
(ప్రచురణార్థం: సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ముఖ్యమంత్రికి వ్రాసిన లేఖను ప్రచురణార్ధం పంపుతున్నాం. - జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి)
భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
విజయవాడ,
తేది : 08 ఫిబ్రవరి, 2026.
శ్రీయుత నారా చంద్రబాబునాయుడు గారికి,
గౌరవ ముఖ్యమంత్రి,
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం,
అమరావతి.
విషయం : ఎన్‌టిఆర్ జిల్లా కిడ్నీ బాధిత మండలాల్లో రోగులకు అవసరమైన మౌలిక సదుపాయాలు, మందులు, త్రాగునీరు, ఆసుపత్రులు తదితర సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరుతూ...
అయ్యా!
ఎన్టీఆర్ జిల్లా ఏ కొండూరు, గంపలగూడెం, తిరువూరు, విస్సన్నపేట, రెడ్డిగూడెం, మైలవరం, జి కొండూరు, కొండపల్లి - ఇబ్రహీంపట్నం, వీరులపాడు, నందిగామ, జగ్గయ్యపేట, వత్సవాయి, పెనుగంచిప్రోలు, విజయవాడ రూరల్ మండలాల్లో 2,500మంది కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారు. జిల్లాలో 4 డయాలసిస్ సెంటర్లు ఉన్నప్పటికీ గత 4 సంవత్సరాల కాలంలో 300మంది ఈవ్యాధితో మరణించారు. 15 తండాలలో గిరిజన ప్రజలు అత్యధికంగా ఉన్న ఏ కొండూరు మండలంలో షుమారు 1000 మందికి పైగా కిడ్నీ పెషేంట్లు ఉన్నారు. వ్యాధి ప్రారంభం నుంచి వైద్య సహాయం అందిస్తే కంట్రోలు చేయవచ్చని దానికోసం కిడ్నీ హాస్పిటల్ నిర్మాణం చేపట్టాలని నిపుణులు సూచించారు. ఈప్రాంతంలో కిడ్నీ హాస్పిటల్ నిర్మాణానికి ప్రభుత్వం అవసరమైన నిధులు మంజూరు చేయాలని కోరుతున్నాను.
డయాలసిస్ చేస్తున్న సందర్భంలో పెషేంట్‌కి ఏమర్జెన్సీ అయితే ఐసియు అవసరం ఉంటుంది. రక్తం పెరుగుదలకి ఐరన్ ఇంజక్షన్ 500 యం.జి. అవసరం ఉంది. ఆ ఇంజెక్షన్లు అందుబాటులో లేవు. డయాలసిస్ చేస్తున్నపుడు బ్లడ్ అత్యవసరంగా అవసరమవుతుంది. బ్లడ్ యూనిట్ అందుబాటులో లేదు. పేషెంట్లకు అవసరమైన Sodium bicarbonet 500 యం.జి. సప్లయి లేదంటున్నారు. కాబట్టి అవసరమైన మందులు అందుబాటులో ఉంచాలని కోరుతున్నాను. ఏ కొండూరు పిహెచ్‌సిలో ఫార్మాసిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్‌లు లేరు. సూపర్ వైజర్లు 4గురికి ఇద్దరు మాత్రమే ఉన్నారు. డయాలసిస్ బెడ్లు ప్రస్తుతం 4మాత్రమే ఉన్నాయి. కావున రోగులకు అవసరమైన మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని కోరుతున్నాను. పై ఇబ్బందుల వలన రోగులు విజయవాడలో ప్రైవేట్ హాస్పిటల్స్‌లో డయాలసిస్ చేయించుకుంటున్నారు. ఖర్చు తడిపి మోపెడవుతుంది.
భూగర్భ జలాల్లో ఫ్లోరైడ్ శాతం ఎక్కువగా ఉండటం వల్ల వ్యాధి ప్రuలుతోంది. కిడ్నీ వ్యాధి విస్తరణకు శుద్ధి చేసిన త్రాగునీరు అవసరం ఉంది. వ్యాధిని అరికట్టడానికి శుద్ధి చేసిన కృష్ణానది నీటిని ఇంటింటికీ కుళాయిల ద్వారా సరఫరా చేయించాలని, దీని కోసం చేస్తున్న పనులను వేగవంతం చేయించాలని కోరుతున్నాను. కిడ్నీ పేషెంట్లకు పౌష్టికాహారం కొంతకాలం అందించి ఆపివేశారు. పునరుద్దరించేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను. కిడ్నీ బాధితుల్లో అత్యధికులు గిరిజనులు అందులోనూ అతి పేదవారు. గతంలో కిడ్నీ వ్యాధితో బాధపడుతూ వైద్యం కోసం ఉన్న కొద్దిపాటి భూమిని కూడా అనేకమంది అమ్ముకున్నారు. అయినప్పటికీ చనిపోతున్నారు. కావున వ్యాధితో చనిపోయిన వారి కుటుంబాలకు ప్రభుత్వం కనీసం ఎకరం భూమి ఇచ్చి ఆదుకోవాలని కోరుతున్నాను.
అభివందనములతో...
(వి.శ్రీనివాసరావు)
రాష్ట్ర కార్యదర్శి
