(ప్రచురణార్థం: సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ముఖ్యమంత్రికి వ్రాసిన లేఖను ప్రచురణార్ధం పంపుతున్నాం.- జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి)
భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
విజయవాడ,
తేది : 24 ఫిబ్రవరి, 2026.
శ్రీయుత నారా చంద్రబాబునాయుడు గారికి,
గౌరవ ముఖ్యమంత్రి,
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం,
అమరావతి.
విషయం: రాజమహేంద్రవరంలో పాలు కల్తీ మరణాలు మరియు శ్రీకాకుళం జిల్లాలో కలుషిత తాగునీటి కారణంగా డయేరియా వ్యాప్తి - తక్షణం వేగవంతమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ..
అయ్యా!
రాష్ట్రంలో ఇటీవల చోటుచేసుకున్న తీవ్రమైన ప్రజారోగ్య సంక్షోభాన్ని మీ దృష్టికి తీసుకురావడం బాధ్యతగా భావిస్తున్నాను. గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో ఆహార నాణ్యత, పాలు మరియు తాగునీటి నాణ్యత పరిరక్షణలో జరిగిన తీవ్ర వైఫల్యాల కారణంగా ప్రాణనష్టం సంభవించి, ప్రజల్లో భయాందోళన నెలకొన్నది.
(1) రాజమహేంద్రవరం (రాజమండ్రి)లో పాలు కల్తీ విషాదం లాలాచెరువు, చౌడేశ్వరి నగర్ మరియు స్వరూప్ నగర్ ప్రాంతాల్లో ఒక డెయిరీ యూనిట్ ద్వారా సరఫరా చేయబడిన పాలు కల్తీ అయినట్లు మీడియాలో వార్తలొచ్చాయి. ఈ ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు తీవ్రమైన స్థితిలో వెంటిలేటర్పై చికిత్స పొందుతూ ఆక్యూట్ కిడ్నీ ఫెయిల్యూర్తో బాధపడుతున్నారు. ఈ సంఘటన ప్రజల్లో తీవ్ర భయాందోళనలు కలిగించింది. పాలలో ఎథిలిన్ గ్లైకాల్ వంటి విషపూరిత రసాయనం కలిసినట్లు బయటపడటం, సంబంధిత డెయిరీ యాజమాన్యపు తీవ్రమైన నిర్లక్ష్యం మరియు ఘోరమైన పాలనా యంత్రాంగం నిర్వహణ లోపాన్ని స్పష్టంగా సూచిస్తోంది. అంతర్గత నాణ్యత నియంత్రణ వ్యవస్థల వైఫల్యం మరియు నియంత్రణ పర్యవేక్షణ లోపం ఈ ఘటన ద్వారా బయటపడింది. దీన్ని సాధారణ ప్రమాదంగా పరిగణించలేము. ప్రజల ప్రాణాలకు ముప్పు కలిగించే తీవ్రమైన క్రిమినల్ నేరంగా పరిగణించవలసిన విషయం.
(2) శ్రీకాకుళం జిల్లాలో కలుషిత తాగునీటి కారణంగా డయేరియా వ్యాప్తి గత 24 గంటల్లో శ్రీకాకుళం జిల్లాలో కలుషిత తాగునీటి కారణంగా 53 మందికి పైగా (ప్రధానంగా మహిళలు మరియు పిల్లలు) తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ఇది తాగునీటి నాణ్యత పర్యవేక్షణ మరియు నివారణ చర్యల్లో తీవ్రమైన లోపాన్ని సూచిస్తోంది.
ఇవి వేర్వేరు సంఘటనలు కావు. 2024 అక్టోబర్ నెలలో విజయనగరం జిల్లాలోని గుర్ల మండలంలో జరిగిన ఇలాంటి నీటి కాలుష్య ఘటనలో 160 మంది ప్రభావితులై, 7 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో విజయవాడ, గుంటూరు, పిడుగురాళ్ళ వంటి ఇతర ప్రాంతాలలో కూడా ఇటువంటి ఘటనలు పునరావృతమవడం, ఆహార భద్రత అమలు మరియు నీటి నాణ్యత పర్యవేక్షణలో వ్యవస్థాపక వైఫల్యాలను స్పష్టంగా బయటపెడుతోంది. రానున్న వేసవిలో ఇలాంటి వ్యాధులు మరింతగా ప్రబలే అవకాశం ఉంది.
కావున పై విషయాలను దృష్టిలో ఉంచుకుని, ప్రభుత్వం వెంటనే ఈ క్రింది చర్యలు చేపట్టాలని కోరుతున్నాను.
* ఈ రెండు ఘటనలపై ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించాలి. బాధ్యులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలి.
* మరణించిన వారి కుటుంబాలకు రూ.25 లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలి. బాధితులందరికీ ఉచిత మరియు నాణ్యమైన వైద్య చికిత్స అందించాలి. కొత్త ప్రాంతాలకు విస్తరించకుండా ముదస్తు చర్యలు తీసుకోవాలి.
* ప్రాథమిక వైద్యశాలల్లో సిబ్బంది, డాక్టర్ల ఖాళీలను పూరించాలి. 108,104లను అందుబాటులో ఉంచాలి.
* రాష్ట్రంలో అనధికారికంగా నడిచే పాలు, నీటి వ్యాపారంపై తనిఖీలు నిర్వహించి కట్టడి చేయాలి. అలాంటి వాటిపై ఆరోగ్య పరిరక్షణా నియంత్రణ ఉండాలి.
* ప్రభావిత మరియు ప్రమాదంలో ఉన్న ప్రాంతాలకు తక్షణమే శుద్ధి చేసిన, క్లోరినేషన్ చేసిన తాగునీటిని సరఫరా చేయాలి. పైపుల్లో లీకేజీలను అరికట్టాలి. ప్రతి ఇంటికీ నాణ్యమైన పరిశుభ్రమైన నీటిని ఉచితంగా సరఫరా చేయాలి.
* రాష్ట్రవ్యాప్తంగా తక్షణమే ఆధునిక సౌకర్యాలతో కూడిన ఆహార మరియు నీటి పరీక్షా ప్రయోగశాలలను ఏర్పాటు చేయాలి, తద్వారా ఇతర రాష్ట్రాలపై ఆధారపడాల్సిన దుస్థితి లేకుండా చూడాలి.
* రాష్ట్రవ్యాప్తంగా విస్తతంగా ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలి. ఆరోగ్య వలంటీర్లను నియమించి క్యాంపెయిన్ చేయాలి.
నేడు అన్ని ఆహార వస్తువులలో కల్తీ విస్తృతంగా వ్యాపించడం సామాన్య ప్రజల ఆరోగ్యానికి తీవ్రమైన ఆందోళనకర అంశంగా మారింది. ప్రజలకు ఆరోగ్యవంతమైన జీవితం గడపడం ఒక మౌలిక హక్కు అయినందున, ప్రభుత్వం తన విజిలెన్స్ మరియు అధికార వ్యవస్థలను మరింత బలోపేతం చేసి, వినియోగదారులకు, ప్రజలకు సురక్షితమైన మరియు నాణ్యమైన ఆహార పదార్థాలు అందేలా చర్యలు తీసుకోవాలి.
ప్రజల ప్రాణాలు మరియు ఆరోగ్యం అత్యంత ప్రాధాన్యమైనవి. కాబట్టి పై సూచించిన చర్యలకు ప్రాధాన్యతనిచ్చి కాలపరిమితితో కూడిన నివేదికలను ఎప్పటికప్పుడు విడుదల చేయాలని మనవి చేస్తున్నాను. మీరు తక్షణం జోక్యం చేసుకొని సానుకూల చర్యలు తీసుకోగలరని ఆశిస్తున్నాను.
(వి.శ్రీనివాసరావు)
రాష్ట్ర కార్యదర్శి
