
రాష్ట్రంలో కూటమి పాలనలో
అనాగరిక చర్యలు
సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు
కంకిపాడు మండలంలో కూలీలపై దాడిచేసిన వారిని కఠినంగా శిక్షించాలి
జూదం, మద్యం, కోడిపందాల నిర్వహకులపై చర్యలకు డిమాండ్
రాష్ట్రంలో కూటమి ఆధ్వర్యంలో అనాగరిక, అరాచక చర్యలు సాగుతున్నాయని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉప్ప్పులూరు కోడిపందాల శిబిరంలో పనికోసం వెళ్లిన దళితులు, బలహీన వర్గాలపై దాడిచేసి కొట్టిన జూదనిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఎస్‌సి, ఎస్‌టి, ఎట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేయాలని కోరుతూ సిపిఎం ఆధ్వర్యాన మంగళవారం ఉదయం విజయవాడ బీసెంటురోడ్డులో నిరసన కార్యక్రమం చేపట్టారు. జూదం, మద్యం వ్యాపారం, పేకాట వంటివాటిని యథేచ్ఛగా నిర్వహించుకునేందుకు ప్రభుత్వ అనుమతిచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు మాట్లాడుతూ కోడిపందాలు, గుండాట, ఇతర జూదాలు నిర్వాహకులు పనికోసం తోట్లవల్లూరుకు చెందిన దళితులు, బలహీన వర్గాలను తీసుకెళ్లారని పేర్కొన్నారు. డబ్బుల్లో తేడా వచ్చాయనే పేరుతో వారిని కట్టేసి రైల్వేలైనుపై పడేస్తామని బెదిరించి రాత్రంతా కొట్టారని అన్నారు. రాజధానికి కూతవేటు దూరంలో ఇంత అన్యాయం జరిగినా అధికారులు గానీ, ప్రజాప్రతినిధులు గానీ, ఎమ్మెల్యేలు, మంత్రులు ఎవరూ వారి గురించి పట్టించుకోలేదని అన్నారు. పైగా కొట్టిన వారిని కాపాడే పనిచేస్తున్నారని మండిపడ్డారు. పోలీసులు కూడా జూదనిర్వాహకులకు అనుకూలంగా నామమాత్రపు కేసు నమోదు చేశారని అన్నారు. వ్యవసాయ కూలీలను దొంగలుగా ముద్ర వేయడంతో అవమానభారంతో కుంగిపోతున్నారని, పైగా ఎవరొచ్చినా మాట్లాడొద్దని జూద నిర్వాహకులు ఆదేశాలు జారీచేయడంతో వారంతా భయపడిపోతున్నారని అన్నారు. కొట్టడంతోపాటు వీడియోలను సోషల్‌మీడియాలో పోస్టుచేసినా వారిని అరెస్టు చేయకపోవడం చట్టవిరుద్ధమని అప్రజాస్వామికమని తెలిపారు. ఒకవైపు అరాచకంగా వ్యవహరిస్తున్న వారి జోలికి వెళ్లని ప్రభుత్వం ప్రజాసమస్యలపై పోరాడే వారిపై పిడియాక్టు నమోదు చేయిస్తోందని వివరించారు. ప్రజల తరుపున మాట్లాడేవారిని జైల్లో పెడుతూ హింసించేవారికి పెద్దపీట వేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి పనులు చేయడం వల్లే గత వైసిపి ప్రభుత్వం ఇంటికి పోయిందని, వాటిని వ్యతిరేకించి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం అంతకంటే ఎక్కువ దుర్మార్గంగా వ్యవహరిస్తోందని అన్నారు. ఇదే పద్దతి కొనసాగిస్తే కూటమి ప్రభుత్వం కూడా ఇంటికి పోతుందని హెచ్చరించారు. దాడికి గురై భయభ్రాంతులకు గురవుతున్న పేదలకు పోలీసులు రక్షణ కల్పించాలని, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండు చేశారు. సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు డి.రమాదేవి మాట్లాడుతూ సంక్రాంతి పేరుతో కోడిపందాలు, మద్యం, జూదాలు యథేచ్చగా నిర్వహించుకునేందుకు ప్రభుత్వం అనుమతిచ్చిందని అన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం నైతికతను కోల్పోయిందని పేర్కొన్నారు. బాధ్యతగా వ్యవహరించాల్సిన కార్మికశాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ నేరుగా రికార్డింగ్ డ్యాన్సుల్లో పాల్గొన్నారని పేర్కొన్నారు. తోట్లవల్లూరు ఘటనతో పాటు, బాపట్ల జిల్లాలో ఆటో తగిలిందనే పేరుతో అగ్రకులస్తులు ఓ యువకుడిని కట్టేసి కొట్టారని ఇవేవీ రెడ్‌బుక్ రాజ్యాంగానికి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వై.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఉప్ప్పులూరులో దాడికి గురైన దళితులు తీవ్ర భయాందోళనల్లో ఉన్నారని అన్నారు. నిరంతరం శాంతిభద్రతల గురించి మాట్లాడే సిఎం, డిప్యూటీ సిఎంకు ఈ ఘటన కనిపించడం లేదా అని ప్రశ్నించారు. పోలీసు యంత్రాంగం కూడా అధికారపార్టీ నాయకుల కనుస్నల్లో పనిచేస్తోందని, అందువల్లే నిందితులపై చర్యలు తీసుకోవడానికి భయపడుతున్నారని అన్నారు. రాజధానికి దగ్గర్లోనే ఇటువంటి ఘటన జరిగితే రాష్ట్ర ప్రజలకు రక్షణ ఏమిటని ప్రశ్నించారు. బాధితులకు తగిన రక్షణ కల్పించాలని కోరారు. కెవిపిఎస్ రాష్ట్ర కార్యదర్శి ఆండ్ర మాల్యాద్రి మాట్లాడుతూ పనికోసం తీసుకెళ్లి కూలి డబ్బులు ఎగ్గొట్టేందుకు దొంగతనం నేరం మోపారని అన్నారు. ఈ విషయంలో పోలీసు యంత్రాంగం పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరించిందని అన్నారు. దీనిపై మానవ హక్కుల కమిషన్‌కు, ఎస్సీ కమీషన్‌కు ఫిర్యాదు చేస్తామని అన్నారు. సిపిఎం కార్పొరేటర్ బోయి సత్యబాబు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బి.తులసీదాసు, నాయకులు ఎ.వి.నాగేశ్వరరావు, నగర నాయకులు రమణ, దుర్గారావు, సీతారాములు, మురళీ, సోమేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
--
COMMUNIST PARTY OF INDIA (MARXIST)
Andhra Pradesh Committee
H.No. 27-30-9,
Akula vari Street,
Governorpet,
Vijayawada - 520 002.
Phone: 0866-2577202;
Web: www.cpimap.org
