
ఈ రోజు (23 మార్చి 2026) సిపిఐ(యం) రాష్ట్ర కార్యాలయం విజయవాడలో భగతత్‌సింగ్, రాజ్‌గురు, సుఖదేవ్ ల వర్ధంతి కార్యక్రమం జరిగింది. ఆ కార్యక్రమ వివరాలను ప్రచురుణార్ధం పంపుతున్నాము. ` జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి
ప్రపంచానికి ప్రమాదంగా సామ్రాజ్యవాదం
సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు రమాదేవి
భగత్‌సింగ్, రాజగురు, సుఖదేవ్‌కు నివాళి
సామ్రాజ్యవాదం ప్రపంచదేశాలపై యుద్ధాలకు దిగుతూ సామాన్య ప్రజలను చంపుతూ ప్రమాదకరంగా మారిందని, స్వాతంత్య్ర పోరాటవీరులు భగత్‌సింగ్, రాజగురు, సుఖదేవ్ స్ఫూర్తితో దానికి వ్యతిరేకంగా పోరాడాలని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు డి.రమాదేవి అన్నారు. సోమవారం ఉదయం సిపిఎం రాష్ట్ర కార్యాలయంలో భగత్‌సింగ్, రాజగురు, సుఖదేవ్ వర్థంతి కార్యక్రమం నిర్వహించారు. తొలుత విప్లవవీరుల చిత్రపటాలకు రమాదేవి, వైవి తదితరులు పూలమాలవేసి నివాళులరల్పించారు. అనంతరం సిపిఎం ఆఫీసు కార్యదర్శి జె.జయరాం అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో రమాదేవి మాట్లాడారు. సోషలిస్టు సమాజం అయితేనే ప్రజలకు స్వేచ్ఛ సమానత్వం ఉంటుందని భగత్‌సింగ్ నమ్మారని అన్నారు. బ్రిటీష్‌వారికి వ్యతిరేకంగా చిన్న వయస్సులోనే స్వాతంత్య్రపోరాటంలోకి దిగారని, సోషలిస్టు రిపబ్లికన్ ఆర్మీగా మార్చి యువతను చైతన్యం చేశారని తెలిపారు. ఆ క్రమంలోనే ఆనాటి జాతీయోద్యమ నాయకులు లాలలజపతిరాయ్‌మీద సాగిన దాడికి ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నారని తెలిపారు. వ్యక్తులను చంపడం కాదని, బ్రిటీష్ ప్రభుత్వం పోయి స్వదేశీ పాలన రావాలని కోరుకున్నారని తెలిపారు. ప్రస్తుతం సామ్రాజ్యవాదం ఇరాన్‌పై దాడి చేయడం ద్వారా ప్రపంచ పెత్తనాన్ని నిలబెట్టుకునేందుకు ప్రయత్నిస్తోందని తెలిపారు. దీని ప్రభావం భారతదేశంపై అనేక రూపాల్లో ఉందని తెలిపారు. యుద్ధాలు పోవాలంటే సామ్రాజ్యవాదం పోవాలని, సమూలంగా మార్చాల్సిన అవసరం ఉందని తెలిపారు. ప్రస్తుతం హిందూత్వం పేరిట విద్వేషాలను రెచ్చగొడుతున్నారని, వాటిని కూడా ఎదుర్కోవాలన్నారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వై.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ 24 సంవత్సరాల చిన్నవయస్సులో బ్రిటీషర్లకు వ్యతిరేకంగా పోరాడుతూ ఉరితీయబడ్డారని అన్నారు. ఆయన నిరంతరం అధ్యయనం చేసేవారని, ప్రపంచ పరిణామాలు మన దేశంపై ఎలా ఉంటుందో అధ్యయనం చేసేవారన్నారు. సోషలిస్టు భావజాలాన్ని నిరంతరం పరిశీలించారని, అయితే నేటి పాలకులు సోషలిస్టు అనే పదాన్నే రద్దు చేయాలని చూస్తున్నారని, పైగా ఆయనకు పోటీగా వీరసావర్కర్‌ను ముందుకు తీసుకొస్తున్నారని తెలిపారు. బ్రిటీష్‌వారికి లొంగిపోయిన వీరసావర్కర్ యువత బ్రిటీషు వారికి వ్యతిరేకంగా పోరాడకుండా చూస్తానని లేఖరు రాశారని, అటువంటి వ్యక్తిని భగత్‌సింగ్‌తో పోలిక పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. నేటి పాలకవర్గాలు ప్రజలను పట్టించుకోకుండా, యువతను పక్కదారి పట్టించేందుకు నిర్వీర్యం చేసేందుకు మద్యం, మాదకద్రవ్యాలు, గంజాయి వంటివాటిని ముందుకు తెస్తున్నాయని తెలిపారు. పైకిమాత్రం మాదకద్రవ్యాలను ఎదుర్కొనేందుకు కషి చేస్తున్నామని ప్రచారం చేస్తున్నాయని తెలిపారు. ఈ సందర్భంగా మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వి.రాంభూపాల్, రాష్ట్ర కమిటీ సభ్యులు ఎం.సూర్యారావు, ఎ.అశోక్, యు.వి.రామరాజు, బి.ఆర్.తులసీరావు తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు ప్రజానాట్యమండలి రాష్ట్ర కార్యదర్శి అనిల్, నాయకులు జగన్, హనీఫ్ తదితరులు విప్లవ గేయాలు ఆలపించారు.
