
భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
ప్రచురణార్ధం/ప్రసారార్ధం :
విజయవాడ,
తేది : 26 మార్చి, 2026.
రాజధానిపై సమగ్ర విధానం రూపొందించాలి
ఈనెల 28వ తేదీన రాష్ట్ర రాజధానిగా అమరావతిని చట్టబద్ధం చేయటం కోసం అసెంబ్లీ ప్రత్యేక సమావేశం జరుగుతున్న సందర్భంగా రాజధానిపై సమగ్ర విధానం రూపొందించాలని సిపిఎం రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తున్నది. గత అనుభవాన్ని దష్టిలో పెట్టుకొని 2024 జూన్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రాజధానికి చట్టబద్దత కల్పించాలని సిపిఐ(యం) డిమాండ్ చేసింది. కాని ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల అది రెండేళ్ళు ఆలస్యమైంది. కేంద్రం ఇప్పటికే 12 సంవత్సరాలు జాప్యం చేసింది. ఇప్పుడైనా తీర్మానం అవసరమే. 2014లో రాజధాని పై ప్రత్యేకంగా కేంద్రీకరించినా ఒక్క అడుగు కూడా ముందుకు కదలని కారణంగా చివరకు దాని అస్తిత్వమే ప్రమాదంలో పడిన అనుభవం నుండి రాష్ట్ర ప్రభుత్వం పాఠాలు నేర్చుకోవాలి. ఆచరణ సాధ్యం కాని మెగా ప్రాజెక్టులు, మాస్టర్ ప్లాన్లు చేపట్టి చివరికి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేయడం, ఆ భారాన్నంతా ప్రజలపై మోపటం సమ్మతం కాదు. రాష్ట్ర విభజన అనంతరం రాజధానిని నిర్మించే బాధ్యత కేంద్రంపై ఉన్నది. కానీ కేంద్రం ఆ బాధ్యతనుండి తప్పుకొని అప్పులు ఇప్పించేందుకు మాత్రమే పరిమితమవుతున్నది. అందువల్ల అసెంబ్లీలో ప్రత్యేక నిధుల కోసం తీర్మానం చేసి కేంద్రానికి పంపాలి. అలాగే గతంలో అసెంబ్లీ ఆమోదించిన 29 గ్రామాలనే క్యాపిటల్‌గా వేగంగా ఒకే దశలో రాజధానిని నిర్మించాలి. దాన్నే రాజధానిగా చట్టబద్ధం చేయాలి. అమరావతి చుట్టూ అభివృద్ధి అయ్యే మిగతా ప్రాజెక్టులన్నీ రాజధాని చట్ట పరిధి నుంచి విడగొట్టాలి. ఇప్పటికే భూ సమీకరణ కింద రైతుల నుండి తీసుకున్న భూములన్నిటికీ చట్ట ప్రకారం ప్లాట్లు, పెన్షన్లు, ఇతర వాగ్దానాలు అమలు చేయడంపై కేంద్రీకరించాలి. ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్సార్ కాంగ్రెస్ శాసనసభ్యులు కూడా ఈ అసెంబ్లీ సమావేశాలకు హాజరై గతంలో తాము చేసిన పొరపాటును దిద్దుకొని ఈ తీర్మానాన్ని బలపరచాలని సిపిఐ(యం) కోరుతున్నది.
అమరావతికి చట్టబద్ధత కోసం చేసే తీర్మానంలో ఈ క్రింది అంశాలను పరిగణనలోనికి తీసుకోవాలని సిపిఐ(యం) రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుచున్నది.
(1) విభజన చట్ట ప్రకారం రాజధాని నిర్మాణానికి అయ్యే ఖర్చు భరించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే. ఇప్పటికి తీసుకున్న అప్పులను కేంద్రమే భరించాలి. నిర్మాణమే కాకుండా పూలింగ్ చట్టం అమలుకు కేంద్రం సహాయం చేయాలి.
(2) రాజధానికి రెండు, మూడు తదుపరి దశల భూ సమీకరణ ఆపాలి. మొదట ప్రకటించిన 217 కిలోమీటర్ల విస్తీర్ణాన్ని మాత్రమే రాజధానిగా ప్రకటించాలి.
(3) అమరావతి అభివృద్ధితోపాటు రాష్ట్రంలోని వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్రాధాన్యతగా నిధులు ఇచ్చి అభివృద్ధి చేయాలి. విశాఖ ఉక్కు పరిరక్షణతో పాటు కడప ఫ్యాక్టరీని వెంటనే ప్రారంభించాలి.
(4) రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ప్రత్యేక హోదా ప్రకటించాలి. విభజన చట్టంలోని హామీలన్నీ త్వరితగతిన అమలు చేయాలి. అందుకు అవసరమైన నిధులన్నీ కేంద్ర ప్రభుత్వం భరించాలి.
(వి.శ్రీనివాసరావు)
రాష్ట్ర కార్యదర్శి
