తిరుపతి జిల్లా మంగంపేట బెరైటీస్ మైనింగ్ నందు వందల కోట్ల అవినీతిని అరికట్టటం - ఎపిఎండిసి సంస్థను నమ్ముకుని జీవిస్తున్న కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ.

(ప్రచురణార్థం: సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ముఖ్యమంత్రికి వ్రాసిన లేఖను ప్రచురణార్ధం పంపుతున్నాం. - జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి)

 

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

విజయవాడ,

తేది : 08 మే, 2026.

 

శ్రీయుత నారా చంద్రబాబునాయుడు గారికి,

గౌరవ ముఖ్యమంత్రి,

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం,

అమరావతి.

విషయం: తిరుపతి జిల్లా మంగంపేట బెరైటీస్ మైనింగ్ నందు వందల కోట్ల అవినీతిని అరికట్టటం - ఎపిఎండిసి సంస్థను నమ్ముకుని జీవిస్తున్న కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ...

అయ్యా!

తిరుపతి జిల్లా కోడూరు సమీపంలోని మంగంపేట గ్రామంలో నెలకొని ఉన్న అరుదైన భూగర్భ ఖనిజాన్ని విచ్చలవిడిగా విదేశాలకు తరలిస్తూ, తక్కువ ధరలకు ‘ఎంప్రదా’ అనే కంపెనీకి కట్టబెట్టిన వైనంపై సమగ్ర న్యాయ విచారణ జరిపిస్తే వందల కోట్ల రూపాయల అవినీతి వెల్లడవుతుంది. ప్రభుత్వం తను ఎంపిక చేసుకున్న ఎంప్రదా అనే ప్రైవేటు కంపెనీకి టెండర్‌ను కట్టబెట్టింది. ఈ కారణంగా ఎపిఎండిసికి ఏటా ప్రత్యక్షంగా రూ.300 కోట్లు, పరోక్షంగా వెయ్యి కోట్లకు పైగా నష్టం వస్తున్నది.

అంతర్జాతీయ మార్కెట్‌లో సిఅండ్‌డి గ్రేడ్ టన్ను రూ.2 వేలకు పైగా ధర పలుకుతున్నది. ఈ అరుదైన ఖనిజాన్ని రూ.1,188లకు ప్రభుత్వం అమ్ముతున్నది. అంతర్జాతీయ మార్కెట్‌లో విపరీతమైన డిమాండ్ ఉన్నా గత ఏడాది టెండర్‌లో టన్నుకు రూ.1,680లు ధర నిర్ణయం అయింది. ఈ ఏడాది మరింత పెరగాల్సి ఉండగా రూ.492లు తగ్గించి రూ.1,188 లుగా నిర్ణయం చేయడం వెనుక ఎవరి ప్రయోజనాలు దాగి ఉన్నాయో ప్రజలకు వెల్లడి చేయాలని కోరుతున్నాను.

ఈ అరుదైన ఖనిజం దేశంలో మరెక్కడా దొరకదు. కేవలం తిరుపతి జిల్లాలోని మంగం పేటలోనే 95% ఖనిజం లభిస్తుంది. ఈ ఖనిజం వివిధ ఉత్పత్తుల తయారీకి తోడ్పడుతున్నది. బెరైటీస్ ఖనిజాన్ని వినియోగించుకునే 25 రకాల చిన్న, మధ్యతరహా పరిశ్రమల యజమానులు ప్రతి ఏడాది వందలకోట్ల రూపాయల పన్ను ప్రభుత్వానికి చెల్లిస్తున్నారు.

ఈ ఖనిజాన్ని ఆధారం చేసుకుని 170 కంపెనీలు పల్వరైజింగ్‌ను నడుపుతూ వేలాది మందికి ఉపాధిని కల్పించాయి. తగ్గింపు ధరలను ఈకంపెనీలకు వర్తింప చేయకుండా ఎంప్రదా అనే ప్రైవేటు కంపెనీకి ఖనిజాన్ని దోచిపెట్టడం దారుణమని  మేము భావిస్తున్నాను. మైనింగ్‌లో మిగిలి ఉన్న 60 లక్షల టన్నుల ఖనిజంను 20 సంవత్సరాల పాటు దశల వారీగా అమ్ముకుంటూ వస్తే వేలాది మందికి ఉపాధి కల్పించవచ్చు. రాష్ట్ర ఖజానాకు వేల కోట్ల రూపాయలు ఆదాయం వస్తుంది.

ఎపిఎండిసి ఏర్పాటు సందర్భంగా భూములిచ్చి, ఇండ్లను కోల్పోయి, స్థిర, చరాస్తులను త్యాగం చేసిన నిర్వాసితులకు ఇవ్వవలసిన నష్టపరిహారం, ఇతర సౌఖర్యాల అమలులో నేటికీ నిర్లక్ష్యం కొనసాగుతున్నది. పర్మినెంటు ఉద్యోగాలిస్తామని అవుట్ సోర్సింగ్, ట్రయినీ ఉద్యోగాలిచ్చి నిర్వాసితులను మోసం చేశారు. పరిశ్రమను దీర్ఘకాలం కొనసాగిస్తూ కార్మికులకు శాశ్వత  ఉపాధి, పర్మినెంటు ఉద్యోగాలు కల్పించాల్సిందిపోయి అడ్డదిడ్డపు విధానాలతో ఏకపక్షంగా బెరైటీస్ రాళ్లను పౌడర్ చేయకుండా విదేశాలకు తరలిస్తున్నారు. దీని వలన ఈ ప్రాంత కార్మికులు జీవనోపాది కోల్పోతున్నారు.

ఈ పరిశ్రమలలోని అరుదైన ఖనిజాన్ని కాపాడుకుంటూ, అవినీతిని అరికట్టి, దేశీయ అవసరాలకు ప్రాధాన్యతనిచ్చి పరిశ్రమ మనుగడను కాపాడాలని కోరుతున్నాము. కార్మికులను పర్మినెంట్ చేసి నిర్వాసిత కుటుంబాలను ఆదుకోవాలని కోరుతున్నాను.

అభివందనములతో...

 

(వి.శ్రీనివాసరావు)

రాష్ట్ర కార్యదర్శి