(ప్రచురణార్థం: సిపిఐ(యం) కేంద్ర కమిటీ సభ్యులు డి.రమాదేవి ముఖ్యమంత్రికి వ్రాసిన లేఖను ప్రచురణార్ధం పంపుతున్నాం. - జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి)
భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
విజయవాడ,
తేది : 19 మే, 2026.
శ్రీయుత నారా చంద్రబాబునాయుడు గారికి,
గౌరవ ముఖ్యమంత్రి,
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం,
అమరావతి.
విషయం : పెదపేట దళితవాడపై నిర్బంధం తొలగించాలని కోరుతూ...
అయ్యా!
పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు మండలం పెదపేట దళిత వాడను ఈనెల 16వ తేదీన మాపార్టీ స్థానిక కార్యకర్తలతో కలిసి సందర్శించాను.
బలహీనులుగా అణచివేతకు గురయ్యే దళితులకు రక్షణ కల్పించి వారు గౌరవంగా జీవించేందుకు మన రాజ్యాంగం అనేక హక్కులను కల్పించింది. వాటిని అమలు చేసి, దళితులకు పేదలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. ఈ విషయాలు మీకు తెలుసు. కానీ ఆ గ్రామంలో శ్రీరామనవమి రోజున గొంతేనమ్మ గుడిలో బలవంతంగా శంకుస్థాపన చేసి స్థానిక దళితవాడపై దాడిచేశారు. దళితవాడ మీదకు దాడికి వచ్చిన వారిని వదిలేసి ప్రశ్నించిన వారిని, అవమానాన్ని ప్రతిఘటించిన వారిని అక్రమంగా అరెస్టు చేశారు. పోలీసు కష్టడీలో యువకులను లాఠీలతో కొట్టారు. తీవ్రంగా హింసించారు. పోలీసు కస్టడీలో యువకులను హింసించిన అధికారులపై విచారించి చర్య తీసుకోవాలి.
ఆ గ్రామంలో ఉన్న పురాతన గొంతేనమ్మ/నందిమ్మ గుడిని, సత్రాన్ని జనం నిద్రపోయే సమయంలో అర్దరాత్రి వందలాది మంది పోలీసుల సమక్షంలో ఎమ్మార్వో నేతృత్వంలో బుల్డోజర్లతో ఏప్రిల్ 25న కూల్చివేశారు. ఒక వ్యక్తి ఏర్పాటు చేసుకున్న గుడిని కూడా కూల్చడానికి సిద్ధపడరు ప్రజల నమ్మకాల కనుగుణంగా కానీ పురాతనంగా ఉన్న గుడిని అక్కడ స్థానిక దళితుల నమ్మకాలను ఎందుకు గౌరవించలేక పోయారు? వర్ణాశ్రమ వ్యవస్థలో స్థానంలేని దళితులకు ఏహక్కులు అవసరం లేదని మీ ప్రభుత్వ అధికారులు నిర్ణయించారా? శ్రీరాముడికి ఆలయాన్ని గొంతేనమ్మగుడిని కూలగొట్టి నిర్మాణం చేయమని రాముడు కోరాడా? ఈ పరిణామాలు ఎక్కడకు దారితీస్తాయో ఆలోచించగలరు.
సుప్రీంకోర్టు నిన్న పెదపేట దళితవాడలో యధాతధ స్థితిని కొనసాగించాలని ఆదేశాలిచ్చింది. సుప్రీంకోర్టు ఆదేశాలను జిల్లా కలెక్టర్ అమలు చేయాలి. అక్కడ మొదలు పెట్టిన నిర్మాణం ఆపివేయాలి. వాస్తవాలను సుప్రీంకోర్టుకు నివేదించాలి. దళితవాడ మీదకు దాడికి వచ్చారు. అంతకుముందే అనిల్ అనే అతను సోషల్ మీడియాలో దళితులపై రెచ్చగొట్టే వ్యాఖ్యానాలు చేశారు. దళిత ప్రజలపై తప్పుడు కేసులు పెట్టి దొరికిన వారిని దొరికినట్లు అరెస్టు చేశారు. ఇంకా 10 మంది బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నారు. కానీ వారికి జామీను పత్రాలు ఇవ్వడానికి సిద్దమైన వ్యక్తులకు ఆస్థి సర్టిఫికెట్ ఇవ్వడానికి స్థానిక అధికారులు నిరాకరిస్తున్నారు. తక్షణం అడిగిన వారికి సర్టిఫికెట్‌లు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోగలరని కోరుతున్నాను.
జ్యోత్స్న స్థానిక కౌన్సిలర్ నిర్వహిస్తున్న వాటర్ ప్లాంట్‌ను మూసివేసి ఆమె కుటుంబ ఆర్థిక వనరులను దెబ్బతీసే ప్రయత్నం మున్సిపల్ అధికారులు చేస్తున్నారు. ఇక పోలీసులను కాపలా ఉంచి 144 సెక్షన్ విధించి దళితవాడపై ఇతరుల పెత్తనాన్ని సాగించడానికి పూనుకోవడం ఏచట్టం ప్రకారం చేస్తున్నారు? దళితవాడలో తగాదాలు లేవు. బయట నుంచి వచ్చి వారి గుడిని అక్రమంగా తమ చేతుల్లోకి తీసుకున్నారు. వారికి రక్షణగా ప్రభుత్వం 144 విధించింది. గుడి నిర్మాణాన్ని స్థానికులకు వదిలేసి మతం పేరుతో ప్రజల హక్కులను హరించడాన్ని విరమించండి. ఒక దళితవాడపై కక్షపూరితంగా అణచివేతకు పూనుకోవడాన్ని తక్షణం నిలిపివేయాలని చట్టబద్ద అవకాశాలు కల్పించేందుకు తగు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను.
(1) పెదపేట దళితులపై నిర్బంధాన్ని ఆపండి. ప్రాధమిక హక్కులను కాపాడండి.
(2) సుప్రీంకోర్టు ఆదేశాలను అమలు చేయండి
(3) పోలీసు కస్టడీలో యువకులను హింసించిన అధికారులపై విచారించి చర్య తీసుకోవాలి
అభివందనములతో...
(డి.రమాదేవి)
సిపిఐ(యం) కేంద్ర కమిటీ సభ్యులు
కాపీటు :
కలెక్టర్ గారికి,
పశ్చిమగోదావరి జిల్లా,
భీమవరం.
