ప్రీపెయిడ్ మీటర్ల ఏర్పాటు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి.

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 24 మార్చి, 2026.

ప్రీపెయిడ్ మీటర్ల ఏర్పాటు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి

రాష్ట్ర ప్రభుత్వం అప్పు తెచ్చుకోవడానికి కేంద్రం విధించిన షరతులకు అంగీకరించి, ప్రభుత్వ కార్యాలయాలకు, సంస్థలకు స్మార్ట్ ప్రీపెయిడ్ మీటర్లను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన జివో 22 (మార్చి 23న)ను ఉపసంహరించుకోవాలని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తున్నది. విద్యుత్ రంగ సమర్థతను పెంచడానికి సంస్కరణలు తీసుకువస్తున్నానని ప్రజలను మభ్యపెట్టిన ప్రభుత్వం యొక్క అసలు నైజం ఈ జివోతో బయటపడింది. కావున ప్రజలకు తీవ్ర హాని కలిగించే ఈ నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నది.

సాధారణ వినియోగదారులందరికీ స్మార్ట్ ప్రీపెయిడ్ మీటర్లను ఏర్పాటు చేయడానికి ముందు ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు వాటిని బిగించాలని ఈ జీవోలో పేర్కొనడం ద్వారా ఇకపై రాష్ట్రమంతటా స్మార్ట్ ప్రీ పెయిడ్ మీటర్లను ఏర్పాటు చేస్తారని స్పష్టం అవుతోంది. ప్రభుత్వ కార్యాలయాలు సంస్థలను ఆయా శాఖాధిపతుల (హెచఓడి), వేతన చెల్లింపు అధికారుల (డిడిఓ) వారీగా స్మార్ట్ ప్రీపెయిడ్ మీటర్లను బిగించాలని జీఓ 22లో పేర్కొన్నారు. చెల్లించిన డబ్బు మేరకు కరెంటు వినియోగించాక రీఛార్జి చేయకపోతే డిస్కనెక్ట్ చేయాలని జీవోలో ఆదేశించారు. ఎన్నో ప్రభుత్వ శాఖల్లో నెలవారీ కాదు కదా ఏడాది నాటికి కూడా బిల్లులు చెల్లించని పరిస్థితి ఉంది. కనుక ఈ మీటర్లు బిగించాక బిల్లుల చెల్లింపు తేడా వస్తే విద్యాసంస్థలు, అంగన్వాడీ కేంద్రాలు తదితర సామూహిక ప్రజా వినియోగ భవనాలకు హఠాత్తుగా కరెంటు నిలిచిపోయే ప్రమాదం ఏర్పడుతుంది. విద్యార్థులు, ఆయా తరగతుల ప్రజలు కష్టాల పాలవుతారు.

గతంలో స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ నాయకులు ఉద్యమాలు ఆందోళనలు చేయడమే గాక హైకోర్టులో కేసు కూడా దాఖలు చేశారు. ప్రతిపక్షంలో ఉండగా వ్యతిరేకించిన వారు అధికారానికి వచ్చాక ఇలా ప్రజా వ్యతిరేక చర్యలకు పాల్పడడం తగదు. ప్రజలపై విద్యుత్ భారాలు వేయడంలోనూ స్మార్ట్ ప్రీపెయిడ్ మీటర్ల విషయంలోనూ గత వైసిపికి, ఇప్పటి టిడిపి కూటమి ప్రభుత్వానికి ఏమీ తేడా లేదని విధితం అవుతోంది.  రాష్ట్ర ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్న స్మార్ట్ ప్రీపెయిడ్ మీటర్ల ఏర్పాటుకు సంబంధించిన జీవో 22ను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. హానికరమైన విద్యుత్ విధానాలకు వ్యతిరేకంగా నిరసనలు, ఆందోళనలు చేపట్టాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం.

 

 

(వి.శ్రీనివాసరావు)

రాష్ట్ర కార్యదర్శి