యుద్ధం సాకుతో జరుగుతున్న బ్లాక్ మార్కెట్‌ను అరికట్టాలి

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 11 మార్చి, 2026.

యుద్ధం సాకుతో జరుగుతున్న బ్లాక్ మార్కెట్‌ను అరికట్టాలి

సరసమైన ధరలకు వంటగ్యాస్, ఇతర సరుకులు అందించాలి

` సిపిఐ(యం

ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయిల్ దురాక్రమణ దాడి తర్వాత లాభాపేక్షతో బడా వ్యాపారస్తులు సాగిస్తున్న బ్లాక్‌మార్కెట్‌ను అరికట్టి సరసమైన ధరలకు వంటగ్యాస్, ఇతర సరుకులు అందించాలని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తున్నది. వంటగ్యాస్ ధర పెరగడంతో పాటు బ్లాక్ మార్కెటింగ్ వల్ల సిలిండర్లు దొరకని కారణంగా దేశమంతటా నగరాలు, పట్టణాల్లో హోటళ్లు మూతపడడం లేదా కొన్ని రకాల వంటకాలు లభించడం లేదు. పరిస్థితి ఇలాగే కొనసాగితే సాధారణమైన తోపుడుబండ్లు, చిన్న చిన్న కాకా హోటళ్ల నిర్వాహకుల బతుకులు బజారున పడతాయి. అసంఘటిత కార్మికులు, చిరుద్యోగులకు లభించే టీ, టిఫిన్, భోజనం సరసమైన ధరకు దొరక్కుండా పోయే ప్రమాదం ఏర్పడుతుంది. ఈలోగా వాటి ధరలు అమాంతం పెరిగిపోతాయి. వంటగ్యాస్ కొరత మూలంగా ఆహార లభ్యత మొదలు ఉపాధి వరకు వివిధ రూపాల్లో సమాజంపై దుష్ప్రభావం పడుతుంది. ఇప్పటికే గృహ వినియోగదారులు సిలిండర్ కోసం బుక్ చేస్తుంటే తగిన స్పందన ఉండడం లేదు. ఇంతకుముందు బుక్ చేసిన వారికి కూడా ఐదారు రోజులైనా గ్యాస్ బండ రావడం లేదు. ఇళ్లలో, మార్కెట్లలో ఇటువంటి సమస్యలు ఏర్పడుతుండగా వ్యవసాయ రంగానికి కూడా ఎరువుల లభ్యత సమస్యగా మారనుంది. గ్యాస్ కొరత రాకుండా బ్లాక్ మార్కెట్‌ను అరికట్టేందుకు ప్రభుత్వం వెంటనే తగు చర్యలు చేపట్టాలి. బ్లాక్ మార్కెటింగ్‌కు పాల్పడే వారిని కఠినంగా శిక్షించాలి. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలనంతరం పెట్రోలు, డీజిల్ ధరలు కూడా పెరుగుతాయని వార్తలు వస్తున్నాయి. దాంతో సరుకు రవాణా, ప్రజా రవాణా కూడా భారమవుతాయి. 

గల్ఫ్‌కు ఎగుమతులు ఆగిపోయిన దష్ట్యా గుడ్లు, పండ్లు, బియ్యం, ఆక్వా, గ్రానైట్ తదితర సరుకులు నిల్వపడిపోతున్నాయి. వ్యాపారస్తులు రైతుల నుండి వీటిని ధరలు తగ్గించి కొటున్నారు. ఇరాన్ పక్కనే ఉన్న స్ట్రెయిట్ ఆఫ్ హర్ముజ్ మూత లేదా ఆంక్షల వల్ల ఎగుమతి, దిగుమతులపై తీవ్ర ప్రభావం పడింది. దీన్ని సాకుగా చూపి బడా వ్యాపారస్తులు, మిల్లర్లు ధాన్యం, అరటి సహా పండ్లు తదితర వ్యవసాయోత్పత్తుల ధరలు తగ్గించేస్త్తున్నారు. ఎగుమతులు సజావుగా సాగడానికి యుద్ధం ఆటంకమవుతుంది. రైతులకు, వినియోగదారులకు రక్షణ కల్పించాల్సిన మోడీ ప్రభుత్వం బడా వ్యాపారస్తుల కొమ్ముకాస్తోంది.

ఈ పరిస్థితికి కేంద్ర ప్రభుత్వం యుద్ధాన్ని సాకుగా చూపుతోంది. ఇరాన్ పై యుద్ధానికి తెగబడింది, పశ్చిమాసియాలో ఉద్రిక్తతలకు మూల కారణం ముమ్మాటికి అమెరికా ఇజ్రాయిల్ లే!  అటు ట్రంప్, ఇటు నెతన్యాహు తనకు అనుంగు మిత్రులని చెప్పే ప్రధాని నరేంద్ర మోడీ వినాశకరమైన యుద్ధం నిలుపుదల చేయడానికి వెంటనే కృషి చేయాలి. కేంద్ర ప్రభుత్వాన్ని అన్ని విధాల కాపాడుతున్న తెలుగుదేశం పార్టీ తన పలుకుబడిని వినియోగించి ప్రధానిపై ఒత్తిడి తేవాలని కోరుతున్నాం.

 

 

(వి.శ్రీనివాసరావు)

రాష్ట్ర కార్యదర్శి