ప్రజారాజకీయాలకు నిలువెత్తు నిదర్శనం సుందరయ్య

ఈరోజు సిపిఐ(యం) రాష్ట్ర కార్యాలయంలో పుచ్చలపల్లి సుందరయ్య 41వ వర్ధంతి సభ వివరాలను ప్రచురణార్థం/ ప్రసారర్థం పంపుతున్నాము. ` జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి

 

 

ప్రజారాజకీయాలకు నిలువెత్తు నిదర్శనం సుందరయ్య 

వర్థంతి సభలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వై.వెంకటేశ్వరరావు 

 

ప్రజా రాజకీయాలకు నిలువెత్తు నిదర్శనం పుచ్చలపల్లి సుందరయ్య అని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వై.వెంకటేశ్వరరావు అన్నారు. సుందరయ్య 41వ వర్థంతి సందర్భంగా విజయవాడలోని సిపిఎం రాష్ట్ర కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు జె.జయరాం అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో వై.వెంకటేశ్వరరావు మాట్లాడారు. సిపిఎం అగ్రనేతగా సుందరయ్య నిరంతరం ప్రజల మధ్యే పనిచేశారని అన్నారు. చిన్న వయస్సులోనే ప్రజా సమస్యలపై అధ్యయనం చేయడంతోపాటు కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాడారని తెలిపారు. తన యావధాస్తిని పేదల కోసం ఇచ్చేసిన గొప్పవ్యక్తని పేర్కొన్నారు. సేవా కార్యక్రమాలు చేపట్టారని పేర్కొన్నారు. కమ్యూనిస్టు నాయకుడిగా నిరంతరం ప్రజల మధ్యే ఉంటూ వారి సమస్యలు అర్థం చేసుకుని వాటి పరిష్కారానికి పోరాడారని వివరించారు. దక్షిణ భారతదేశ కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాతగా, తెలంగాణా సాయుధ పోరాటానికి నాయకుడిగా అనన్య సామాన్యమైన కృషి చేశారని పేర్కొన్నారు. అప్పట్లోనే సైకిల్ పై పార్లమెంటుకు వెళ్లి నిరాడంబర జీవితాన్ని గడిపారని వివరించారు. కమ్యూనిస్టు విలువలు పాటించారని, ఆయన గ్రామంలో సహపంక్తి భోజనాలు ఏర్పాటు చేసి అప్పట్లోనే ఆదర్శ జీవితం గడిపారని అన్నారు. కమ్యూనిస్టు పార్టీలో వచ్చిన ఒడిదుడుకులను ఎదుర్కొనే సమయంలో సైద్ధాంతికంగా ఆయన నిర్వహించిన పాత్ర అత్యంత స్ఫూర్తిదాయకమని తెలిపారు. అన్నిటికీ మించి ఆయన గొప్ప మానవతావాదని తెలిపారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వి.ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాణం, సిద్ధాంతఆచరణ, సేవతాత్పరతకు సుందరయ్య నిజమైన నిదర్శమని పేర్కొన్నారు. గతం, వర్తమానం, భవిష్యత్‌కు ఆయన ఆదర్శనీయులని, ఆయన చెప్పిన అంశాలన్నీ నేటి సమాజానికి, ఆర్థిక పరిస్థితులకు అద్దం పడుతున్నాయని తెలిపారు. ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని చేప్పేవారని, శత్రువులను ఎదుర్కోవడంలో ఆయనకు ఆయనేసాటని తెలిపారు. ప్రస్తుత రాజకీయాల్లో భారతదేశంలో ఎక్కువ పార్టీలు బిజెపికి లొంగిపోతున్నాయని, ఒక్క కమ్యూనిస్టు పార్టీలు మాత్రమే వారిని ధైర్యంగా ఎదుర్కొంటున్నాయని, దానికి సుందరయ్యలాంటి వారి స్ఫూర్తే కారణమని తెలిపారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కె.సుబ్బరావమ్మ మాట్లాడుతూ కమ్యూనిస్టు ఉద్యమాన్ని నిర్మించడంతోపాటు, దేశంలో పేదలు, శ్రామికులు, కార్మికుల సమస్యలపై పోరాడటంతో, అధ్యయనం చేయడంలో సుందరయ్య నిర్వహించిన పాత్ర మరువలేనిదని తెలిపారు. ఈ కార్య్రకమంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎ.వి.నాగేశ్వరరావు, రాష్ట్ర కమిటీ సభ్యులు ఆండ్ర మాల్యాద్రి, యు.వి,రామరాజు, డివైఎఫఐ నాయకులు రామన్న, రాము, సిఐటియు నాయకులు ఆర్.వి.నరసింహారావు, మత్స్య కార్మిక సంగం నాయకులు కొల్లాటి శ్రీనివాసరావు, ఎంబివికె బాధ్యులు తులసీరావు, స్వరూపరాణి తదితరులు పాల్గొన్నారు.