ఈరోజు (1 మే, 2026) మేడే సందర్భంగా సిపిఐ(యం) రాష్ట్ర కార్యాలయం వద్ద జరిగిన జెండావిష్కరణ, సభ వివరాలను ప్రచురణార్థం/ ప్రసారర్థం పంపుతున్నాము. - జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి
లేబర్ కోడ్ల రద్దు, కార్మిక హక్కుల రక్షణ కోసం
ఐక్య పోరాటాలు
మేడే పతాకావిష్కరణలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు
కులం, మతం పేరుతో కార్మికులు, శ్రామికుల మధ్య చీలిక తెస్తున్న కేంద్రం
కేంద్రంలో మోడీ అధికారంలోకి వచ్చిన తరువాత కార్మికుల హక్కులను కాలరాశారని, సంస్కరణల పేరుతో వెన్నుపోటు పొడిచారని, దీనికి వ్యతిరేకంగా కార్మికులు, శ్రామికులు, గిగ్ వర్కర్లు, వ్యవసాయ కార్మికులు అందరూ ఐక్యంగా పోరాడాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు కోరారు. అంతర్జాతీయ కార్మిక దినోత్సవం మేడే సందర్భంగా శుక్రవారం ఉదయం సిపిఎం రాష్ట్ర కార్యాలయంలో పతాకావిష్కరణ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లేబర్ కోడ్ల ప్రమాదం ప్రతి ఒక్కరూ గుర్తించాలని, దీనిపై విస్తృత ప్రచారం నిర్వహించాలని అన్నారు. లేబర్ కోడ్లు వచ్చిన తరువాత టాప్ 50 కార్పొరేట్ కంపెనీల ఆదాయం మూడు శాతం పెరిగిందని అన్నారు. ఐటిసి కంపెనీకి రూ.330 కోట్ల లాభాలు వచ్చాయని, అదంతా కార్మికులకు అందాల్సిన వేతనాలేనని అన్నారు. కంపెనీల్లో కార్మిక చట్టాలు అమలు చేయకుండా ఉండటం కోసం వాటిని స్టార్టప్ లుగా మార్చి శ్రమను దోచుకుంటున్నారని అన్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కంపెనీలకు రాయితీలు ఇవ్వాలని చెబుతున్నారని, వారేమీ పేదలపైన, కార్మికులపైనా దయాదాక్షిణ్యాలతో పెట్టుబడులు పెట్టడం లేదని అన్నారు. కార్మికులు లేకుండా ఉత్పత్తి ఉండదని, లాభాలు ఉండవని అన్నారు. విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్ పేరుతో అదానీకి వేల కోట్ల రూపాయలు దోచిపెడుతున్నారని, ఇప్పుడు కొత్తగా అంబానీకి కట్టబెట్టేందుకు సిద్ధమయ్యారని అన్నారు. కృష్ణపట్నంలో 20 ఏళ్ల క్రితం అంబానీకి 2300 ఎకరాలు ఇచ్చారని, దాన్ని బ్యాంకుల్లో తాకట్టుపెట్టి అప్పులు తీసుకున్నారని, కానీ అభివృద్ధి చేయలేదని అన్నారు. ప్రజల ఆస్తిని పెట్టుబడిగా పెట్టి రుణాలు తీసుకుని దోచుకుంటున్నారని అన్నారు. జనాన్ని మోసం చేస్తు అటువంటి వారిని పాలకులు మరింత ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు. గత పదేళ్లలో రాష్ట్రానికి పెద్దగా పెట్టుబడులు రాలేదని, కొత్త ఫ్యాక్టరీ రాలేదని అన్నారు. వచ్చినవి కూడా వెనక్కు పోతున్నాయని తెలిపారు. రాష్ట్రంలో లక్ష ఎకరాలకుపైగా కంపెనీలకు కేటాయించారని, వాటిల్లో ఎంతమంది పరిశ్రమలు పెట్టారో చూపించాలన్నారు. రాష్ట్ర ప్రజలు వారి భూములు కోల్పోతున్నారని, వారి ఆదాయాలు కోల్పోతున్నారని అన్నారు. అందుకని కార్పొరేట్ దోపిడీకి వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఉందని తెలిపారు. చంద్రబాబు నాయుడికి చిత్తశుద్ధి ఉంటే క్యాబినెట్లో ఒక గంట కార్మికుల కోసం చర్చించాలని అన్నారు. ప్రపంచంలో కార్మికుల శ్రమ లేకుండా ఎఐ అయినా, క్వాంటం అయినా ఉత్పత్తి ఉండదని గుర్తించాలని అన్నారు. ప్రసుత పాలకుల తీరుతో కార్మికులు బానిసత్వం వైపు నెట్టబడుతున్నారని తెలిపారు. కార్మికవర్గం ప్రపంచ వ్యాప్తంగా పోరాటాలు ఉధృతం చేస్తోందని, మన దేశంలోనూ ఆందోళనకు జరుగుతున్నాయని, సిఐటియు, సిపిఎం ఆధ్వర్యాన పెద్దఎత్తున పోరాటాలు జరుగుతున్నాయని తెలిపారు.
సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వై.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ సంస్కరణల పేరుతో పేదల భూములను పెద్దలకు కట్టబెడుతున్నారని అన్నారు. ప్రజల సంపదను దోచిపెడుతున్నారని, అనేక పోరాటాలు చేసి కాపాడుకుంటున్న హక్కులను రద్దు చేశారని అన్నారు. వామపక్షాలు మినహా రాష్ట్రంలో తెలుగుదేశం, వైసిపి ఇతర బూర్జువా పార్టీలన్నీ కార్మికులకు వ్యతిరేకంగా చేస్తున్న చట్టాలకు పార్లమెంటులో మద్దతు ఇస్తున్నాయని అన్నారు. వర్గ ఉద్యమాలు, పోరాటాలు విస్తృతంగా నిర్వహించాలని అన్నారు. కార్మికవర్గం, వ్యవసాయ, పేదరైతులు, సన్న, చిన్నకారు రైతులు త్రీవ ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఈ నేపథ్యంలో మేడే సందర్భంగా, పుచ్చలపల్లి సుందరయ్య జయంతి సందర్భంగా కార్మికవర్గ పోరాలను ముందుకు తీసుకెళ్లాలని అన్నారు.
సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బి.తులసీదాస్ మాట్లాడుతూ స్రామాజ్యవాద అమెరికా ఇరాన్‌పై దాడికి పాల్పడి చివరికి వెనక్కు తగ్గిందని అన్నారు. అమెరికాకు బ్రిటన్, జర్మనీ వంటి దేశాలతోపాటు పక్కనే ఉన్న శ్రీలంక కూడా తమ భూభాగాలు వాడుకునేందుకు అవకాశం ఇవ్వలేదని, కానీ భారతదేశం లొంగిపోయి జూనియర్ భాగస్వామిగా వ్యవహరిస్తూ అమెరికాకు వ్యతిరేకంగా మాట్లాడలేకపోతోందని విమర్శించారు. ఇరాన్ సుప్రీం నేత ఖమేనీని చంపేసినా మాట్లాడలేని ప్రభుత్వం, ఇరాన్ చేసిన దాడిపై ఖండన విడుదల చేసిందని అన్నారు. మన దేశానికి అవసరమైన చమురు అవసరాలు తీర్చడంలో ఇరాన్, రష్యా కీలకపాత్ర పోషించాయని అన్నారు. అయినా ఆలీన విధానాన్ని కూడా మోడీ వదిలేశారని అన్నారు. ఇటువంటి సమయంలో ప్రతి ఒక్కరూ అంతర్జాతీయ ధృక్పథంతో వ్యవహరించాలని అన్నారు. ఇటీవల భారతదేశంలో కార్మిక, కర్షక ఐక్యత పెరుగుతోందని, ఢిల్లీలో జరిగిన పోరాటాలే దీనికి నిదర్శమని అన్నారు. సిఐటియు నాయకులు దయా రమాదేవి మాట్లాడుతూ ప్రధాని మోడీ లేబర్ కోడ్ల పేరుతో కార్మికవర్గాన్ని దెబ్బతీస్తున్నారని అన్నారు. వాటిని రద్దు చేసే వరకూ కార్మికులు, శ్రామికులు, మహిళలు పెద్దఎత్తున పోరాడాలని కోరారు. కార్యక్రమానికి సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు జె.జయరాం అధ్యక్షత వహించారు. రాష్ట్ర కమిటీ సభ్యులు యు.వి.రామరాజు, అశోక్, బి.ఆర్.తులసీరావు తదితరులు పాల్గొన్నారు.
