వైద్య, ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న డైరెక్ట్ కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల బకాయి వేతనాలు వెంటనే చెల్లించాలని కోరుతూ.

(ప్రచురణార్థం: సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ముఖ్యమంత్రికి వ్రాసిన లేఖను ప్రచురణార్ధం పంపుతున్నాం. -జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి)

 

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

విజయవాడ,

తేది : 16 మే, 2026.

 

శ్రీయుత నారా చంద్రబాబునాయుడు గారికి,

గౌరవ ముఖ్యమంత్రి,

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం,

అమరావతి.

విషయం: వైద్య, ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న డైరెక్ట్ కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల బకాయి వేతనాలు వెంటనే చెల్లించాలని కోరుతూ...

అయ్యా!

వైద్య, ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న డైరెక్ట్ కాంట్రాక్టు ఉద్యోగులకు గత 3 నెలలుగా వేతనాలను చెల్లించడం లేదు. నేషనల్ హెల్త్ మిషన్‌లో దాదాపు 186 క్యాడర్లలలో పనిచేస్తున్న 22 వేల మంది ఉద్యోగులకు ఇప్పటిదాకా వేతనాలను చెల్లించలేదు. ఆరోగ్య మిత్రలకు 2 నెలల వేతన బకాయిలు ఉన్నాయి. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రభుత్వ శాఖలు, సంస్థలలో కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్, సర్వీస్ ప్రొవైడర్ల ఉద్యోగులు పనిచేస్తున్నారు. అతి తక్కువ వేతనాలతో పనిచేస్తున్న వీరికి నెల నెల వేతనాలు చెల్లించక పోవడంతో వీరు తీవ్ర ఆర్ధిక ఇబ్బందులు పడుతున్నారు. సంక్షేమ శాఖలలో ఔట్‌సోర్సింగ్ టీచర్లకు బడ్జెట్ లేదనే సాకుతో వేతనాలను చెల్లించడంలేదు. సోషల్ వెల్ఫేర్ శాఖలో పనిచేస్తున్న సెక్యూరిటీ సిబ్బందికి గత 5 నెలలుగా జీతాలు చెల్లించడంలేదు. వివిధ ప్రభుత్వ ఆసుపత్రులలో కాంట్రాక్టర్ల ద్వారా పనిచేస్తున్న శానిటేషన్ సిబ్బందికి 3 నెలలుగా వేతనాలు చెల్లించడంలేదు. 

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఉద్యోగులకు నెలనెలా వేతనాలు చెల్లిస్తామని హమీని ఇచ్చింది. కాని చిరుద్యోగులైన కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ప్రతి నెలా వేతనాలు చెల్లించకపోవడం న్యాయంకాదు. వెంటనే వివిధశాఖలు, సంస్థలలోని ఉద్యోగులకు వెంటనే వేతన బకాయిలు చెల్లించేలా తగు ఆదేశాలు జారీ చెయ్యాలని, భవిష్యత్‌లో ప్రతి నెల 1వ తేదీనే వేతనాలు చెల్లించేలా రాష్ట్ర ప్రభుత్వం తగు చర్యలు చేపట్టాలని కోరుతున్నాను.

 

అభివందనములతో...

 

(వి.శ్రీనివాసరావు)

రాష్ట్ర కార్యదర్శి