
(ప్రచురణార్థం: సిపిఐ(యం) పోలిట్‌బ్యూరో సభ్యులు బి.వి.రాఘవులు ముఖ్యమంత్రికి వ్రాసిన లేఖను ప్రచురణార్ధం పంపుతున్నాం. -జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి)
భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
విజయవాడ,
తేది : 19 మే, 2026.
శ్రీయుత నారా చంద్రబాబునాయుడు గారికి,
గౌరవ ముఖ్యమంత్రి,
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం,
అమరావతి.
విషయం : విశాఖ జిల్లా పంచగ్రామాల భూసమస్య పరిష్కార చర్యలు చేపట్టాలని కోరుతూ...
అయ్యా!
గత మూడు దశాబ్దాలుగా విశాఖ జిల్లా పంచగ్రామాల భూసమస్య పరిష్కారం కాకపోవడంతో సుమారు 2 లక్షల మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తమ ప్రభుత్వం 2014లో విశాఖలో జరిపిన మొట్టమొదటి కేబినెట్ సమావేశంలో ఈ సమస్య వంద రోజుల్లో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. నేటికి 12 సంవత్సరాలు పూర్తయ్యాయి. అయినా ఇంకా పరిష్కారం కాలేదు.
(1) 1996-97లలో ప్రభుత్వం పెందుర్తి, చినగదిలి ఎమ్మార్వోల ద్వారా ఆ ప్రాంతంలోని మొత్తం 11,282.26 ఎకరాల భూమిలో సింహాచలం దేవస్థానానికి ఏకంగా 9,063.22 ఎకరాల భూమికి రైత్వారీ పట్టాలు ఇచ్చేసింది. ఈ పట్టాలు మినహా ఈ భూమిపై హక్కులకు సంబంధించి దేవస్థానం వద్ద ఎటువంటి ఆధారాలూ లేవు. ఈ పట్టాల ఆధారంగా (ప్రభుత్వం 19.08.2000 ఇచ్చిన జివో నెంబర్ 578) అప్పటి వరకు హక్కుదారులుగా ఉన్న ప్రజలందరినీ ఆక్రమణదారులుగా అన్యాయంగా ముద్ర వేయడం ద్వారా అప్పటి వరకు లేని సమస్యను ప్రభుత్వమే సృష్టించింది.
(2) ఈ పట్టాలు చెల్లవని నాటి సిసిఎలఏ గారు వాటిని రద్దుజేశారు. కానీ మీ ప్రభుత్వం పట్టాలు కొనసాగించింది. అప్పుడు ఏర్పడిన అసెంబ్లీ హౌస్ కమిటీ అనేకమంది మధ్యతరగతి ప్రజలు తమ కష్టార్జితంతో, వివిధ ఆర్థిక సంస్థల నుండి లోన్లు కూడా తీసుకుని ఇళ్ళు కట్టుకున్నారని, వీరిని ఖాళీ చేయడంచడం సాధ్యం కాదని, అందువల్ల సిట్టింగ్ జడ్జితో కమిటీ వేసి, వీటిని రెగ్యులరైజ్ చేయాలని సూచించింది.
(3) దీనిపై నడిచిన కేసులు 2010లో విశాఖ ఆర్డీవో గారు 268/2002/సి తేది. 03.04.2010న ఆ పట్టాలు సక్రమం కాదని పేర్కొంటూ ఈ భూములపై రీసర్వే చేయాలని ఆర్డర్ జారీచేశారు. ఈ ప్రాంతంలో జరిగిన ఒక భూ కుంభకోణంపై 2014లో సిపిఐ(యం) హైకోర్టులో కేసువేయగా, హైకోర్టు ఆదేశానుసారం విశాఖ జాయింట్ కలెక్టరు గారితోపాటు, సర్వే, సిసిఎలఏకు చెందిన ముగ్గురు ఉన్నతాధికారుల కమిటీ కూడా ఈ పట్టాలు సక్రమం కాదనే విషయాన్ని తెలిపింది. అయినా ప్రభుత్వం ఆ పట్టాలను రద్దు చేయలేదు. అందువలనే ఈ సమస్య పరిష్కారం కాకుండా నానుతూ ఉన్నది.
(4) ప్రభుత్వం ఇళ్ళ క్రయ విక్రయాలను నిలిపివేసింది. కొండమీద గిరిజనులతో సహా ఇళ్ళ నిర్మాణాలను, రిపేర్లను కూడా అనుమతించలేదు. ఈ నిషేదాల వలన ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు.
(5) ఈ భూములపై 1903లో గిల్‌మేన్ సర్వే రికార్డులలో అడవివరం పంచాయతీలో కేవలం 39.5 ఎకరాల భూమి మాత్రమే సింహాచలం దేవస్థానానిదని ఉంది. మిగిలిన భూమి జిరాయితి, బంజరు, పోరంబోకు, ఫారెస్టు భూమి అని పేర్కొంది. రైతుల పేర్లతో సహా సర్వే నెంబర్లు కూడా పేర్కొంది. దీని తరువాత ఈ భూములపై సమగ్ర అధికారిక సర్వే జరగలేదు. కావున ఇదే ప్రమాణికం.
మీరు పై అంశాలను పరిశీలించి తక్షణం ఈ సమస్యను పరిష్కరించే చర్యలు చేపట్టాలని, ఈలోగా నిర్మాణాలను, రిపేర్లను అనుమతించాలని, క్రయ విక్రయాలను, రిజిస్ట్రేషన్లను పునరుద్దరించాలని కోరుతున్నాను.
అభివందనములతో...
(బి.వి.రాఘవులు)
సిపిఐ(యం) పోలిట్‌బ్యూరో సభ్యులు
