ఆపదలో ఉన్న క్యూబాకు సంఘీభావాన్ని ప్రకటిద్దాం! సహాయాన్ని అందిద్దాం!!

క్యూబా సంఘీభావ సదస్సు

06 ఏప్రిల్, 2026 - యం.బి.విజ్ఞానకేంద్రం - విజయవాడ

తీర్మానం

ఆపదలో ఉన్న క్యూబాకు సంఘీభావాన్ని ప్రకటిద్దాం!

సహాయాన్ని అందిద్దాం!!

లాటిన్ అమెరికాలో కేవలం కోటి జనాభా కల్గిన చిన్న దేశం క్యూబా. తనకు లొంగడం లేదని ఆ చిన్న దేశంపై కక్షగట్టి సుమారు ఆరు దశాబ్ధాలుగా కత్తులు దూస్తోంది అమెరికా. తాజాగా ఇరాన్ తర్వాత క్యూబా అని బెదిరిస్తోంది. తన మాట వినని దేశాలను దురాక్రమణ చేయడం, తనను వ్యతిరేకించే దేశాధ్యక్షులను చంపివేయడం అమెరికా చేస్తున్న దురాగతం. అమెరికా ప్రభుత్వం ఫైడల్ కాస్ట్రోను చంపడానికి 90 సార్లు కుట్ర చేసి విఫలమైంది. బొలీవియాలో చేగువేరా, చిలీ లో అలెండీ, ఇరాక్‌లో సద్దాం హుస్సేన్, లిబియాలో గడాఫీలను చంపింది. ఆప్ఘనిస్తాన్‌ను సర్వనాశనం చేసింది. ఇటీవల వెనుజులా అధ్యక్షుడు మదురో దంపతులను ఎత్తుకుపోయింది. ఇప్ప్పుడు ఇజ్రాయిల్‌తో కలసి ఇరాన్‌పై యుద్ధం చేస్తోంది. ఇరాన్ సుప్రీం లీడర్ ఖొమైనీని హత్య చేసింది. త్వరలో గ్రీన్‌లాండ్, లెబనాన్‌పై యుద్ధం అంటోంది. ఇరాన్ యుద్ధం తర్వాత సోషలిస్టు క్యూబాను స్వాధీనం చేసుకుంటామని బరితెగించి ప్రకటించింది. ఆయా దేశాలకు అణ్వాయుధాలు, టెర్రరిస్టులు, మాదకద్రవ్యాల ముద్రలు వేసి ప్రపంచాన్ని నమ్మబలికించేందుకు ప్రయత్నిస్తుంది. దేశాలపై దురాక్రమణలు, దురాగతాలకు పాల్పడుతోంది. వీటన్నింటి వెనుక ఆయిల్ సంపదను, సహజ వనరులను స్వాధీనం చేసుకోవడమే అసలు రహస్యం.

కాస్ట్రో నాయకత్వంలో చిన్న కరేబియన్ దేశం సోషలిస్టు క్యూబా అనేక విజయాలు సాధించింది. విద్య, వైద్యంలో దూసుకుపోయింది. అమెరికా సామ్రాజ్యవాద దురహంకారానికి, హెచ్చరికలకు తలవంచ లేదు. స్వాభిమానంతో ధైర్యంగా తన సార్వభౌమాధికారాన్ని కాపాడుకుంటూ వస్తోంది. అంతర్జాతీయ ఖ్యాతి గడించింది. అలీనోద్యమానికి భారతదేశంతో కలిసి నాయకత్వం వహించింది. మన దేశానికి నమ్మకమైన మిత్రదేశంగా ఉంది. ప్రపంచంలో ఏ దేశానికి కష్టమొచ్చినా ఆ చిన్న దేశం నుండి వందల సంఖ్యలో డాక్టర్లు వెళ్ళి సేవలందించారు. కరోనా సమయంలో సైతం తన డాక్టర్లు, వైద్య బృందాలను పంపించింది. అనేక దేశాలకు వ్యాక్సిన్లు అందించింది. అటువంటి పరోపకారి క్యూబాపై అమెరికా ఆంక్షలు పెట్టి లొంగదీసుకోవాలని విఫలయత్నం చేస్తోంది. ఇపుడు వెనుజులా, రష్యా, మెక్సికోల నుండి క్యూబాకు వచ్చే చమురును అడ్డుకుంటోంది. ఫలితంగా క్యూబాను ప్రస్తుతం చీకటి అలుముకుంది. ఆసుపత్రిల్లో వైద్య సేవలకు, శస్త్ర చికిత్సలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పుట్టిన పసిపిల్లలు సైతం గిలగిలలాడాల్సిన దుస్ధితి. పాఠశాలలు, కర్మాగారాలు, మంచినీటి సరఫరా, వ్యవసాయం, ప్రజారవాణా స్థంబించిపోతున్నాయి. తీవ్ర ఆహార కొరత, మందుల కొరత ఏర్పడింది. ఇండియాతో సహా 185 దేశాలు అమెరికా ఆంక్షలను నిరసిస్తున్నా అగ్రరాజ్యం అని చెప్ప్పుకునే అమెరికాకు ఏ మాత్రం మానవత్వం లేదు.

పాలస్తీనాలో 70 వేల మంది మరణానికి, ఇపుడు ఇరాన్‌లో వేల మంది మరణానికి కారణమౌతున్న అమెరికా యుద్ధోన్మాదం వల్ల మన దేశంలో గ్యాస్, పెట్రోల్, డీజిల్, స్టీల్, సిమెంట్ సహా అన్ని ధరలు పెరిగిపోయాయి. చిన్న హ¤టళ్ళు, వీధి వ్యాపారాలు ఆగిపోయాయి. భవిష్యత్‌లో మరిన్ని ఒడిదుడుకులుంటాయి. ధాన్యం, అరటి, రొయ్యలు, కోడిగుడ్లు, మొక్కజొన్న, పొగాకు, పత్తి, పండ్లు, ఎగుమతులు ఆగిపోయి, ధరలు పడిపోయి రైతాంగం దెబ్బతింటున్నారు.

విపత్కర పరిస్థితులు ఎదుర్కొంటున్న క్యూబాకు సహాయం అందించడం, ఆదుకోవడం మనందరి మానవతా కర్తవ్యం. క్యూబన్ ప్రజలు న్యాయం కోరుతున్నారు. ప్రపంచానికే సాయం చేసిన చేతులకు కష్టకాలంలో స్నేహహస్తం అందించడం, సాయం చేయడం మన విధి. ఒక దేశం కష్టాల్లో ఉంటే ఆదుకోవడం మన బాధ్యత. అమెరికా వల్ల కష్టాల్లో ఉన్న క్యూబా కోసం మనం నిలబడితే మానవత్వం నిలబడుతుంది. తలవంచని క్యూబా ఊపిరి నిలుస్తుంది. ఆక్సిజన్ అందక గిలగిలలాడుతున్న పసి ప్రాణాలు నిలబడతాయి. చేతనైన సాయం చేద్దాం. మానవాభి వృద్దిలో ప్రపంచానికే ఆదర్శంగా ఉన్న క్యూబాకు అండగా నిలుద్దాం. అమెరికా దుశ్చర్యలను నిరసిద్దాం. క్యూబా సంఘీభావ నిధికి విరాళాలివ్వాలని విజ్ఞప్తి చేస్తున్నాము.

విరాళాలకు క్యూఆర్ కోడ్ స్కాన్ చేయగలరు.

= = = =