
భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
ప్రచురణార్ధం/ప్రసారార్ధం :
విజయవాడ,
తేది : 11 ఫిబ్రవరి, 2026.
నిరాశాజనకంగా గవర్నర్ ప్రసంగం
నేడు అసెంబ్లీలో ఉభయసభలనుద్దేశించి గవర్నర్ చేసిన ప్రసంగం రాష్ట్ర భవిష్యత్తును నిరాశాజనకం చేసిందని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ అభిప్రాయపడింది.
కేంద్రం నుండి రావాల్సిన నిధులు, హక్కుల గురించిగానీ, రాష్ట్రానికి తలమానికంగా ఉన్న విశాఖ ఉక్కు గురించి ప్రస్తావన లేదు. పోలవరం నిర్వాసితుల్ని గవర్నర్ పట్టించుకోలేదు. రాష్ట్రాల హక్కుల్ని గుంజుకొని ఫెడరల్ రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడకపోవడం దారుణం. ఈ 19 నెలల్లో ప్రజలపై వేసిన అదనపు భారాలు, బలవంతపు భూసేకరణ, హామీల అమల్లో వైఫల్యాలు, నిరుద్యోగం గురించి ప్రస్తావన లేదు. కౌలురైతులు, అన్నదాత సుఖీభవ ప్రస్తావన లేదు, ఉద్యోగులకు, పెన్షనర్లకు పిఆర్‌సి ప్రస్తావనే లేదు. విద్య, వైద్య రంగాల్లో ప్రయివేటీకరణ విద్యార్థుల భవిష్యత్తును అంథకారబంధకం చేసింది. రాజకీయ అవినీతి విచ్చలవిడిగా పెరిగింది.
సుమారుగా రెండు సంవత్సరాల కూటమి పరిపాలనలో “చేసింది తక్కువ ` చేస్తామని చెప్తున్నది ఎక్కువ”. అధికారంలోకి వచ్చిన మొదటి రోజుల్లో చెప్పినట్లే ఇప్పటికి కూడా అవే వాగ్దానాల్ని చర్విత చరణం చేస్తున్నారు. ఇంటింటికి ప్రచారం చేసిన సూపర్`6 హామీలు కొన్ని ఇప్పటికీ అమలు చేయలేదు. చేసిన వాటితోనే సంతృప్తి పడుతున్నారు. ఇచ్చిన వాగ్దానాల అమలు గురించి గవర్నర్ ప్రసంగంలో లేకపోవడం శోచనీయం. యువతకు ఉద్యోగాలు గురించి భారీగా ప్రసంగించారు. కానీ ఇప్పటివరకు ఇచ్చినటువంటి ఉద్యోగాలు నామమాత్రం. అంతేగాక ఉద్యోగ భద్రత, కార్మికుల హక్కుల గురించి ఏ రకమైన ప్రస్తావన లేదు. అంగన్‌వాడీ, ఆశా తదితర స్కీంవర్కర్ల వేతనాల పెంపు, భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధి ప్రస్తావన లేదు. నెలకు రూ.1500లు మహిళలకు ఇస్తామని వాగ్దానం చేశారు. కానీ ఆ సూపర్`6 వాగ్దానాల గురించి ప్రస్తావన లేదు. పి`4 పేరుతో బంగారు కుటుంబాలను భారీగా గుర్తించినా ఇంతవరకు సహాయం అందలేదు. అత్యంత వెనుకబడిన దళిత, గిరిజన, మైనారిటీలు మరియు బిసిలకు వాగ్దానాలు తప్ప ఇంతవరకు ప్రత్యేక కేటాయింపులు గాని, ఇచ్చిన హామీలు అమలు గాని లేదు. ఇంటికొక పారిశ్రామిక వేత్తను తయారు చేస్తామన్న ఊకదంపుడు ఉపన్యాసాలు తప్ప సూక్ష, చిన్న పరిశ్రమలు, ప్రత్యేకించి ఎస్సీ, ఎస్టీలకు రావాల్సిన బకాయిల గురించిన ప్రస్తావన లేదు. వెనుకబడిన తరగతులకు ఒక్కటంటే ఒక్క స్కీమ్ కూడా అమలు చేయకపోవడం వారి డొల్లతనాన్ని తెలియజేస్తుంది. యూనివర్సల్ హెల్త్ కవరేజ్ పేరుతో ప్రైవేటీకరణను మభ్యపెట్టి ఆమోదముద్ర వేయడం కనిపిస్తుంది. వీబిగ్రామ్‌జి ద్వారా నిధుల కేటాయింపులో రాష్ట్రంమీద భారం పడుతున్నా కేంద్రాన్ని అడిగే సాహసం చేయలేదు. ఆచరణలోకి రాని నీటి వనరుల గురించి, క్వాంటం టెక్నాలజీ గురించి, పట్టణ సదుపాయాల గురించి, అమరావతి నిర్మాణం గురించి, పరిశ్రమల నిర్మాణం గురించి ఒట్టి గొప్పలు కనిపిస్తున్నాయి. ప్రజల నుండి 15,000 కోట్లకు పైగా విద్యుత్ భారాలను వసూలు చేసిన ప్రభుత్వం 13 పైసలు తగ్గించామని అబద్దాలను గవర్నర్ నోట పలికించారు. పరిపాలన గురించి ఎన్ని ప్రకటనలు చేసినా ఇంతవరకు ప్రజలకు పాలనా సౌలభ్యం లేదు. బ్లాక్ చైన్, క్యూఆర్‌కోడ్ సాంకేతికత అంటున్నారు. కానీ భూమి హక్కుల రికార్డ్ కూడా సక్రమంగా నమోదు కావడంలేదన్న రైతుల ఆవేదన గుర్తించలేదు గవర్నర్ ప్రసంగంలో. ఆచరణకు రాని గొప్ప మాటలు మాత్రమే రాష్ట్రాన్ని అభివద్ధి చేయలేవు. మొత్తం మీద ఈ ప్రసంగం రాష్ట్ర ప్రజలను నిరాశకు గురిచేసింది.
(వి.శ్రీనివాసరావు)
రాష్ట్ర కార్యదర్శి
