ఆంధ్రప్రదేశ్‌లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎసఐఆర్)పై రాజకీయ పార్టీలతో అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని - అంత వరకు ఎసఐఆర్ కార్యక్రమం నిలుపుదల చేయాలని కోరుతూ..

(ప్రచురణార్థం : ఈ రోజు ఛీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్‌కి సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు రాసిన లేఖను ప్రచురణార్థం/ ప్రసారార్థం విడుదల చేస్తున్నాము. - జె.జయరాం, ఆఫీసుకార్యదర్శి)

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
విజయవాడ,
తేది : 16 మే, 2026.

ఛీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ గారికి,
ఆంధ్రప్రదేశ్.

విషయం: ఆంధ్రప్రదేశ్‌లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎసఐఆర్)పై రాజకీయ పార్టీలతో అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని - అంత వరకు ఎసఐఆర్ కార్యక్రమం నిలుపుదల చేయాలని కోరుతూ...
అయ్యా!
ఆంధ్రప్రదేశ్‌లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) కార్యక్రమాన్ని 2026 జూన్ 5 నుండి అమలు చేస్తున్నట్లు, ఇందుకు రాజకీయ పార్టీల సహకారం అందించాలని, బిఎల్‌వోలను నియమించాలని కోరుతూ మీరు పంపిన లేఖ చూసి ఆశ్చర్యపోయాను. మీరు గుర్తింపు పొందిన వివిధ రాజకీయ పార్టీలతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎసఐఆర్ ప్రక్రియపై పార్టీల సలహాలు, సూచనలు తీసుకోవాలని మా పార్టీతో సహా అందరూ కోరడం జరిగింది. అలాగే 2025 నవంబర్ 20వ తేదీన వామపక్ష పార్టీలు, ఇతర రాజకీయ పార్టీల ప్రతినిధులతోపాటు మిమ్ములను కలిసినప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో సమగ్ర ఓటర్ల సవరణ కార్యక్రమానికి నిర్ణయం తీసుకోలేదని, ఎస్ఐఆర్ (ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ) కార్యక్రమం అమలు చేసే ముందు రాజకీయ పార్టీలతో అఖిలపక్ష సమావేశం జరుపుతామని, ఆయా పార్టీల సూచనలు, సలహాలు తీసుకంటామని మీరు హామీ ఇచ్చారు. కానీ మీరిచ్చిన హామీకి భిన్నంగా ఆంధ్రప్రదేశ్‌లో జూన్ 5 నుండి సెప్టెంబర్ 22 వరకు కార్యక్రమం అమలు షెడ్యూలు ప్రకటించడం ఆశ్చర్యంగా ఉంది. కావున తక్షణం రాజకీయ పార్టీలతో ఓటర్ల జాబితా సమగ్ర సవరణపై అఖిలపక్ష సమావేశం జరపాలని కోరుతున్నాను.
ఇంతకుముందు అనేక రాష్ట్రాలలో ఎస్ఐఆర్ (ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ) అమలులో లక్షల ఓట్లు గల్లంతయ్యాయని ఆరోపణలున్నాయి. సుప్రీం కోర్టులో కేసు ఇంకా పెండింగ్‌లో ఉంది. పశ్చిమబెంగాల్‌లో 90 లక్షల ఓట్లు గల్లంతయ్యాయని వార్తలు వచ్చాయి. ఎస్ఐఆర్ (ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ) అమలు చేసిన తమిళనాడు, బీహార్, కేరళ రాష్ట్రాలలో అక్రమాలు జరిగి, అర్హులైన వేలాది ఓట్లు తొలగించబడ్డారు. పేదలు, వలస కార్మికులు, మైనారిటీలు, బలహీనవర్గాలు, ఓటు హక్కు కోల్పోయినవారిలో ఉన్నారు. హర్యానా, కర్నాటక రాష్ట్రాలలో లక్షలాదిమందిని అక్రమంగా ఓటర్ల జాబితాలో చేర్చినట్లు వెల్లడైంది. బహిర్గతమైన కేసులపై ఎన్నికల కమిషన్ (ఇసిఐ) ఎటువంటి చర్యలూ తీసుకోలేదు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2014లో విభజన అయిన తరువాత వేలాదిమంది తెలంగాణా, హైదరాబాద్, ఇంకా ఇతర ప్రాంతాల నుండి ఆంధ్రప్రదేశ్‌కు తిరిగి వచ్చారు. ఇక్కడ వారికి ఎటువంటి డాక్యుమెంట్స్ ఉండవు. ఈ నేపథ్యంలో వివాదాస్పదమైన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై చర్చించేందుకు వెంటనే అఖిలపక్ష సమావేశం జరపాలని కోరుతున్నాను.
అభివందనములతో...
(వి.శ్రీనివాసరావు)
రాష్ట్ర కార్యదర్శి