ఇరాన్‌పై దాడులను వెంటనే ఆపాలి.

ఇరాన్‌పై దాడులను వెంటనే ఆపాలి
- పది వామపక్ష పార్టీల డిమాండ్‌
విజయవాడ, మార్చి 12:
ఇరాన్‌పై ఇజ్రాయేల్‌, అమెరికా చేపట్టిన దాడులను వెంటనే నిలిపివేయాలని పది వామపక్ష పార్టీలు డిమాండ్‌ చేశాయి. అమెరికా సామ్రాజ్యవాదంతో చేస్తున్న దాడులను ప్రపంచ దేశాలు ఖండించాలని, ప్రజలంతా వ్యతిరేకించాలని కోరాయి. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయేల్‌ దాడులకు నిరసనగా విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రం నుంచి లెనిన్‌ సెంటర్‌ వరకూ నిరసన ప్రదర్శనను గురువారం నిర్వహించాయి. ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి జి.ఈశ్వరయ్య, ఇతర కమ్యూనిష్టు పార్టీల రాష్ట్ర నాయకులు, అనుబంధ ప్రజాసంఘాలు, విద్యార్ధి, యువజన సంఘాలకు చెందిన వందలాదిగా కమ్యూనిష్టు పార్టీల నాయకులు ప్లకార్డులు చేతబూని అమెరికా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా, ఇరాన్‌పై దాడులను ఖండిస్తూ నినాదాలు చేస్తూ ప్రదర్శనను కొనసాగించారు. లెనిన్‌ సెంటర్‌లో నిర్వహించిన సభకు సిపిఎం రాష్ట్ర సమితి సభ్యులు దొనేపూడి కాశీనాథ్‌, సిపిఐ నగర కార్యదర్శి జి.కోటేశ్వరరావులు అధ్యక్షత వహంచారు. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ప్రపంచంపై తన పెత్తనాన్ని పెంచుకునేందుకు, ఖండకావరంతో అమెరికా చేస్తున్న దుర్మార్గమని చెప్పారు. పశ్చిమాసియాలోని సంపద, సహజ వనరులకు దోచుకునేందుకు ఈ దాడులకు పాల్పడుతుందన్నారు. స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి ఇజ్రాయేల్‌తో భారత దేశానికి ఎలాంటి సంబంధాలు లేవన్నారు. ఇజ్రాయేలు జాత్యాహంకార, ఉగ్రవాద దేశంగా పేర్కొన్నారు. మానవాళి నాగరికతకే వ్యతిరేకమైన దేశమని, పాలస్తీనాపై విరుచుకుపడి మారణహోమం సృష్టించిందన్నారు. పాలస్తీనాను ట్రంప్‌ అల్లుడుకు సంబంధించిన రియల్‌ ఎస్టేట్‌ కంపెనీలకు కట్టబట్టడానికి ఆ రెండు దేశాలు కుట్రపన్నాయని తెలిపారు. పాలస్తీనా ప్రజలు సొంత గడ్డపై శరణార్ధుల్లాగా గుడారాల్లో జీవిస్తున్నారంటే ఇంతకంటే సిగ్గు చేటు లేదన్నారు. పాలస్తీనాకు దశాబ్ధాలుగా మన దేశం అండగా ఉందన్నారు. మోడీ వచ్చిన అనంతరం సాంప్రదాయానికి వ్యతిరేకంగా ఇజ్రాయేల్‌ నుంచి ఆయుదాలను దిగుమతి చేసుకోవడంతోపాటు, ఆ దేశం సాగిస్తున్న మారణకాండకు వ్యతిరేకంగా ఒక్క మాట మాట్లాడలేదన్నారు. ఈ రోజు అమెరికా ఇరాన్‌పై మాత్రమే దాడి చేయడం లేదని, ఆ పేరుతో ప్రపంచ దేశాలపై దాడి చేస్తుందని చెప్పారు. విశాఖపట్నంలో నిర్వహించిన అంతర్జాతీయ ఫ్లీట్‌ ఉత్పవాల్లో పాల్గొనేందుకు వచ్చిన నౌక ఒక దానిని శ్రీలంక సమీపంలో అమెరికా దాడి చేసి నీట ముంచిందన్నారు. ఈ చర్యతో దేశ భద్రత ప్రశ్నార్ధకంగా మారిందన్నారు. దేశం చుట్టూ అమెరికా సైనిక స్థావరాలను ఏర్పాటు చేసిందని పేర్కొన్నారు. ఇరాన్‌లో ఉన్న మన రాష్ట్ర ప్రజలు దాడులతో తీవ్ర భయాందోళనలకు గురువుతున్నట్లు చెప్పారు. 5 రాష్ట్రాల్లో రాబోయే ఎన్నికల కారణంగా ధరలు పెంచలేదన్నారు. ఎన్నికల అనంతరం ధరలు విపరీతంగా పెంచే అవకాశం కనిపిస్తుందన్నారు. ఇప్పటికే గ్యాస్‌ సిలిండర్‌ ధరలు పెంచారని వెల్లడించారు. రాష్ట్రంలో కొన్ని చోట్ల సిలిండర్లు దొరకక హోటళ్లు, వ్యాపార సంస్థలు మూతబుడుతున్నాయని తెలిపారు. అవసరమైన గ్యాస్‌లో 50 శాతమే అందుబాటులోకి వస్తుందన్నారు. పలు ఉత్పత్తుల ఎగుమతులు ఎక్కడిక్కడే నౌకాశ్రయాల్లో నిలిచిపోవడంతో రైతులు ధరలు తగ్గి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. దాడుల్లో ఇజ్రాయేలు, అమెరికాలను బలపరుస్తున్న కారణంగా అమెరికాలో 300 బిలియన్‌ డాలర్ల రిఫైనరీకి అనుమతి లభిచిందని చెప్పారు. అమెరికాకు లొంగుబాటును కూడా విజయంగా చెప్పుకుంటున్న మోడీ ఈ దేశాన్ని పాలించేందుకు అనర్హుడని చెప్పారు. ఇరాన్‌ జరుగుతున్న దాడులపై టిడిపి, వైసిపిలు తమ వైఖరిని వెల్లడించాలని డిమాండ్‌ చేశారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి జి.ఈశ్వరయ్య మాట్లాడుతూ.. అమెరికా తన సామ్రాజ్యవాద కాంక్షతో తనకు వ్యతిరేకంగా ఉన్న దేశాల్లో అంతరంగిక కలహాలు ప్రోత్సహించి, అనంతరం ప్రత్యక్షంగా దాడులకు దిగుతుందని వెల్లడించారు. ఇది నిన్న, మొన్న ప్రారంభమైంది కాదన్నారు. కల్నల్‌ గడాఫీ నుంచి వియత్నాం వరకూ అనేక దేశాలపై దాడులు కొనసాగించిందన్నారు. తన మాట వినని దేశాలను సామ, ధాన, బేద దండోపాయాలను కొనసాగిస్తుందని పేర్కొన్నారు. సిపిఐ (ఎంఎల్‌) న్యూడెమోక్రటీ రాష్ట్ర నాయకులు పి.ప్రసాద్‌ మాట్లాడుతూ.. సామ్రాజ్యవాదం అంటేనే యుద్దోన్మాదమని 120 ఏళ్ల కిందట లెనిన్‌ వెల్లడించారని తెలిపారు. అమెరికా ఇరాన్‌పై రక్తపాత యుద్దం, ఇతర ప్రపంచ దేశాలపై రక్తపాత రహిత యుద్దం చేస్తుందన్నారు. సిపిఐ (ఎంఎల్‌) లిబరేషన్‌ పార్టీ రాష్ట్ర నాయకులు హరనాథ్‌ మాట్లాడుతూ.. ట్రంప్‌ విధానాలను అన్ని దేశాలు వ్యతిరేకించాలని కోరారు. ఎస్‌యుసిఐ రాష్ట్ర నాయకులు అమర్‌నాథ్‌ మాట్లాడుతూ.. అమెరికా చేస్తున్న యుద్దాల వల్ల ఆదేశం మరింత సంక్షోభంలో కూరుకుపోతుందన్నారు. సిపిఐ (ఎంఎల్‌) జాస్తి కిషోర్‌, ఎంసిపిఐయు నాయకులు ఖదర్‌బాషా, ఆర్‌ఎస్‌పి నాయకులు జానకిరామ్‌, సిపిఐ (ఎంఎల్‌) న్యూ డెమోక్రసి నాయకులు రామకృష్ణ తదితరులు ఈ సందర్భంగా ప్రసంగించారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వై.వెంకటేశ్వరరావు, వి.రాంభూపాల్‌, సిఐటియు రాష్ట్ర కార్యదర్శి సిహెచ్‌.నరసింగరావు, ఐద్వా జాతీయ నాయకురాలు డి.రమాదేవి, రాష్ట్ర కార్యదర్శి వి.సావిత్రి, శ్రామిక మహిళ రాష్ట్ర కార్యదర్శి కె.ధనలక్ష్మీ, మాజీ ఎమ్మెల్సీ జల్లి విల్సన్‌, సిపిఐ నాయకులు అక్కినేని వనజ తదితరులు పాల్గొన్నారు.