ఆయిల్ సరఫరాను తక్షణం పునరుద్దరించాలి.

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 26 ఏప్రిల్, 2026.

 

ఆయిల్ సరఫరాను తక్షణం పునరుద్దరించాలి

రాష్ట్రంలో డీజిల్, పెట్రోల్ సంక్షోభానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యత వహించాలని, తక్షణమే నివారణ చర్యలు చేపట్టాలని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తున్నది.

రాష్ట్రంలో పెట్రోలు uంకులన్నీ నిండుకున్నాయి. వాహనాల రవాణా ఆగిపోయింది. పనులు మానుకొని ప్రజలు గంటల తరబడి క్యూలైన్లలో ఆయిల్ కోసం పహారా కాస్తున్నారు. జన జీవనం స్తంభించే పరిస్థితి ఏర్పడింది. ముందు చూపులేని ప్రభుత్వ విధానాలు, నిర్లక్ష్యం, అసమర్థ పాలనే ఈ దుస్థితికి కారణం. ఒకటి రెండు రోజుల్లో ఆయిల్ ధరలు పెంచుతారనే ఉద్దేశంతో కంపెనీలు సరఫరాను తగ్గించినా ప్రభుత్వం చూస్తూ మిన్నకుండిపోవడం గర్హనీయం. ప్రజల అవసరాలకు తగినంత ఆయిల్ సరఫరా చేయడానికి ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది.

ఎన్నికలు పూర్తవగానే ఆయిల్ ధరలు పెంచడానికి ప్రజలపై భారం వేయడానికి ఆయిల్ కంపెనీలతో కుమ్మక్కై కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఆయిల్ కంపెనీలు తమ లాభాపేక్షకోసం సరఫరా తగ్గించడంతో రవాణా, చిరువ్యాపారులు, వ్యవసాయ రంగం పనులపై తీవ్రంగా పడింది. ఈ పరిస్థితిని ముందుగా అంచనా వేయకపోవడం, తగు చర్యలు తీసుకోకపోవడం రాష్ట్ర ప్రభుత్వం యొక్క హస్వదృష్టి తెలియజేస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం తక్షణం ఈ సమస్యపై దృష్టి సారించి యుద్ధ ప్రాతిపదికపై ఆయిల్ సరఫరాకు చర్యలు తీసుకోవాలని సిపిఐ(యం) డిమాండ్ చేస్తున్నది. లేని యెడల అశాంతికి గురయ్యే ప్రజలు ఆందోళనకు దిగాల్సిన పరిస్థితి వస్తుందని హెచ్చరిస్తున్నది.

 

(వి.శ్రీనివాసరావు)

రాష్ట్ర కార్యదర్శి