
(ప్రచురణార్థం: సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ముఖ్యమంత్రికి వ్రాసిన లేఖను ప్రచురణార్ధం పంపుతున్నాం. - జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి)
భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
విజయవాడ,
తేది : 23 ఏప్రిల్, 2026.
శ్రీయుత నారా చంద్రబాబునాయుడు గారికి,
గౌరవ ముఖ్యమంత్రి,
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం,
అమరావతి.
విషయం: అమరావతి ఔటర్ రింగ్‌రోడ్డు నిర్మాణంలో 2013 చట్టం ప్రకారం గ్రామసభలు నిర్వహించి, రైతులు, ప్రజల ఆమోదం తర్వాతే భూసేకరణ చేయాలని కోరుతూ...
అయ్యా!
అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణంలో రైతులకు ఎలాంటి ముందస్తు సమాచారం, చర్చలు లేకుండా ఏకంగా ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వడం అభ్యంతరకరం. అప్రజాస్వామికం. గుంటూరు, ఎన్టీఆర్, పల్నాడు, కృష్ణా, ఏలూరు జిల్లాలలోని రింగ్‌రోడ్డు ప్రభావిత ప్రాంతాల రైతులు తీవ్రమైన ఆందోళనలో ఉన్నారు. 189 కిలోమీటర్ల పొడవు 250 మీటర్ల వెడల్పుతో ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం చేపట్టబోతున్నట్లు పత్రికలలో ప్రకటనలు వస్తున్నాయి. ఇది అత్యంత ఆవశ్యకమైన ప్రాజెక్టు ఏమీ కాదు. ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణం ప్రతిపాదిస్తున్న మండలాలు, గ్రామాల పరిధిలోని భూములు చాలా విలువైనవి. రైతుల, కూలీల జీవనం వాటిపైనే ఆధారపడి ఉంది. ఈ ప్రాంతం భూముల విలువ బహిరంగ మార్కెట్లో కోటి రూపాయల నుండి రెండు కోట్ల వరకు ఉన్నది. భూములు కోల్పోయే రైతులకు వ్యక్తిగతంగా ఎలాంటి నోటీసులు ఇవ్వలేదు. ఎన్నికలకు ముందు మీరిచ్చిన హామీలకు ఇది విరుద్దం.
ఎన్టీఆర్, గుంటూరు జిల్లాలలో కొన్ని గ్రామాలలో సచివాలయాల ముందు ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం కొరకు అవసరమైన భూముల సేకరణకు సంబంధించి సర్వే నంబర్లు, ఎల్ పి నంబర్లు, సేకరించే భూమి విస్తీర్ణం వంటి వివరాలతో నోటీసులు అతికించారు. అందులో ఏ రైతు పొలం ఎంత విస్తీర్ణంలో కోల్పోబోతున్నారు, ఎంత భూమిని ప్రభుత్వం సేకరించబోతుంది వంటి వివరాలు రైతుల వారీగా లేవు. ప్రభుత్వం పత్రికలలో చేసిన ప్రకటన, సచివాలయాల్లో వేలాడదీసిన పత్రాలు పారదర్శకంగా లేవు. రైతులు భయాందోళనలతో ఉన్నారు. ఏ రైతు, ఎంత భూమి కోల్పోతారో స్పష్టంగా రైతులకు తెలియజేయాలి. రైతుల అభ్యంతరాలు స్వీకరించాలి. 2013 భూసేకరణ చట్టం ప్రకారం గ్రామసభలు జరిపి సామాజిక ప్రభావ అంచనా వివరించి రైతులు, ప్రజల ఆమోదం పొందాలి. అటువంటి చట్టబద్ధమైన ప్రక్రియ అమరావతి రింగ్ రోడ్డు ప్రతిపాదిత గ్రామాల్లో ఇప్పటివరకు ఎక్కడా చేపట్టలేదు.
కనుక ప్రభుత్వం అమరావతి రింగ్ రోడ్డు నిర్మాణానికి అవసరమైన భూసేకరణలో పారదర్శకంగా వ్యవహరించాలని, 2013 చట్టం ప్రకారం గ్రామ సభలు జరిపి రైతులు, ప్రజల ఆమోదం తీసుకోవాలని, ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో ఉన్న భూముల రేటుకు అనుగుణంగా ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వాలని కోరుచున్నాను. దేశంలోని అన్ని ముఖ్య నగరాలలో ఔటర్ రింగ్ రోడ్డు, జాతీయ రహదారులు 70 మీటర్ల విస్తీర్ణంతో నిర్మించారు. కానీ అమరావతి రింగ్ రోడ్డును 250 మీటర్లు వెడల్పుతో నిర్మించే ప్రతిపాదనలు ప్రభుత్వం చేస్తున్నట్లు తెలిసింది. ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణాన్ని 70 మీటర్లకే పరిమితం చేయాలని ప్రభుత్వాన్ని కోరుచున్నాను. రైతులు, ప్రజలను భాగస్వాములను చేసి వారి ఆమోదంతోనే ముందుకు వెళ్లాలని కోరుచున్నాను.
అభివందనములతో...
(వి.శ్రీనివాసరావు)
రాష్ట్ర కార్యదర్శి
