పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడు పట్టణం పెదపేటలో ఉద్రిక్తతలు నివారించి, సామరస్యాన్ని కాపాడాలని కోరుతూ..

(ప్రచురణార్థం: సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ముఖ్యమంత్రికి వ్రాసిన లేఖను ప్రచురణార్ధం పంపుతున్నాం. - జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి)

 

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

విజయవాడ,

తేది : 28 మార్చి, 2026.

 

శ్రీయుత నారా చంద్రబాబునాయుడు గారికి,

గౌరవ ముఖ్యమంత్రి,

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం,

అమరావతి.

విషయం: పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడు పట్టణం పెదపేటలో ఉద్రిక్తతలు నివారించి, సామరస్యాన్ని కాపాడాలని కోరుతూ...

అయ్యా!

పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడు పట్టణంలో పెదపేట (దళితపేట)లో స్థానిక ప్రజల అభీష్టానికి విరుద్దంగా శిధిలావస్థలో ఉన్న ఆలయం స్థానంలో రామాలయం నిర్మిస్తామని ఉండి ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్ కె.రఘురామకష్ణ రాజు ఏకపక్షంగా పేటలోకి వెళ్ళి ప్రకటించడంతో వివాదం రాజుకుంది. ఆ పేటలోని దళితులు దీన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఇది పూర్వం నుండి సత్రం. ఇక్కడ గొంతేనమ్మ (నందెమ్మ)కు పూజలు నిర్వహించుకొనేవారు. ఇప్ప్పుడు కూడా అలాగే కొనసాగుతుందని ఎమ్మెల్యే ఎదుటే తేల్చి చెప్పారు. అంతేస్థాయిలో ఎమ్మెల్యే కూడా ఈ స్థలంలో రామాలయాన్నే కట్టితీరతామని రెచ్చగొట్టే రీతిలో మాట్లాడారు. గత నెల రోజులుగా వివాదం నడుస్తుండగా దీన్ని సామరస్యంగా పరిష్కరించే ప్రయత్నం చేయకపోగా మార్చి 27 శ్రీరామనవమి సందర్భంగా రఘురామకష్ణ రాజు, పెదపేటకు సంబంధంలేని బయట వాళ్ళతో, తన అనుచరులు, తన సెక్యురిటీ, బౌన్సర్లతో భారీ ఎత్తున పోలీసు బలగాలతో పెదపేటలోని శిధిలావస్థలో ఉన్న ఆలయం వద్దకు ఉద్దేశపూర్వకంగా వెళ్ళి దండలు వేయడంతో ఉద్రిక్తత మరింత పెరిగింది. అతని అనుచరులు ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టేవిదంగా వివాదాస్పద నినాదాలు చేయడంతో స్థానికులకు, బయటి నుండి రఘురామకష్ణ రాజుతో వెళ్ళిన వారికి మధ్య ఘర్షణ జరిగింది. వివాదస్పదంగా ఉన్న ప్రాంతంలోకి ఎమ్మెల్యేని వెళ్ళకుండా  పోలీసులు నివారించి ఉంటే ఈ ఘటన జరిగి ఉండేది కాదు. ఈ ఘర్షణ ఆకివీడు పట్టణంలో అశాంతికి కారణమైంది.

ఈ మొత్తం వ్యవహారంలో ఉద్రిక్తతకు, ఘర్షణకు దారితీయడానికి ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్ కె.రఘురామకష్ణ రాజు వైఖరే కారణంగా కనబడుతోంది. ప్రజాప్రతినిధిగా సమస్యను, వివాదాన్ని శాంతియుతంగా పరిష్కరించడానికి బదులు ఇరువర్గాలను రెచ్చగొడుతూ ఘర్షణకు మూలకారణం అవుతున్నారు.

జరిగిందిది కాగా మీకు పొరపాటు సమాచారం అందినట్లుగా మీడియాలో మీ వ్యాఖ్యానాలను బట్టి అర్థమవుతున్నది. మీరు సమగ్రంగా విచారించి సమస్యను స్థానిక ప్రజల మనోభీష్టానికి అనుగుణంగా పరిష్కరించాలని కోరుతున్నాను.

రఘురామకష్ణ రాజు వైఖరిని నివారించి ఉద్రిక్తతలు పెరగకుండా ప్రజల మధ్య శాంతి, సామరస్యాన్ని కాపాడే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను.

 

అభివందనములతో...

(వి.శ్రీనివాసరావు)

రాష్ట్ర కార్యదర్శి