
ఈరోజు (23 జనవరి, 2026) విలేకర్ల సమావేశం (విజయవాడలో) జరిగింది. ఆ వివరాలను ప్రచురణార్థం/ ప్రసారర్థం పంపుతున్నాము. - జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి
ఉపాధి హామీ చట్టం పరిరక్షణ కోసం జనవరి 30 ప్రతిజ్ఞ
ఫిబ్రవరి 1 వరకు సంతకాల సేకరణ
ఫిబ్రవరి 2 గ్రామ సచివాలయాలకు మహాజర్లు
ఫిబ్రవరి 5 మండల కేంద్రాల్లో ధర్నాలు
30వ తేదీ నుండి 5వరకు జరిగే నిరసనలకు
ప్రభుత్వం దిగిరానిపక్షంలో అవసరమైతే
మార్చిలో ఛలో లోక్‌భవన్ కార్యక్రమం నిర్వహిస్తాం.
కేంద్ర ప్రభుత్వ నిరకుంశ చట్టాలపై
30 నుండి ఫిబ్రవరి 5 వరకూ ప్రచారం
సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బి.వి.రాఘవులు
ప్రజలు తేరుకునేలోపే అమల్లోకి నిరంకుశ చట్టాలు
దేశంలోకి మరలా న్యూక్లియర్ ప్లాంట్లు
విద్యుత్ చట్టాల్లో సవరణలతో పేదలపై భారం
ఉపాధిహామీ చట్టం రద్దుతో సామాజిక న్యాయానికి విఘాతం
లేబర్‌కోడ్ల అమలుతో ప్రమాదంలో కార్మిక హక్కులు
దావోస్ ప్రయాణ ఛార్జీలు కూడా పెట్టుబడులుగా రాలేదు : వి.శ్రీనివాసరావు
మోడీ ప్రభుత్వం ప్రజలు ఆలోచించేలోపే వేగంగా నిరంకుశ చట్టాలను అమల్లోకి తెస్తోందని, ఇందులో భాగంగానే విబిజీరాంజీ, విద్యుత్ చట్టాల సవరణ, లేబర్‌కోడ్లు, సీడ్‌బిల్లు, మినీ అణువిద్యుత్‌ప్లాంటు బిల్లులను ఒకేసారి తీసుకోస్తోందని సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బి.వి.రాఘవులు అన్నారు. శుక్రవారం ఉదయం విజయవాడ బాలోత్సవ భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావుతో కలిసి రాఘవులు మాట్లాడారు. ఈనెల 16 నుండి 18వ తేదీ వరకు కేరళలో సిపిఎం కేంద్ర కమిటీ సమావేశాలు జరిగాయని, 22, 23 తేదీల్లో సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సమావేశాలు విజయవాడలో జరిగాయని వీటిల్లో పలు కీలక అంశాలపైనా, ప్రమాదకరమైన సంస్కరణలపైనా చర్చించినట్లు తెలిపారు.
ఉపాధిహామీ చట్టాన్ని గతంలో ఉన్నదాన్నే అమలు చేయాలని కోరుతూ ఈ నెల 30వ తేదీ నుండి ఫిబ్రవరి 5వ తేదీ వరకూ ఇంటింటి ప్రచారం నిర్వహిస్తామని తెలిపారు. జనవరి 30 మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా ఉపాధి హామీ చట్టం పరిరక్షణకు పోరాడతామని ప్రతిజ్ఞ చేస్తామని, రెండోతేదీ వరకూ సంతకాల సేకరణ చేసి గ్రామ సచివాలయాల్లో మహజర్లు సమర్పిస్తామని, ఐదోతేదీ వరకూ విస్తత ప్రచారం చేసి 5న అన్ని మండల కార్యాýయాల ముందు ధర్నాలు నిర్వహిస్తామని వారు తెలిపారు. విబిజీరాంజీతో ప్రజలకు తీవ్ర హాని జరుగుతుందని, కేంద్రం తనకు నచ్చిన రాష్ట్రాలకు నిధులిచ్చుకునే విధంగా చట్టంలో మార్పులు చేర్పులు చేసిందని, పనిదినాల్లోనూ కోత పెట్టిందని అన్నారు. చట్టం అమల్లోకి వస్తే రాష్ట్రాలు అప్ప్పుల పాలవుతాయని అన్నారు. కొత్త పథకం వల్ల దేశంలో సామాజికన్యాయం పూర్తిగా దెబ్బతిని, దళితులు, పేదలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని అన్నారు. ఇటీవల చేసిన కొన్ని సవరణలతో కూలీలకు పని కల్పించడం కష్టమై, పథకం నిర్వీర్యమవుతుందని అన్నారు. కూలీల అవసరాలకు వీలుగా కాకుండా కేంద్రానికి తోచిన సమయంలో పని ఇచ్చే విధంగా సవరణ పెట్టారని, దీనివల్ల పని కల్పించడం కష్టమవుతుందని అన్నారు. విద్యుత్ చట్టానికి సవరణలు చేయడం ద్వారా పేదలకు అందే క్రాస్‌సబ్సిడీ రద్దవుతుందని పేర్కొన్నారు. రెగ్యులేటరీ కమిషన్ హక్కులను కూడా కేంద్రం లాగేసుకుంటుందని, పేదలపై మోయలేని భారం పడుతుందని తెలిపారు. వీటితోపాటు ఆస్పత్రులు, విద్యా సంస్థలకు ఇచ్చే సబ్సిడీని ఎత్తేస్తారని పేర్కొన్నారు. ఏప్రిల్ ఒకటో తేదీ నుండి లేబర్‌కోడ్లు అమల్లోకి వస్తాయని చెబుతున్నారని, దీనివల్ల కార్మికులు కనీస హక్కులతోపాటు సమ్మె హక్కునూ కోల్పోతారని, ఎనిమిది గంటల పనివిధానం రద్దవుతుందని అన్నారు. యూనియన్ల కోసం కార్మికులు పోరాటాల ద్వారా సాధించుకున్న హక్కులన్నీ నిర్వీర్యం అవుతాయని తెలిపారు. ప్రమాదకరమైన మినీ న్యూక్లియర్ పవర్‌ప్లాంట్లను విదేశీ వ్యక్తులు నేరుగా ఏర్పాటు చేసుకునేలా బిల్లు తెస్తున్నారన్నారు. వాటిల్లో ప్రమాదం జరిగి నష్టం వాటిల్లితే దానికి వారు బాధ్యత వహించరని, ప్లాంటు రేడియేషన్, ప్రాణనష్టానికి కూడా విదేశీ వ్యక్తుల బాధ్యతలేని విధంగా చట్టాలు ఉన్నాయని, ఇవి అమల్లోకి వస్తే అత్యంత ప్రమాదకరమైన పరిస్థితులు ఏర్పడతాయని అన్నారు. సీడ్ బిల్లు వల్ల మోన్‌శాంటో, కార్గిల్ వంటి సంస్థలు వాటికి లాభాలు వస్తాయని, వ్యవసాయం దెబ్బతినిపోతుందని హెచ్చరించారు. ఇటువంటి చట్టాలను అత్యంత వేగంగా కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అమల్లోకి తెస్తోందని వీటిని సిపిఎం వ్యతిరేకిస్తున్నదని, ప్రజలను చైతన్యం చేసేందుకు పెద్దఎత్తున ప్రచారం చేస్తామని తెలిపారు. ఈ మేరకు కేంద్ర కమిటీలో నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. దేశవ్యాప్తంగా రైతులు నిర్వహిస్తున్న సమ్మెకు సంఘీభావం ప్రకటించారు. సంవత్సరాల తరబడి పెట్టుబడుల పేరుతో ఎపి ముఖ్యమంత్రులు ప్రతి ఏడాది దావోస్ తీర్థయాత్రలకు వెళుతున్నారని రాఘవులు పేర్కొన్నారు. అంతర్జాతీయంగా పెట్టుబడులను దెబ్బతీసే విధంగా ట్రంప్ వ్యవహరిస్తుంటే పెద్దఎత్తున నిధులు వస్తున్నాయని వీరు ప్రచారం చేయడం అవివేకమని తెలిపారు. నిజంగా పెట్టుబడులు వచ్చి ఉంటే రాష్ట్రం ఏడోస్థానంలో ఎందుకుందో చెప్పాలన్నారు. మరోవైపు దేశం, రాష్ట్రం నుండి పెట్టుబడులు వెనక్కుపోతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రులుగా ఉన్నవారు మిగులు, ఖాళీగా ఉన్న పనికిరాని భూముల్లో పరిశ్రమలు పెట్టకుండా రైతులు సాగులో ఉన్న భూములను మాత్రమే పరిశ్రమలకు కేటాయిస్తూ పేదలు, దళితులు సాగు చేసుకుంటున్న భూములనే బలవంతంగా లాక్కుంటున్నారని వివరించారు.
లోకేష్ వ్యాఖ్యలు ఆమోదయోగ్యం కాదు
99 పైసలకే తాము భూములు కేటాయిస్తామని, మా ఇష్టమని మంత్రి లోకేష్ వ్యాఖ్యానించడం అమాయకత్వం, అవివేకమని బి.వి.రాఘవులు అన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నామని, రాజరికంలో లేమనే విషయాన్ని గుర్తించాలని హెచ్చరించారు. గతంలో ఇలాగే వ్యవహరించిన వ్యక్తులకు రాష్ట్ర ప్రజలు బుద్దిచెప్పారనే విషయాన్ని గుర్తించాలన్నారు. దీన్నిబట్టి లోకేష్‌వి ఏతరహా వ్యాఖ్యలో ఆయనే చెప్పాలన్నారు. ఎవరు అధికారంలో ఉంటే వారివే భూములనే విధంగా వ్యవహరిస్తే కుదరదని, ప్రజల హక్కులకు భంగం కలిగించిన వారిని భూముల్లో నుండి వెళ్లగొడితే తాము చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. మరోవైపు భూములపై కన్నేసిన పెద్దలు ప్రజల తరుపున ప్రశ్నించేవారిపై పిడి యాక్టులు పెట్టి జైల్లో పెట్టిస్తున్నారని, అనకాపల్లిలో అప్పలరాజుపై కేసు ఇలాంటిదేనన్నారు. కనీసం ఆయనను కలిసేందుకు ములాఖత్‌కు కూడా అవకాశం ఇవ్వలేదని ఇది ప్రభుత్వ అప్రజాస్వామిక విధానానికి నిదర్శమని పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి పదవులు తప్ప అన్ని పిపిపినే
రాష్ట్రంలో ముఖ్యమంత్రి, లోకేష్, గతంలో ఉన్న జగన్ వారి పదవులు తప్ప అన్ని పిపిపి చేస్తున్నారని రాఘవులు తెలిపారు. ప్రైవేటీకరణ కంటే పిపిపి అత్యంత ప్రమాకరమైందని, ప్రభుత్వ నిధులతో ప్రైవేటు వ్యక్తులకు లాభాలు కట్టబెట్టడమేనని ఈవిషయంలో వైసిపి, టిడిపి ఒకే విధానాన్ని అనుసరిస్తాయని తెలిపారు. కేంద్రంలో మోడీ చెప్పినట్లు వీరిద్దరూ చేసుకుపోయారని, ఇప్ప్పుడూ అదే బాటలో ఉన్నారని అన్నారు.
ప్రజల కోసం పాదయాత్రలు చేయడం లేదు
రాష్ట్రంలో గతంలోనూ, ఇప్ప్పుడూ చేసిన, చేస్తామంటున్న పాదయాత్రలు రాజకీయ అధికారం కోసం తప్ప ప్రజల కోసం కాదనే విషయాన్ని ప్రజలు గుర్తించాలన్నారు. శరీరాన్ని కష్టపెట్టి పాదయాత్రలు చేస్తామంటే మంచిదేనని, అది చేసేవారికి ఆరోగ్యమేనని కానీ పాదయాత్రలు ప్రజల కోసం వారి సమస్యల పరిష్కారం కోసం చేయాలని సూచించారు. గతంలో ఇలాంటి పాదయాత్రలు, వైఎసఆర్, చంద్రబాబునాయుడు, జగన్, లోకేష్ అందరూ చేశారని, అవేవీ కూడా ప్రజల కోసం కాదన్నారు.
విమాన ప్రయాణ ఖర్చులు కూడా రావు.
దావోస్ పెట్టుబడులపై సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు
దావోస్ పెట్టుబడుల సదస్సుకు గతంలోనూ, ఇప్ప్పుడూ ముఖ్యమంత్రులు ప్రతిఏటా వెళుతున్నా వారి విమాన ఛార్జీల ఖర్చులంత పెట్టుబడులు కూడా రాలేదని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు విమర్శించారు. ప్రతిఏటా వెళుతున్నా దేశంలో పెట్టుబడుల్లో రాష్ట్రం ఏడోస్థానంలో ఉందని అన్నారు. దావోస్‌లో జరిగిన ఎంఓయు లన్నీ కేవలం రియలఎస్టేట్ వ్యాపారం కోసమని పేర్కొన్నారు. 2014 నుండి వచ్చిన చేసుకున్న ఎంఓయులో ఎక్కువ భాగం నిజరూపం దాల్చలేదని, భూములు లాక్కునేందుకు దీన్నో అస్త్రంగా వాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలను వదిలేసి పాలకులు కార్పొరేట్ల చుట్టూ తిరుగుతున్నారని అన్నారు. ప్రజాస్వామ్యాన్ని హత్యచేసి ప్రజల భూములను పెద్దలకు కట్టబెడుతున్నారని అన్నారు. ఈ విషయంలో గత ప్రభుత్వం చేసిన తప్ప్పులనే ఈ ప్రభుత్వమూ కొనసాగిస్తోందని తెలిపారు. నిజంగా పెట్టుబడులు రావాలంటే ప్రజలకు పనికల్పించి వారికి ఆదాయాలు పెంచాలని, అప్ప్పుడు పెట్టుబడులు వాటంతట అవే వస్తాయని అన్నారు. 30వ తేదీ నుండి 5వ తేదీ వరకూ జరిగే నిరసనలకు ప్రభుత్వం దిగిరానిపక్షంలో అవసరమైతే మార్చిలో చలో లోక్‌భవన్ కార్యక్రమం నిర్వహిస్తామని అన్నారు.
ఇజ్రాయిల్ టెక్నాలజీ అంటే మారణహోమం
ఇజ్రాయిల్ టెక్నాలజీ అంటే ప్రజలను మారణహోమం చేయడమేనని శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఇజ్రాయిల్ అంటే క్రూరమైన దేశమని, ఆ టెక్నాలజీ మారణహోనికి, పౌరులపై నిఘాకు ఉపయోగిస్తారని ఘాటుగా విమర్శించారు. పాలస్తీనాలో వేలమంది ప్రాణాలను హరించి దేశాన్ని స్వాధీనం చేసుకుందని, అటువంటి దేశంతో కలిసి ఇక్కడ టెక్నాలజీని అమల్లోకి తెస్తామంటే ప్రజల హక్కులను హరించడమేనన్నారు. ఇజ్రాయెల్ టెక్నాలజీతో రాష్ట్రంలోని ఐదుకోట్ల మందిపై నిఘా పెడతారని తెలిపారు. అటువంటి ఇజ్రాయిల్‌తో జరిగిన ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలని, ఈ రాష్ట్రంలో ఇజ్రాయెల్ పెట్టుబడుల్ని అనుమతించరాదని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
