ప్రయివేటు విద్యుత్ బస్సులకు ఆర్టీసి డిపోలను అప్పగించడాన్ని ఆపాలని కోరుతూ

(ప్రచురణార్థం: సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ముఖ్యమంత్రికి వ్రాసిన లేఖను ప్రచురణార్ధం పంపుతున్నాం. -జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి)

 

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

విజయవాడ,

తేది : 25 ఫిబ్రవరి, 2026.

 

శ్రీయుత నారా చంద్రబాబునాయుడు గారికి,

గౌరవ ముఖ్యమంత్రి,

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం,

అమరావతి.

విషయం: ప్రయివేటు విద్యుత్ బస్సులకు ఆర్టీసి డిపోలను అప్పగించడాన్ని ఆపాలని కోరుతూ...

అయ్యా!

పి. ఎం. ఈ - పేరుతో ప్రైవేటు  విద్యుత్ బస్సులను పూణే కు చెందిన పినకల్ కంపెనీ నిర్వహిస్తున్నట్లు, దానికోసం 11 డిపోలకు చెందిన 12 స్థలాలను వారికి అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు పత్రికల్లో వార్తలు రావడం ఆందోళనకరం. పీఎం ఈ- బస్సు సేవ పథకంలోని గ్రాస్ కాస్ట్ కాంట్రాక్టు పద్ధతిలో ప్రైవేటు సంస్థల ద్వారా బస్సులు నిర్వహించే పద్ధతి అటు ఆర్టీసీ సంస్థకు, ఇటు ప్రజలకు ప్రయోజనం కాదు. విజయవాడలోని విద్యాధరపురం, గుంటూరు 2, నెల్లూరు 2, తిరుపతిలోని మంగళం డిపోలను పూర్తిగా, మరో 8 డిపోలను పాక్షికంగా ప్రైవేట్ వారికి ఇవ్వాలని ఆర్టీసీ ఉత్తర్వులు ఇవ్వడం, ఆర్టీసీ మనుగడకు, ప్రజల ప్రయోజనాలకు నష్టకరం.

అలాగే మరికొన్ని సీఎన్జీ బస్సులను కూడా నడపనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ కొత్త విధానంపై కార్మిక సంఘాలతో, నిపుణులతో చర్చించడంతో పాటు, ఇతర రాష్ట్రాల్లో అమలుతీరు పై సమగ్రంగా అధ్యయనంచేసిన తర్వాతనే తుది నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నాను.

విద్యుత్ బస్సులను నడపాల్సివస్తే దశలవారీగా ఆర్టీసీ సంస్థ ద్వారానే నడపాలి. అందుకు అనుగుణంగా ప్రభుత్వ నిర్ణయం వుండాలి.

విద్యుత్ బస్సుల పేరుతో ప్రైవేటు కన్సార్టియంలకు కోట్ల రూపాయల విలువచేసే ఆర్టీసీ డిపోలను, స్థలాలను ఇచ్చివేసే ప్రతిపాదనలు అంతిమంగా అర్టీసీకి, ప్రజల ప్రయోజనాలకు నష్టం కలుగచేస్తాయి. స్త్రీ శక్తి పథకము అమలువల్ల ప్రయాణీకుల రద్దీ పెరిగింది. సిబ్బందిపై పని ఒత్తిడి పెరిగింది. డిమాండ్‌కు అనుగుణంగా 4000 బస్సులను, 11 వేల మంది ఉద్యోగుల అవసరం వుందని కార్మికసంఘాలు చెబుతున్నాయి. అలాగే ఆర్టీసీ డిపోలని విస్తరించి రవాణా సౌకర్యాలను మరింత పెంచాల్సివుంది.

డిపోల ప్రైవేటీకరణను ఉపసంహరించుకుని, రద్దీకి అనుగుణంగా బస్సులను, సిబ్బందిని నియమించాలని కోరుతున్నాను.

అభివందనములతో...

 

(వి.శ్రీనివాసరావు)

రాష్ట్ర కార్యదర్శి