
భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
ప్రచురణార్ధం/ప్రసారార్ధం :
విజయవాడ,
తేది : 15 మే, 2026.
పెట్రో ధరల పెంపును ఉపసంహరించాలి
పెట్రోల్, డీజిల్‌పై రూ.3లు పెంచి సామాన్య, మధ్యతరగతి ప్రజలపై భారం వేయడాన్ని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ ఖండిస్తున్నది. పెంచిన ధరలను ఉపసంహరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నది. గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సిపిఐ(యం) కోరుతున్నది.
దేశంలో సరిపడా చమురు నిల్వలున్నాయని ఇప్పటిదాకా నమ్మబలికిన కేంద్ర ప్రభుత్వం ఎన్నికలు పూర్తికాగానే చమురు ధరలు పెంచడం ప్రజలను వంచించడమే. మోదీ పొదుపు చర్యలు ప్రకటించడానికి అసలు కారణం ధరల పెంపుదలకోసమే. ఇప్పటికే వంట గ్యాస్ రూ.50లు, కమర్షియల్ గ్యాస్ దాదాపు రూ.1000లు పెంచడం వలన సామాన్య మధ్యతరగతి ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. చిన్న చిన్న టిఫిన్ సెంటర్లు, హోటళ్లు మూతపడి ఉపాధిలేక ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఇప్పుడు చమురు ధరలు పెంచడం వలన రవాణా రంగంపై పెనుభారం పడనుంది. ఇప్పటికే పిరమైన నిత్యావసర సరుకుల ధరలు మరింత పెరుగుతాయి. అంతిమంగా పేద ప్రజలు ధరలు భారం మోయవలసి వస్తుంది. రాష్ట్ర ప్రజల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం ధరలు తగ్గించాలని ఒత్తిడితీసుకురావాలి. ఇదే సందర్భంలో కెజి బేసిన్‌లో ఆయిల్, గ్యాస్ రాష్ట్రానికి 50% వాటా పొందేలా కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తేవాలని, రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాలని కోరుతోంది. సమస్యను అధిగమించడానికి దీర్ఘకాలంలో రాష్ట్రానికి, ప్రజలపై భారం పడకుండా మేలు జరుగుతుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెంచిన ధరలను ఉపసంహరించాలని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ కోరుతున్నది.
(వి.శ్రీనివాసరావు)
రాష్ట్ర కార్యదర్శి
