వైజాగ్ - చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ పరిధిలో భూసేకరణలో నిర్వాసితులకు 2013 భూ సేకరణ చట్టం ప్రకారం పూర్తి పరిహారం, ఆరఅండఆర్ ప్యాకేజీ అమలు చేయకుండా అర్సెల్ మిట్టల్ నిప్పన్ స్టీల్ ప్లాంట్ భూమి పూజ నిర్వహించవద్దని కోరుతూ...

(ప్రచురణార్థం: సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ముఖ్యమంత్రికి వ్రాసిన లేఖను ప్రచురణార్ధం పంపుతున్నాం. - జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి)

 

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

తేది : 12 మార్చి, 2026.

విజయవాడ,

 

శ్రీయుత నారా చంద్రబాబునాయుడు గారికి,

గౌరవ ముఖ్యమంత్రి,

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం,

అమరావతి.

విషయం: వైజాగ్ - చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ పరిధిలో భూసేకరణలో నిర్వాసితులకు 2013 భూ సేకరణ చట్టం ప్రకారం పూర్తి పరిహారం, ఆరఅండఆర్ ప్యాకేజీ అమలు చేయకుండా అర్సెల్ మిట్టల్ నిప్పన్ స్టీల్ ప్లాంట్ భూమి పూజ నిర్వహించవద్దని కోరుతూ...

అయ్యా!

మార్చి 23న ఆర్సెల్ మిట్టల్ ` నిప్పన్ స్టీలుప్లాంటుకు భూమిపూజ జరపనున్నట్లుగా మీరు ప్రకటించారు. కాని ఆ ప్రాంతంలో భూ నిర్వాసితుల సమస్యలు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయి. వాటిని మీ దష్టికి తెస్తున్నాను.

వైజాగ్ - చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ ప్రాజెక్ట్‌లో భాగంగా అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలో రాజయ్యపేట, బుచ్చిరాజుపేట, చందనాడ, అమలాపురం, డి.ఎల్.పురం ఐదు పంచాయతీల పరిధిలో 11 గ్రామాల నుండి 5,500 ఎకరాల భూమి రైతుల నుండి బలవంతంగా ప్రభుత్వం సేకరించింది. ఈ సందర్భంగా నిర్వాసితులకు 2013 భూ సేకరణ చట్టం (Right to Fair Compensation and Transparency in Land Acquisition, Rehabilitation and Resettlement Act, 2013) ప్రకారం ఇవ్వాల్సిన పరిహారం మరియు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీలు ఇప్పటివరకు పూర్తిగా అమలు చేయలేదు. అందులో 2,100 ఎకరాల భూమినే స్టీల్‌ప్లాంటుకోసం అర్శెల్‌మిట్టల్‌కు ఇచ్చారు. కానీ న్యాయం జరగని రైతుల, కూలీల, వత్తిదారుల సమస్యలు మీ దష్టికి వచ్చినట్లుగా లేదు. సర్వం కోల్పోయిన నిర్వాసితులకు ఇల్లు నిర్మించుకోవడానికి సమయం ఇవ్వకుండా, ఎలాంటి సౌకర్యాలు కల్పించకుండా ఆగమేఘాలమీద ఇళ్ళు నేలమట్టం చేసి నిర్వాసితులను నడిరోడ్డుపై నెట్టివేయడం సరైందేనా? మానవతా దక్పథంతో ఆలోచించమని కోరుతున్నాను. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో భాగంగా ముందుగా భూములు కోల్పోయిన నిర్వాసితుల సమస్యలను అత్యవసరంగా పరిష్కరించాలని కోరుతున్నాను.

ఈ క్రింది సమస్యలు పెండింగ్‌లో ఉన్నాయి.

(1) రైతులు, నిర్వాసితులకు పూర్తిస్థాయి ప్యాకేజీ, పునరావాసం కల్పించాలి. ఆర్.కార్డులు ఇవ్వాలి.

(2) జిరాయితీ భూములతో సమానంగా డి-ఫారం సాగు భూములకు కూడా పూర్తిస్థాయి పరిహారం చెల్లించాలి.

(3) డి-ఫారం భూముల్లో ఉన్న చెట్లకు చట్టం ప్రకారం నష్టపరిహారం వెంటనే చెల్లించాలి.

(4) వివాహం అయిన ఆడపిల్లలకు భూసేకరణ సందర్భంలో ఇచ్చిన హామీ ప్రకారం నష్టపరిహారం చెల్లించాలి. 

(5) నిర్వాసితులకు ఆరఅండఆర్ ప్యాకేజీ ప్రకారం ఇళ్లు మరియు ఇళ్ల స్థలాలు కేటాయించాలి.

(6) 18 సంవత్సరాలు నిండిన ప్రతి యువతీ, యువకుడికి చట్టప్రకారం ఆరఅండఆర్ ప్యాకేజీ ఇవ్వాలి. 

(8) రైతులు, కూలీలు, మత్స్య, కల్లుగీత కార్మికులు, గొర్రెలు-మేకల పెంపకదారులు, చేతి వృత్తిదారులు వంటి జీవనాధారం కోల్పోయిన వర్గాలను Affected People గా గుర్తించి వారికి 2013 భూసేకరణ చట్టం ప్రకారం రూ.15 లక్షల ప్యాకేజీ ఇవ్వాలి.

(9) ఇళ్లు కోల్పోయి నిర్వాసితులైన ప్రతి కుటుంబానికి రూ.25 లక్షల ప్యాకేజీ ఇవ్వాలి. 

(10) నిర్వాసితుల కాలనీలో 25 రకాల మౌలిక సదుపాయాలు పూర్తిగా కల్పించే వరకు బలవంతంగా ఖాళీ చేయించకూడదు. చట్టప్రకారం నిర్వాసిత కాలనీలో కల్పించాల్సిన మౌలిక సదుపాయాలను వెంటనే ఏర్పాటు చేయాలి.

(11) భూములు కోల్పోయిన నిర్వాసిత గ్రామాల్లో ఉపాధి పనులు కల్పించాలి.

పైన పేర్కొన్న సమస్యలను పరిష్కరించకుండా, నిర్వాసితుల హక్కులను అమలు చేయకుండా అర్శెల్ మిట్టల్ నిప్పన్ స్టీల్ ప్లాంట్‌కు భూమి పూజ నిర్వహించడం అన్యాయం మరియు చట్టవిరుద్ధమని విన్నవిస్తున్నాను. అందువల్ల పై సమస్యలను వెంటనే పరిష్కరించి, నిర్వాసితులకు న్యాయం చేయాలని కోరుతున్నాను.

అభివందనములతో...

(వి.శ్రీనివాసరావు)

రాష్ట్ర కార్యదర్శి