనాడు తూత్తుకుడి, ఒరిస్సా బాక్సైట్‌లలో ప్రజా ప్రతిఘటనలు, కాల్పులు మన కళ్ల ముందున్నాయి.
కావున వేదాంత కంపెనీకి కాజబ్లాక్‌ను ఇవ్వకుండా చమురు, సహజ వాయువు వెలికితీసే బాధ్యత ప్రభుత్వమే తీసుకొని నిర్వహించాలని కోరుతున్నాను.
అభివందనములతో...
(వి.శ్రీనివాసరావు)
రాష్ట్ర కార్యదర్శి
